Read more!

బలరాముడు ప్రతిష్ఠించిన మహాలింగం !

 

బలరాముడు ప్రతిష్ఠించిన మహాలింగం !

కౌరవ, పాండవుల మధ్య సంధిని కుదర్చలేకపోయిన శ్రీకృష్ణుడు ఉపప్లావ్య నగరానికి వెళ్ళిపోయాడనీ, అనంతరం కౌరవపాండవులు తమ తమ సైన్యాలను యుద్ధానికి సమాయత్త పరుస్తూ కురుక్షేత్ర పరిసరాలలో విడుదులు ఏర్పరచుకున్నారని బలరామునికి తెలిసింది. ఆ సంగతిని విన్న మరుక్షణం, బలరాముని మనసు దుఃఖపూరితమైంది. వెంటనే ఆక్రూరుడు, గదుడు, సాంబుడు, ఉద్దవుడు, ప్రద్యుమ్నుడు, చారుధేష్ణు లను వెంటబెట్టుకుని పాండవులున్న ప్రాంతానికి చేరుకున్నాడు. బలరాముని చూడగానే ధర్మరాజు ఎదురెళ్ళి సముచిత రీతిన ఆహ్వానించాడు.

అందరినీ కుశల ప్రశ్నలతో పలుకరించిన బలరాముడు, "నేను ఇంతటి దుర్వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. కౌరవ పాండవుల మధ్య యుద్ధం ప్రారంభమవుతోందా? ఈ యుద్ధం వలన సమస్త బంధుకోటికి ఉపద్రవం ముంచుకొస్తోంది కదా! ఇంతకంటే పరమదారుణమైన నిర్ణయం ఏమైనా ఉంటుందా? ఈ సంగతిని గ్రహించినందువల్లే యుద్ధం వద్దంటూ అందరికీ నేను హితవు పిలికాను. అయినా, నామాటను ఎవరూ పట్టించుకున్నవారు కాదు.

ఒకవేళ దుర్యోధనుడు అవాకులు చెవాకులూ పలినప్పటికీ కృష్ణుడు కాస్తంత సంభాళించుకుని సంధిని కుదిర్చి ఉండొచ్చు కదా! అలా కాకుండా కృష్ణుడు ఎందుకు ఆవేశపడినట్లు?! ఇంతకంటే తొందరపాటు చర్య మరేముంటుంది? శ్రీహరికి పాండవులూ, కౌరవులూ ఇద్దరూ బంధు సమానులే! కానీ, చక్రి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్లున్నది. ఏమని చెప్పేది?

ఈ యుద్దంలో పాండవులదే విజయం. కౌరవులకు ఓటమి తప్పదు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదు. అయితే నేను, నా కళ్ళారా ఆ ఘోరాతి ఘోరమైన యుద్ధాన్ని చూడలేను. చూడటమే కాదు, ఆ యుద్ధానికి సంబంధించిన దుర్వార్తలను కూడ వినే ఓపిక నాకు లేదు. అయితే ఒకటి మాత్రం నిజం. శ్రీకృష్ణునికి తెలిసిన ధర్మాధర్మ విచక్షణ, న్యాయాన్యాయ పరిశీలన నాకు తెలియని మాట వాస్తవం. ఏమైనా ఆ ఘోరయుద్ధాన్ని చూడలేక, వినలేక తీర్థయాత్రా పర్యటనతో దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను." బలరాముని మాటలకు శ్రీకృష్ణుడు, ధర్మజాదులతోపాటు ఎవరూ ఎదురు చెప్పలేకపోయారు. అందరికీ ఎంతో ఆప్యాయానురాగాలతో వీడ్కోలు చెప్పిన బలరాముడు పుణ్యక్షేత్ర పర్యటనార్థమై బయలుదేరాడు.

అలా వింధ్యపర్వతప్రాంతాలు, దండకారణ్యాన్ని దాటిన బలరాముడు వినాల్సివచ్చింది. అక్కడి ప్రజలంతా కరువు కాటకాలతో మలమల మాడిపోసాగారు. దానికితోడు, ప్రలంబసూతి అనే రాక్షసుడు, అక్కడి ప్రజాబాహుళ్యాన్ని తన దుష్కృత్యాలతో విపరీతంగా వేధించసాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను తట్టుకోలేక  పోయిన జనం, తమకు ఆ రక్కసుని నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా? అని ఎదురు చూస్తున్న తరుణంలో, బలరాముడు అక్కడకు చేరుకోవడం జరిగింది.

