సింహాచల నారసింహుని చందనోత్సవం ఎందుకు చేస్తారో తెలుసా!
సింహాచల నారసింహుని చందనోత్సవం ఎందుకు చేస్తారో తెలుసా!
భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి పట్టుగొమ్మలే మన దేవాలయాలు. సంస్కృతీ సంప్రదాయాలకు ఆలవాలమైన ప్రముఖ ఆలయాల్లో విశాఖపట్నం జిల్లాలోని శ్రీవరాహ లక్ష్మీ నారసింహ స్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి మన పురాణాల్లో ఐతిహాసిక నేపథ్యమూ ఉంది. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రాక్షసరాజులుగా జన్మించి భూదేవిని గడగడలాడించిన కథ మనకందరికీ తెలిసిందే.. ఆది వరాహ రూపంలో శ్రీహరి అవతరించి, హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. దాంతో అతని సోదరుడు హిరణ్యకశిపుడు. హరిద్వేషంతో స్వామి భక్తులను కష్టాలపాలు చేస్తాడు. ఆ సమయం కోసమే వేచి ఉన్న శ్రీహరి తన సేవకుడైన సముఖుడిని హిరణ్యకశిపునికి తనయుడైన ప్రహ్లాదుడిగా ప్రసాదిస్తాడు.
గర్భస్థశిశువుగా ఉన్నప్పటి నుంచే హరినామ స్మరణతో ఎదిగిన ప్రహ్లాదుడు తండ్రికే కంటకంగా పరిణమిస్తాడు. తనకు బద్ధశత్రువైన హరి నామస్మరణ నుంచి కొడుకును మళ్ళించాలని హిరణ్యకశిపుడు విశ్వప్రయత్నం చేస్తాడు. ఎన్నివిధాలుగా శిక్షించినా మనస్సు మార్చుకోడు ప్రహ్లాదుడు. చివరికి ప్రహ్లాదుణ్ణి సముద్రంలో పడేయమని భటులను ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు. కానీ శ్రీహరి ప్రహ్లాదుణ్ణి కాపాడి, నృసింహావతారంలో హిరణ్యకశిపుని అంతమొందిస్తాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని వరాహమూర్తి, నృసింహమూర్తి కలసిన ఏకావతార రూపంలో ప్రత్యక్షం కావాలని ప్రార్థిస్తాడు. ఆ రూపంలోనే సింహాద్రిపై కొలువు తీరిన వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఆలయాన్ని నిర్మించి అర్చిస్తాడు. అదే సింహాచలం.
కృత యుగాంతంలో ఆ దేవాలయం శిథిలమైనందున, స్వామి మళ్ళీ ఆలయ గర్భాన కనుమరుగై ఉంటాడు. కొంతకాలానికి చంద్రవంశ ప్రభువైన పురూరవుడు ఆకాశయానం చేస్తూ సింహాద్రిపై తరచి చూడగా వరాహ లక్ష్మీ నృసింహమూర్తి కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని పైకి తీసి ఆలయంలో పునఃప్రతిష్ఠిస్తాడు. ఆ సమయంలో ఆకాశవాణి పురూరవుని ఉద్దేశిస్తూ "ఆ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నుంచి బయల్పడే అగ్నికీలలు అక్కడి పర్వతావళిని దహిస్తాయనీ, ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మందమైన చల్లని చందన లేపనంతో నిత్యమూ కప్పి ఉంచమనీ, ఆ రూపంలోనే స్వామిని అర్చించమనీ చెబుతుంది. సంవత్సరానికి ఒకరోజు వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామి నిజరూప అర్చన సమ్మతమని" వివరిస్తుంది. ఆనాటి నుంచి పురూరవ చక్రవర్తి వరాహనరసింహ స్వామిని చందన లేపనంతో అలంకరించి ఆరాధించడం ప్రారంభించాడు.
సింహాచలం మీద నెలకొన్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయం జగత్ప్రసిద్ధమై పూజలందుకుంటోంది. పురూరవుడు కొల్చిన సంప్రదాయానుసారం ప్రతీ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామి నిజరూప దర్శనం కలుగుతుంది. అనంతరం వైభవంగా చందనోత్సవం నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూసిన వాళ్ళకు సర్వ శుభాలూ కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సింహాచల నారసింహుని చందనోత్సవం వెనుక ఉన్న పురాణ కథనం ఇదీ..
◆నిశ్శబ్ద.