పుష్పదంతుడి 'శివ మహిమ్న స్తోత్రమ్'

 

పుష్పదంతుడి 'శివ మహిమ్న స్తోత్రమ్'

విశేష ప్రాచుర్యం పొందిన శివస్తోత్రాల్లో శివ మహిమ్న స్తోత్రమ్ ఒకటి. ఇది దక్షిణభారతంలో కంటే, ఉత్తరభారతదేశంలో మరింత ప్రచారంలో ఉంది. అక్కడ ఏ ప్రముఖమైన శివాలయానికి వెళ్ళినా, ఈ స్తోత్ర పారాయణాలు వినవచ్చు. కాశ్మీర్ శైవులు ఈ స్తోత్రాన్ని ఎంతో మహత్తరమైనదిగా భావిస్తారు.

దీక్షా, దానం, తపః, తీర్థం, జ్ఞానం, యాగాదికాః క్రియాః
మహిమ్నః స్తవ పాఠస్య కలాం నార్హంతి షోడశమ్

వ్రతాలు, దానాలూ, తపస్సులూ, తీర్థయాత్రాలూ,శాస్త్రజ్ఞానం యాగాది కర్మలూ వీటన్నిటి వల్ల కలిగే ఫలం, శివమహిమ్నస్తోత్ర పఠనం వల్ల కలిగే ఫలంలో పదహారో వంతు కూడా ఉండదట.

మహేశాత్ నాపరో దేవః మహిమ్నః నా పరో స్తుతిః
అఘోరాత్ నా పరో మంత్రః నాస్తి తత్త్వం గురో పరమ్

'మహేశ్వరుడిని మించిన దేవుడు లేడు, మహిమ్న స్తోత్రాన్ని మించిన స్తుతి లేదు. అఘోర మంత్రాన్నిమించిన మంత్రం లేదు. గురువును మించిన పరతత్త్వం లేదు' అనే శ్లోకం ద్వారా శివమహిమ చెప్పబడుతోంది.

పాశ్చాత్య చరిత్రకారులు, ఈ స్తోత్రాన్ని గ్రహిలుడు అనే కవి రచించినట్లు చెబుతారు. ఈ కవి క్రీ.శ. 9 వ శతాబ్దం కంటే ఖచ్చితంగా ముందరివాడే. ఎందుకంటే, 9 - 10 శతాబ్దాల నాటికి ఈ స్తోత్రం బాగా ప్రసిద్దమైపోయింది. ఈ స్తోత్రం చెక్కి ఉన్న క్రీ.శ. 1063 నాటి శిలాఫలకం ఒకటి దొరికింది.

అయితే ఈ స్తోత్రాన్ని మొదట చెప్పింది పుష్పదంతుడు అనే గంధర్వుడని స్తోత్రం చివరి శ్లోకాలలో ఉంది. ఈ పుష్పదంతుడిది ఓ విచిత్రమైన కథ.

ఒకానొక కాలంలో కాశీలో గోవిందబట్టు అనే బ్రాహ్మణుడుండేవాడు. ఒకరోజు ఆయన ఇంటికి అతిథిగా వచ్చిన ఒక సాధువుకు కోపం వచ్చి ఇలాంటి ఇంటి ఆతిథ్యం నాకు వద్దని వెళ్ళిపోయాట్ట. ఈ బ్రాహ్మణుడు తన కుమారులను ఇంటి నుంచి బహిష్కరించి, సాధువుకు క్షమాపణలు చెప్పి వెనక్కి పిలుచుకొచ్చి ఆతిథ్య మిచ్చాడట. అలా ఇంటి నుంచి వెళ్ళిపోయిన బ్రాహ్మణ కుమారులలో ఒకడు, తన తప్పుకు పశ్చాత్తాపడి హిమాలయాలలో తపస్సు చేసి, మెప్పించాడు. మరణానంతరం కైలాసప్రాప్తి వరాన్ని పొందాడు. గురువుల దగ్గర శాస్త్రాధ్యయనం చేస్తుండగా, ఒకరోజు యాదృచ్చికంగా ఆ దేశపు రాకుమారి అతడిని ఒక ఉద్యానవనంలో చూసి మోహిస్తుంది. చేతిలో ఉన్న పుష్పాన్ని తన దంతానికి తాకించి, ఆ సైగ ద్వారా పుష్పదంతమనే చోటగల ఆలయానికి రమ్మని రహస్య సందేశం పంపుతుంది. బ్రాహ్మణ కుమారుడు ఆమెను కలసి, ఆమె కోరిక మెర ఆమెను పెళ్ళాడి, ఆ దేశానికి రాజవుతాడు. మరణానంతరం కైలాసం చేరుకుంటాడు.

అక్కడ ఓసారి పార్వతీపరమేశ్వరుల రహస్య సంభాషణలు వినే ప్రయత్నం చేసి, పార్వతీదేవి ఆగ్రహానికి గురై మరలా మానవజన్మను ఎత్తాల్సి వచ్చింది. వరరుచి అనే వ్యాకరణవేత్తగా పుట్టి, ఆ తరువాత జన్మలో గంధర్వుడయ్యాడట. ఏ జన్మను ఎత్తినప్పటికీ శివభక్తిని వదల్లేదు. గంధర్వునిగా అదృశ్యరూపంలో వెళ్ళి, ఒక రాజుగారి తోటలో పూలన్నీ తన శివపూజకు కోసి తెచ్చుకునేవాడు. ఒకనాడు ఆ తోటలో పూలన్నీ తన శివపూజ నిర్మాల్యాన్ని తొక్కాడట. దాంతో గంధర్వశక్తులూ, అదృశ్యరూపం కోల్పోయాడట. రాజభటులు శిక్షిస్తారని అనుమానం కలిగి, ఈ శివమహిమ్న స్తోత్రం గానంచేసి, శివుని మెప్పించి తిరిగికైలాసంలో శివపార్వతులను సేవించే భాగ్యాన్ని పొందాడట.

