పరంజ్యోతి స్వరూపుడు సోమనాథేశ్వరుడు

 

పరంజ్యోతి స్వరూపుడు సోమనాథేశ్వరుడు

"గంగ, యమున, సరస్వతులు ఎక్కడ కలుస్తాయో, ఎక్కడ సోమేశ్వరుడున్నాడో, అక్కడ నన్ను అమరునిగా చేయుము. ఓ చంద్రా! ఇంద్రునకు అమృతాన్ని వర్షించు."

ఋగ్వేదంలోని ఈ భావాన్ని విన్నప్పుడు మన మనసులు సోమనాథుని దర్శనం కోసం పరిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే జగద్గురు ఆదిశంకరులు కూడా 'శ్రీద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో,

సౌరాష్ట్ర దేశే వసుధావకాశే
జ్యోతిర్మయం చంద్రకళావతంసం
భక్తి ప్రదానాయ కృతావతారం
తం సోమనాథం శరణం ప్రపద్యే

అంటూ సోమనాథుని ప్రథమంగా స్తుతించారు. సౌరాష్ట్ర భూతలాన జ్యోతిర్మయరూపుడు, చంద్రుని ఆభరణంగా ధరించినవాడూ, భక్తిని ప్రసాదించేందుకై అవతారం ఎత్తిన వాడైన సోమనాథుని ప్రథమంగా స్తుతించారు. సౌరాష్ట్ర భూతలాన జ్యోతిర్మయరూపుడు, చంద్రుని ఆభరణంగా ధరించినవాడూ, భక్తిని ప్రసాదించేందుకై అవతారం ఎత్తిన వాడైన సోమనాథుని శరణువేడుకుంటున్నానని శంకరుల ప్రార్థన. అందులోను సరస్వతీ నది సముద్రంలో కలిసిన ప్రాంతంలో ఈ జ్యోతిర్లింగం వెలియడం ఓ కారణం. స్వామివారు అంత సులభంగా ఇక్కడకు వచ్చి కొలువుదీరలేదు. అనేక పుణ్యక్షేత్రాలలోని దేవతలూ, మహర్షులు స్వామిని ఇక్కడ కొలువుదీరమని అనేక పర్యాయాలు ప్రార్థించగా, వారి కోరికను తీర్చేందుకై స్వామివారు ఇక్కడ కొలువైయ్యాడట.

గుజరాత్ లోని ప్రభాసపట్టణంలోని సోమనాథ దేవాలయం స్వామి మహిమలకు ప్రత్యక్షసాక్షిగా మన ముందు దర్శనమిస్తోంది. స్వామి ఇక్కడ కొలువై ఉండటానికి వెనుకగల కారణాలను పురాణాలు విపులంగా మనకు అందిస్తున్నాయి. విష్ణువు బ్రాహ్మలమధ్య ఎవరు గొప్ప అన్న విషయం తెలెత్తినప్పుడు, వారి మధ్య జ్యోతి స్వరూపునిగా వెలసిన శివపరమాత్మ. వారికొక పరీక్షపెట్టి, ఇద్దరినీ సృష్టిని మొదలు పెట్టమని ప్రోత్సహించిన విషయం సువిదితమే.  అలా జ్యోతి స్వరూపునిగా వెలసిన స్వామి 12 చోట్ల కొలువై ఉండటానికి వెనుక కూడ పన్నెండు కథలు చెప్పబడుతున్నాయి.