Read more!

శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం (16-07-2013 )

 

శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం (16-07-2013 )

 

 

చారిత్రక నేపథ్యంలో పూర్వం మహంతులు దేవస్థానం పరిపాలనను స్వీకరించిన అనంతరం ఆణివార ఆస్థానం పర్వదినాన తితిదే ఆదాయ వ్యయాలు, నిలువలు వంటి వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం మంగళవారం (16-07-2013)జరగనుంది. ఈ ఉత్సవం ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి పర్వదినాన తితిదే నిర్వహిస్తుంది. తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువును ఆణివార ఆస్థానంగా పిలుస్తున్నారు. తితిదే ధార్మిక మండలి ఏర్పాటు అనంతరం వార్షిక బడ్జెట్టును మార్చి- ఏప్రిల్‌ నెలలకు మార్చడం జరిగింది. అయినా శ్రీవారి ఆలయంలో వార్షిక సాలకట్ల ఉత్సవం నిరంతరాయంగా సౌరమానాన్ని అనుసరించి జరగడం విశేషం.

 

 

ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య మధ్య బంగారు వాకిలి ముందుగల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి, గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేయు చేయనున్నారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనులవారి దక్షిణాభిముఖంగా వేంచేస్తారు. అనంతరం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలిలో ఆస్థానంలో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాల నివేదనలు జరుగుతాయి. పట్టువస్త్రాలను వూరేగింపుగా తీసుకువచ్చి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు. ఆస్థానం కార్యక్రమం అనంతరం సాయంత్రం ఆరు నుంచి గంట పాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి తిరువీధుల్లో పుష్పపల్లకి సేవ జరుగుతుంది.