ఆంజనేయుని భక్తి

 

సువేలాద్రి పై శ్రీ రామచంద్రుడు పర్ణశయ్యపై పరుండి యుండెను. సుగ్రీవుని ఒడియందు ఆయన శిరస్సు ఉన్నది. హనుమదంగదులాయన పాదములు ఒత్తుచున్నారు. కుడి ఎడమలందు ధనుర్బాణములున్నవి. వెనుకగా లక్ష్మణుడు వీరాసనాసీనుడై, అగ్రజునివైపు చూచుచుండెను.

అప్పుడు రామచంద్రుడు చంద్రునివైపు చూస్తూ “సోదరులారా! మీ మీ అభిమతములను అనుసరించి చంద్రుని యందలి శ్యామత్వమును వర్ణించండి” అని చెప్పగా... సుగ్రీవాంగద లక్ష్మణ విభీషణులు స్వాభిప్రాయములను వివరించిరి. అందరూ చెప్పిన మీదట హనుమంతుడు అందుకుని “ప్రభూ! చంద్రుడు మిమ్ములను సర్వదా తన హృదయములో ప్రతిష్టించుకుని ధ్యానించు చున్నాడు.

మీరు అతని హృదయసీమలో నుండుటచే అతనియందు శ్యామసుందర రూపములో మీరే గోచరించుచున్నారు” అని చెప్పెను. ఆ మాటలు విని రామచంద్రుడు మందస్మితము చేసెను. ఆ పలుకులు విన్న వారందరికీ మహానందము కలిగెను. హనుమంతునికి ఎక్కడ చూచిననూ భగవద్దర్శనమే కలుగుచుండెను. అట్టి స్థితిలో చంద్రునియందు భగవానుని దర్శించుటలో ఆశ్చర్యం ఏమున్నది?!