తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు

 

తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు

 

 

 

వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. అవి: ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.

సుప్రభాతం:

నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు.

 

 

వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.

శుద్ధి:

 

 

సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.

అర్చన:

 

 

 

శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.

తోమాలసేవ:

 

 

 

తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'... తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.

కొలువు:

 

 

 

తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్‌ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.

సహస్రనామార్చన:

 

 

 

ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.

మొదటిగంట, నైవేద్యం:

 

 

 

మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.

అష్టోత్తర శతనామార్చన:

 

 

 

ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.

రెండో గంట, నైవేద్యం:

 

 

 

అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.

రాత్రి కైంకర్యాలు:

 

 

 

ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.

ఏకాంతసేవ:

 

 

 

రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు. ఏడుకొండల వాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.

గుడిమూసే ప్రక్రియ:

 

 

 

రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు