Read more!

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవాలు

 

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవాలు

 

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఉదయాన శ్రీ వేంకటేశ్వర స్వామి ఉభయ దేవేరుల సహితంగా పల్లకీలో ఉరేగించడం జరుగుతుంది. ఆ రాత్రి శేషవాహనంపైన స్వామివారిని ఊరేగిస్తారు

 

 

రెండో రోజు ఉదయం శేషవాహనంపై, రాత్రి హంసవాహనంపై, ఉభయదేవీ సహితుడైన స్వామిని నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

 

 

మూడవనాడు ప్రాతఃకాలమున సింహవాహనంపైనా, రాత్రివేళ ముత్యాల మండపంలోనూ-దేవీ సమేత శ్రీ వేంకటేశ్వరుని ఊరేగింపు జరుగుతుంది.

 

 

నాలుగోరోజు ఉదయాన కల్పవృక్ష వాహనంపై, రాత్రి సర్వభూపాల వాహనంపై శేషాచలవాసుని ఊరేగిస్తారు.

 

 

ఐదవనాటి ఉదయం వేళలో శ్రీశ్రీనివాసుడు జగన్మోహిని అవతారం ధరించి, చేతిలో అమృత కలశంతో పల్లకిలో ఊరేగే ఉత్సవం చూడ ముచ్చటగా ఉంటుంది. ఆనాటి రాత్రి సమయాన వేంకటాచలధీశుడు గరుత్మంతునిపైన ఊరేగుతాడు.

 

 

ఆరవనాటి ఉదయం జరిగే ఊరేగింపుకు స్వామివారి వాహనం, ఆయనకు ప్రియభక్తుడైన హనుమంతుడు, ఆనాటి సాయంకాలాన మంగళగిరి వాహన సేవలు జరుగుతాయి. ఆ సమయంలో శేషశైలవాసునికి వసంతోత్సవం, రథరంగడోలోత్సవం జరుగుతాయి. ఆ రాత్రి ఊరేగింపులో వేంకటశైల వల్లభునికి గజవాహన సేవ జరుగుతుంది.

 

 

ఏడవనాటి ఉదయం సూర్యమండల వాహనం. దీనికే సూర్యప్రభ వాహనం అంటారు. ఆనాటి సాయంకాలము పద్మావతీ మనోహరునికి మంగళగిరి వాహన సేవ జరుగుతుంది. అలాగే ఉద్యానవన విహరం జరిపించబడుతుంది. ఆనాటి రాత్రి సమయాన ఆపద మ్రొక్కులవాడు, చంద్రమండల వాహనం (చంద్రప్రభ వాహనం) పైన ఊరేగే దృశ్యం భక్తులను కనువిందు చేస్తుంది.

 

 

ఎనిమిదో రోజు ఏడు కొండల స్వామి రథోత్సవం. రథంలో ఊరేగుతున్న శ్రీ మహావిష్ణువును చూసినట్లయితే, అటువంటివారికి ఇక పునర్జన్మ ఉండబోదని చెప్పబడింది. స్వామివారి రథోత్సవానికి అంతటి విశిష్టత ఉంది. ఆనాటి రాత్రి అలమేలు మంగపతి అశ్వవాహనంపైన ఊరేగుతారు.

 

 

తొమ్మిదవరోజు పల్లకి వాహన సేవ, ఆనాటి రాత్రి మంగళగిరి వాహన సేవ జరుగుతుంది. శ్రవణనామక నక్షత్రంలో బ్రహ్మోత్సవాల ముగింపులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీ చక్ర స్నానం అనబడ అవభృథ స్నానోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు స్వామివారికి శ్రీ పుష్పయాగోత్సవం జరిపించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.