శివమహిమ్న స్తోత్రమ్ 31 శ్లోకాల చిన్న స్తోత్రమే. కానీ, చాలా ప్రసిద్ధి పొందింది. 'మహిమ్నః' అనే శ్లోకంలో మొదలవుతుంది కనుక, దీన్ని శివమహిమ్న స్తోత్రం అని అంటారు.

మహిమ్నః పారంతే పరమ విదుషః యది అసదృశీ
స్తుతిః బ్రహ్మదీవామపి తదవసన్నాః త్వయి గిరః
అథ అవాచ్యః సర్వః స్వమతి పరిమాణావధి గృణన్ మమాప్యేష స్తోత్రే, హర నిరపవాదః పరికరః

'ఓ శంకరా! నీ మహిమలు సంపూర్ణంగా తెలియని నాలాంటివాడు స్తోత్రం చేస్తున్నాడని, తెలిసిన వాళ్ళే నిన్నుస్తుతి చేయాలంటే అది అసలు కుదిరే పని కాదు. అందుకు బ్రహ్మాదులకు కూడ మాటలు చాలవు. కనుక, చాలీచాలని మాటలతోనే నా చేతయినట్టు నేను నిన్నిలా స్తోత్రం చేస్తున్నాను' అని కవి సవినయంగా ఆరంభిస్తాడు.

'నీ తత్త్వం అవాజ్మానసగోచరం. ఉపనిషత్తులు కూడ నిన్ను 'నేతి - నేతి' (ఇది కాదు, ఇది కాదు) అని తప్ప, ఇదమిత్థం అని స్పష్టంగా చెప్పలేకపోయాయి. అలాంటి నిరాకారుని గ్రహించడం, స్తుతించడం అసాధ్యం. అదే నామరూపాలు గల శివుడుగా నిన్ను భజించడం అంటే ఎవరి మనసు ఉప్పొంగదు.?'

'ఓ శంకరా! అమృతప్రాయమైన తేనెలొలికే మాటలకు నువ్వు సృష్టికర్తవి. కనుక, ఇక ఆ బృహస్పతి మాట్లాడినా నీకు రుచించదు. ఇక నావంటి అల్పుడి స్తోత్రం నీకెలా నచ్చుతుంది? నచ్చదని నాకు తెలుసు. నేను ఈ స్తోత్రం చెప్పుకునేది నీకోసం కాదు. నీ గుణగాన పుణ్యంవల్ల నన్ను నేను పునీతుడిని చేసుకునేందుకు మాత్రమే.' అంటాడు పుష్పదంతుడు.

ఈ స్తోత్రంలో అన్నింటికంటే ప్రసిద్ధమైన శ్లోకమిది.

త్రయీ! సాంఖ్యం, యోగః పశుపతి మతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే 'వరమిద మదః పథ్య' మితి చ
రుచీనాం వైచిత్య్రాత్ ఋజు కుటిల నానా పథ జుషాం
నృణాం ఏకః గమ్యః త్వమసి పయసాం అర్ణవ మివ

మూడు వేదాలలో చెప్పిన కర్మకాండ మార్గం, సాంఖ్యయోగ మార్గం, పతంజలి యోగమార్గం, శైవమార్గం, వైష్ణవమార్గం ఇలా రకరకాలుగా సాగించుకునే మోక్షప్రస్థానంలో 'ఇది శ్రేష్ఠమూ, అది హితకరం' అనుకుంటూ తమ తమ అభిరుచుల వైవిధ్యం వల్ల మనుషులు వేరు వేరు మార్గాలను అవలంభిస్తారు. కానీ, వాటన్నింటికీ గమ్యస్థానం ఒకటే. ఆ గమ్యం నువ్వే. నదులన్నింటికీ సముద్రంలాగ.

'నిరీశ్వరవాదులు తర్కానికి అతీతుడివైన నీ మహిమలు తెలుసుకోలేక కుతర్కంతో ప్రపంచాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఈలోకంలో ఎంతో వైచిత్రీ, భిన్నత్వం కనిపిస్తాయి. అధిష్ఠాతవు నువ్వులేకపోతే, ఈ భువనాలన్నింటినీ ఎవరు నిర్మిస్తారు? ఏ పరికరంతో నిర్మిస్తారు? మందబుద్దులకు మాత్రమే ఈశ్వరుడున్నాడా? లేడా? అన్న అనుమానాలు కలుగుతాయి' అంటుంది ఈ స్తోత్రం.

సరళంగా, సుందరంగా రచించబడిన ఈ స్తోత్రంలో దీర్ఘమైన సమాసాలు, కష్టమైనా పదాలేమాత్రం కనిపించవు. ఇందులో శివమహిమలు, తత్త్వమూ అనేక విధాలుగా వర్ణించబడింది. ప్రతిశ్లోకంలో శబ్దగాంభీర్యం, అర్థగౌరవం చెట్టాపట్టాలుగా నడుస్తూంటాయి.

మహాచార్యులు శ్రీ మధుసూదన సరస్వతి శివ మహిమ్నస్తోత్రానికి వ్యాఖ్యానం రచించారు. ఈ శివమహిమ్న స్తోత్రం శివభక్తులందరూ తప్పక చదవవలసిన స్తోత్రం.