గురువుకు సేవ చేయడంలో అసలు నిజం ఇదే!
గురువుకు సేవ చేయడంలో అసలు నిజం ఇదే!
ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర చాలా గొప్పది. ప్రస్తుత కాలంలో అందరూ గొప్పవాళ్లుగా చెప్పబడుతున్న వారు తప్పకుండా గురువు మార్గంలో అనుసరించి వారిని సేవిస్తూ గొప్పవారయ్యారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో గురువు సరైన మార్గాన్ని చూపించేవాడు. అలాంటి గురువును సేవించడం అంటే ఆయన్ను గౌరవించడమే.. ఇది ఆధ్యాత్మిక సాధకులందరూ తెలుసుకోవలసిన విషయం.
'ఆచార్యుడు' అంటే ఒక సత్యం, లేక విలువ పట్ల పూర్తి అవగాహనతో దాన్ని స్వయంగా తన జీవితంలో ఆచరించి (స్వయం ఆచరతి), ఇతరులకు కూడా దాన్ని బోధించి, వారు కూడా దాన్ని తమ జీవితాలలో ఆచరించేలా (అన్యన్ ఆచరతి) చేసేవాడు. గురువు శాస్త్రాలలో ప్రబోధించే విలువలకు ఒక ప్రతీకగా నిలుస్తాడు. మాటల ద్వారానే గాక, సొంత ఆచరణ ద్వారా ఆయన ప్రబోధిస్తాడు. అలాంటి గురువు పట్ల శిష్యుడు భక్తి, శ్రద్ధలు కలిగి వుండవలసిన అవసరం ఎంతో ఉంది. సేవ, వినయం, విధేయతల ఆధారంగానే మనస్సు సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను గ్రహించగలుగుతుంది. శిష్యుడు తన అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకోవలసిన అవసరం ఉంది. అది సరిగ్గా జరగాలంటే గురువును సేవించాలి. గురువును సేవించడంలో అహంకారం నశించిపోతుంది.
గురువు జ్ఞానంతో పాటూ మంచి ఉత్తేజం కలిగించేవారై ఉండాలి. ఆయన బోధించే ప్రతి ఉపదేశం ఆయన ప్రవర్తనలో ప్రతిబింబించాలి. అలా ఉంటే మనపై ఏ సమస్యా ప్రభావం చూపదు.
'ఆచార్య' అనే పదానికి జ్ఞానము ఇచ్చువాడు అని కూడా అర్థముంది. అలాంటి గురువును సేవించడం ఒక మంచి గుణం. ఇతరుల పట్ల మనకున్న ప్రేమనూ, గౌరవాన్నీ వ్యక్తీకరించే విధానమే 'సేవ'. మన దృక్పథాన్ని ఎలా వ్యక్తపరుస్తాం? 'మన చేతల ద్వారా'! మన మనస్సులో భక్తి ఉంటే, అది తప్పక 'సేవ' రూపంలో వ్యక్తీకృతమవుతుంది. ఆ దృక్పథమే సేవాకార్యం అవుతుంది. మన మనస్సులోని భావన ఆ విధంగా వ్యక్తం అవుతుంది. . ఉదాహరణకు 'కృతజ్ఞతాభావం' ఒక దృక్పథం. ఎవరైనా మనకు నిజంగా సహాయం చేశారని గుర్తించినప్పుడు ఆ కృతజ్ఞతాభావం కలుగుతుంది. సహాయం చేసిన వ్యక్తికి ఋణపడి ఉన్నట్లుగా భావిస్తాం.
ఇతరుల నుంచి అవసరమైనప్పుడు సమయానికి సహాయాన్ని పొందిన భావన, దాన్ని మెచ్చుకోగలిన మనస్సు ఉన్నప్పుడే తాను పొందిన సహాయానికి బదులుగా ఏదైనా ఇవ్వాలని అనిపిస్తుంది. దీనినే 'కృతజ్ఞత' (ఉపకారం) అంటారు. మనకొకరు సహాయం చేశారన్న అవగాహన, గుర్తింపు కారణంగానే 'కృతజ్ఞత' అనేది మనలో పెల్లుబుకుతుంది. వారి సహాయానికి సముచితంగా కృతజ్ఞత తెలియబరచవలసిన అవసరం ఉంది.
మనం మన సమస్యకు పరిష్కారాన్ని బయటి ప్రపంచంలో వెతుకుతాం. బయటి నుండి ఏదైనా లభిస్తే, మన సమస్య పరిష్కారమవుతుందని భావిస్తాం. కానీ బయటి నుంచి వచ్చే ఆ పరిష్కారం తాత్కాలికమైనదే. ఉదాహరణకు ఆకలిగొన్నవారికి ఆహారం లభిస్తే ఆ సమయానికి ఆ ఆకలి తీరుతుంది. కానీ మళ్ళీ ఆకలి వేస్తుంది. మళ్ళీ ఆహారం అవసరమవుతుంది. ఇదే సత్యం జీవితంలోని ఇతర అన్ని విషయాలకూ వర్తిస్తుంది. అందువల్ల మనం జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారం బయటి ప్రపంచంలో లభించదు. గురువు సమస్యలకు పరిష్కారం అన్వేషిస్తున్న శిష్యునికి ఒక నూతన దిశానిర్దేశం చేసి, కొత్త దిశగా నడిపించే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే గురువు గొప్పవాడు.
◆నిశ్శబ్ద.