సింగపూర్లో పురాతనమైన దేవీ ఆలయం

 

సింగపూర్లో పురాతనమైన దేవీ ఆలయం


తమిళుల దగ్గర ఒక సుగుణం ఉంది. వాళ్లు ఎక్కడికి వెళ్లినా తమ సంస్కృతిని మర్చిపోరు సరికదా, ఆ సంస్కృతికి తగిన వాతావరణాన్ని కూడా కల్పించుకుంటారు. అందుకే సింగపూర్, మలేసియా, శ్రీలంక వంటి ప్రాంతాల్లో వారి ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దేశం వారిదే అన్నంతగా వారి ప్రభావం కనిపిస్తుంది. అలా సింగపూర్లో వారు నెలకొల్పిన ఓ పురాతన ఆలయం ఆ దేశ చరిత్రలో భాగంగా నిలుస్తోంది.


నారాయణ పిళ్లై

19వ శతాబ్దంలో సింపూర్లో అడుగుపెట్టిన తొలి భారతీయుల్లో నారయణపిళ్లై ఒకరు. బ్రిటిష్వారి గుమాస్తాగా జీవనం సాగించిన పిళ్లై, తరువాతి కాలంలో సొంత వ్యాపారాలను ప్రారంభించారు. అనతికాలంలోనే పిళ్లై గొప్ప పారశ్రామికవేత్తగా విజయం సాధించారు. తన విజయానికి కృతజ్ఞతగా, సింగపూర్లోని తోటి తమిళురకు ఆలంబనగా ఆయన ఒక ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. అదే శ్రీ మారియమ్మన్ ఆలయం. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా పిలిపించిన శిల్పులతో 1827 నాటికి ఈ ఆలయ నిర్మాణం పూర్తయ్యింది.


ఎవరీ మారియమ్మన్

సాక్షాత్తూ పార్వతీదేవి అవతారమే మారియమ్మన్. ఈ తల్లి గురించి తమిళనాట ప్రచారంలో ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు తమిళప్రాంతాన్ని వల్లభుడనే పాండ్యరాజు పాలిస్తూ ఉండేవాడట. అతను మహా క్రూరుడు. ఆ వల్లభునికి పుట్టే బిడ్డ కనుక నేలకి తగిలితే ఈ భూమి సర్వనాశనం అయిపోతుందని జ్యోతిషులు చెబుతారు. దాంతో అలా జరగకుండా తన భార్యకి ప్రసవం చేయగల మంత్రసాని కోసం వల్లభుడు చూస్తుండగా పెరియాచి అనే స్త్రీ కనిపిస్తుంది. రాజు కోరినట్లుగానే ఆమె రాణిని తన ఒళ్లో ఉంచుకొని జాగ్రత్తగా ప్రసవం చేస్తుంది.


దుష్టశిక్షణ

బిడ్డ ప్రసవం జరిగిన తరువాత ఆమెను హతమార్చవలసిందిగా రాజు ఆదేశించడంతో కోపగించుకున్న పెరియాచి రాజుని సంహరించివేస్తుంది. ఆమెను అడ్డుకోబోయిన రాణికి కూడా పెరియాచి చేతిలో చావు మూడుతుంది. ఇంతటి దుష్టశిక్షణ జరుగుతున్నా కూడా పెరియాచి తన చేతిలో ఉన్న బిడ్డ నేలని తాకకుండా పైకి ఎత్తి పట్టుకునే ఉంటుంది. ఆ తరువాత ఆమే ఆ బిడ్డను జాగ్రత్తగా సాకుతుంది. వల్లభుడి పీడ నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు ఆవిర్భవించిన పార్వతీదేవే ఈ పెరియాచి అని భక్తుల నమ్మకం. ఆ పెరియాచినే మారియమ్మన్ అనే పేరుతో వారు పూజిస్తుంటారు. పెరియాచి కథ రక్తం నేల మీద పడకుండా అంధకాసురుడు అనే రాక్షసుని దేవతలు వధించిన గాథని గుర్తుకుతెస్తుంది.

తల్లీబిడ్డల పాలిట దైవం

కడుపులో ఉన్న బిడ్డకి నవమాసాల పాటు ఎలాంటి అవాంతరం రాకుండా ఉండేందుకు ఈ మారియమ్మన్ తల్లిని భక్తులు పూజిస్తారు. ఇక బిడ్డ బయటకు వచ్చిన తరువాత కూడా అతన్ని క్షేమంగా చూడమంటూ వేడుకుంటారు. అందుకోసం బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే అతన్ని దగ్గరలో ఉన్న మారియమ్మన్ ఆలయానికి తీసుకువెళ్లి, బిడ్డను ఆమె పాదాల దగ్గర ఉంచుతారు. అంతేకాదు! సంతానం లేని దంపతులు 12 వారాలపాటు మారియమ్మన్ను పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

సింగపూర్ ఆలయ ప్రత్యేకత

మారియమ్మన్ కోవెల సింగపూరులోనే అతి పురాతనమైన హిందూ ఆలయం. పొట్టచేతపట్టుకు సింగపూరుకి చేరుకునే భారతీయులు, తమకి పని దొరికేదాకా ఇక్కడే తలదాచుకునేవారు. సింగపూరులో ఉండే భారతీయులంతా కలుసుకునేందుకు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు, పండుగలు వైభవంగా జరుపుకొనేందుకు ఈ ఆలయం ఒక వేదికగా ఉండేది. ఒకప్పుడు సింగపూర్లోని తమిళురు వివాహం చేసుకోవాలన్నా ఈ ఆలయానికే చేరుకునేవారు.

ఆలయం తీరు

సింగపూర్ మారియమ్మన్ ఆలయానికి పలుమార్లు మార్పులూ చేర్పులూ జరిగాయి. ప్రస్తుతానికి ఈ ఆలయం ఆరు అంతస్తుల గోపురంతో విశాలమైన దక్షిణభారతీయ ఆలయాన్ని తలపిస్తూ ఉంటుంది. ఇక్కడి ప్రధాన దేవత అయిన మారియమ్మన్ త్రిశూలము, ఢమరుకం వంటి ఆయుధాలను ధరించి ప్రసన్నవదనంతో కనిపిస్తుంది. ఇదే ఆలయంలో ద్రౌపదీదేవికి కూడా విగ్రహం ఉండటం మరో విశేషం. ఆలయం గోపురాల మీదా, ఆలయం లోపలా రకరకాల దేవీదేవతా విగ్రహాలు కనువిందు చేస్తాయి. రాముడు, కుమారస్వామి, శ్రీకృష్ణుడు, పాండవుల విగ్రహాలు కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఆలయం దక్షిణభారతీయ సంస్కృతికి చిహ్నంగా కనిపిస్తుంది. అందుకనే సింగపూర్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ కట్టడంగా గుర్తించింది.

 

- నిర్జర.