బలరాముని చూసిన ప్రజలంతా, ఆయన కాళ్ళపైబడి తమకు ప్రలంబసూతి రాక్షసుని నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించారు. వారి బాధలను విని, వారిపట్ల కరుణా పూరితుడైన బలరాముడు, ఆ రాక్షసుని తన ఆయుధమైన నాగలితో సంహరించి, రాక్షస సంహరానంతరం ఆ నాగలిని భూమిపై బలంగా నాటాడు. ఆయన నాగలిని నాటినచోట ఒక జలధార ఉద్భవించి, నాగావళిగా పేరొందింది. అనంతరం బలరాముడు, ఆ నాగావళినది ప్రక్కనే ఒక మహాలింగాన్ని ప్రతిష్ఠించి, ఆ లింగాన్ని రుద్రకోటేశ్వరుడనే నామకరణం చేశాడు. బలరాముడు ప్రతిష్ఠించిన ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకై సమస్త లోకవాసులు బారులు తీరి వచ్చి, స్వామి అనుగ్రహానికి పాత్రులై తమ స్వస్థలాలకు చేరుకోసాగారు. ఈ సంగతిని విన్న ఇంద్రుడు కూడ ఉమారుద్రకోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాడు. అయితే ఇంద్రుడు అక్కడకు చేరుకునేసరికి సమయం మించిపోవడంతో నంది, శృంగీశ్వరుడు, బృంగీశ్వరులు ఇంద్రుడిని అడ్డుకున్నారు. ఇంద్రునికీ ద్వారపాలకులకూ మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. ఇంద్రుని మాటలు నందీశ్వరునికి కోపం తెప్పించడంతో, తన కొమ్ములతో ఇంద్రుని దూరంగా విసిరేశాడు. ఫలితంగా ఇంద్రుడు తన శక్తులన్నింటినీ కోల్పోయాడు. ఇంద్రుడు పడిన చోటనే ప్రస్తుతం ఇంద్రపుష్కరిణి అని పిలుస్తున్నారు. సర్వశక్తులను కోల్పోయిన ఇంద్రుడు, తిరిగి తన శక్తులను పొందేందుకై ఆదిత్యుని ప్రార్థించాడు. ఇంద్రుని ప్రార్థనకు ప్రసన్నుడైన సూర్యభగవానుడు, ఇంద్రుడు పడిన చోట వజ్రాయుధంతో తవ్వమని చెప్పాడు. ఇంద్రుడు సూర్యుడు చెప్పినట్లే చేయగా, అక్కడొక సూర్యవిగ్రహం బయటపడింది. అదే నేటి అరసవెల్లి క్షేత్రం. సూర్యుని ప్రార్థించిన ఇంద్రుడు, ఆ తరువాత తగిన సమయానికి ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి చేరుకొని, స్వామిని దర్శించుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు.

ఇంతటి మహ్మాన్వితమైన చరిత్ర కలిగిన ఉమారుద్రకోటేశ్వరాలయం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉంది. శ్రీకాకుళం ఉమారుద్రకోటేశ్వరాలయం పేరు వినగానే అందరికీ కళింగాంధ్ర ప్రాంతంలోని పంచలింగ క్షేత్రాలు జ్ఞప్తికి రావడం సహజం. ఉమారుద్రకోటేశ్వరాలయం - శ్రీకాకుళం పట్టణం, సోమేశ్వర దేవాలయం - గుంప గ్రామం, సంగమేశ్వరాలయం - సంగాం గ్రామం, మణి నాగేశ్వరాలయం - కల్లేపల్లి, పాయకేశ్వరాలయం - పాయకపాడు (ఒరిస్సా), మహాశివరాత్రి సమయాన ఈ పంచలింగ క్షేత్రాలను దర్శించుకుంటే సమస్త పాపాలు తొలగి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పంచలింగ క్షేత్రాలలో ఉమారుద్ర కోటేశ్వరాలయానికి ఓ పత్యేకత ఉంది. ఈ లింగంలో రుద్రకోటిగణాలు గోచరిస్తూంటాయని ప్రతీతి. ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనకు సిద్ధి వినాయకుడు దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలో సీతారామాలయాన్ని చూస్తాము. మరోప్రక్క రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ముఖ మంటపంలో స్వామి ముందు ప్రణమిల్లుతున్న నందీశ్వరుని దాటుకుని, ఇంకొంచెం ముందుకెళితే గర్భాలయం ముందు శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు కనిపిస్తారు గర్భాలయంలో ఉమారుద్ర కోటేశ్వరస్వామి లింగరూపంలో భక్తులను కరుణిస్తూంటాడు. ఆ స్వామికి ఎడమప్రక్క పార్వతీదేవి దర్శనమిస్తుంటుంది. శిల్పకళా శోభితమైన ఈ ఆలయంలో మహాశివరాత్రినాడు ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతూంటాయి. ఈ ఉత్సవాలకు వేలసంఖ్యలో భక్తులు తరలివస్తారు.