Read more!

రావణాసురుని రక్తం కక్కించిన హనుమంతుడు

 

యుద్ధము జరుగుతున్న సమయమున హనుమంతుడు రావణుని బలముగా ఒక గుద్దు గుద్దేసరికి రక్తము కక్కుకుని మూర్చపోయెను. స్పృహ కలిగిన మీదట మారుతిని ప్రశంసిస్తూ, తన జీవితములో ఎవరి చేతనూ ఎన్నడునూ అంత గట్టిదెబ్బ తినియుండలేదనెను. రావణుడొక్క దెబ్బతో లక్ష్మణుని మూర్చపోగొట్టి, అతనిని లేవనేత్తుకొని పోవలెనని ప్రయత్నించెను. శక్తినంతయు వినియోగించిననూ లక్ష్మణుడు కదలలేదు.

అదిచూసి హనుమంతుడు అచ్చటకు పరుగుతీసెను. ఒకపక్కన రావణ బాణములతో తన శరీరమంతయు రక్తసిక్తమై పోవుచున్ననూ హనుమంతుడు అది లెక్కచేయక లక్ష్మణుని లేవనెత్తుకొని పోయెను. రాముడు వాయునందనుని గాఢంగా ఆలింగనము చేసికొని “మారుతీ! నీవు దేవతలను సంరక్షింప అవతరించినావు. ఇక నా సోదరునకు మూర్ఛ ఉండునా?” అన్న వచనములు పూర్తికాకముందే లక్ష్మణుడు సుఖముగా లేచి ద్విగుణీకృత ఉత్త్సాహముతో రణ స్థలము చేరుకొనెను. హనుమంతుని ఉత్సాహము వలన మహా విపత్తులు కూడా క్షణకాలములో నాశనమై పోవుచున్నవి.

శ్రీరామచంద్రుడు విజయలక్ష్మిని వరించెను. విజయ సందేశమును సీతామాతకు అందజేయునదెవరు? అన్న భావము ఉదయించగానే భగవానుడు హనుమంతుని పిలచి “హనుమంతా! సీతకు నీ ఎడల అమితమైన వాత్సల్యమున్నది. ఈ విజయ సమాచారము సీతకు నీవే వినిపింపవలెను. విభీషణరాజువద్ద ఆజ్ఞను తీసుకొని, లంకలో ప్రవేశించి సుగ్రీవ లక్ష్మణసమేతముగా నేను కుశలముగా ఉన్నానని ఆమెతో చెప్పి, రావణ సంహార వృతాంత్తమును కూడా వినిపించుము. సీతకు ఆనందము కలుగు రీతిని భాషింపుము’ అనగా హనుమంతుడు లంకయందు ప్రవేశించెను. లంకావాసులు అతనిని ఘనముగా సన్మానించినారు. విభీషణ ఆదేశానుసారం, అశోక వనములో శింశుపా వృక్షము క్రింద కూర్చొని యున్న సీతామాతను సమీపించి ఆమెకు సాష్టాంగ నమస్కారమొనర్చి యావత్ వృత్తాంతమును నివేవిదించెను. క్షణకాలం సీతామాత ఏమియు మాట్లాడలేకపోయెను. హర్షగద్గదకంటయై కనులనుండి ఆనందబాష్పములు జలజల ప్రవహించుచుండగా – “ నాయనా! అన్యధా భావించకుము.

నా జీవితాన ఇంతకన్న ఆనందకర విషయమేముండును? దీనికి ప్రత్యుపకారము నీకేమి చేయవలయునన్న విషయమై యోచించున్నాను. సంతోషకర వార్త నందజేసినవారిని బహూకరించుట లోకమర్యదగదా! కాని, లోకత్రయములో గల సంపద నంతయూ నీకు ఇచ్చిననూ నాకు సంతోషము కలుగదు. నీ హృదయము సదా అనన్య భగవద్భక్తితో నిండియుందుగాక! సద్గుణములు అన్నియు నీ హృదయములో నివాసము ఏర్పరచుకొనుగాక. నాపై రాఘవుల కృపాదృష్టి సర్వదా ప్రసరించుగాక!” అని ఆశీర్వదించినది.

హనుమంతుడు వినయ వినమ్రతాంజలి ఘటించి “మాతా! ఇట్టి వాత్సల్య పూర్ణమైన సంభాషణ నీవు వినా చేయగలవారు ఎవరుగలరు? నా హృదయ మందిరములో సర్వకాల సర్వావస్థలయందు మీ సీతారాముల యుగళమూర్తి భాసించుచుండునుగాక! నేను మీ నీడలో ఆనందించు చుందునుగాక! ఇంతకన్న మీరు నా కీయగలది మాత్రమేమున్నది తల్లీ! నేను మీకెట్టి సేవ చేయవలెనో ఆజ్ఞాపించండి” అనెను. “నాయనా! నేను భగవానుని దర్శించవలెనన్న ఉత్సుకతతో నున్నాను. ఇక క్షణకాల విలంబన కూడా సహించజాలను” అని జానకిమాత పలుకగా, హనుమంతుడు వెంటనే శ్రీరాముని చేరి సీతామాత అభిప్రాయము నీవేదించెను. సీతను తీసుకుని రమ్మని శ్రీరామచంద్రుడు విభీషణుని ఆదేశించెను.