Read more!

అమృతాన్ని పంచిన కాలమేఘ పెరుమాళ్

 

అమృతాన్ని పంచిన కాలమేఘ పెరుమాళ్

దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీమన్నారాయణుడు హయగ్రీవ, సుయజ్ఞ, కపిల, దత్తాత్రేయ, వరాహ, నర - నారాయణ, పృధు, మత్స్య, కూర్మ, జగన్మోహినీ, నరసింహ, వామన, పరశురామ, రామకృష్ణ, ధన్వంతరీ, బ్రాహ్మణ్య, ధేనుక అవతారాలను ధరించి అనంతరం కల్కి అవతరాన్ని ధరించునున్నట్లు పురాణ వచనం. ఆయన అవతారాల్లో పదింటిని మనం దశావతారాలుగా చెప్పుకుంటున్నాం. ఇక, ఆ స్వామి కలియుగంలో మనకు సులభ దర్శనాన్ని ఇచ్చి కరుణించేందుకై స్థానక, ఆసన, శయన భంగిమలలో దర్శనమిస్తున్నాడు. ఆ స్వామి అలా వెలసిన పవిత్రమైన క్షేత్రాలలో 108 క్షేత్రాలను దివ్య దేశాలు లేక మంగళాశాసనాలుగా పిలుచుకుంటుంటారు. ఈ 108 దేవ్య దేశాలలో స్వామివారు సుమారు 60 కోవెలస్థానాల్లో స్థానకభంగిమలో అంటే నిల్చున్నభంగిమలో దర్శనమిస్తున్నారు. ఆ 60 దివ్య దేశాలలో ఒక దివ్యదిశయే తమిళనాడుని మదురై పట్టణానికి దగ్గరున్న తిరుమోగూరు. మూర్తి, తీర్థం, స్థలం అంటూ మూడు విధాలుగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో దర్శనమిస్తున్న కాలమేఘ పెరుమాళ్ నామధేయంతో భక్తులు కొలుచుకుంటున్నారు. అమృతమథనం సమయంలో మోహినీరూపాన్ని ధరించిన స్వామీ, సకలలోకవాసుల కోరిక మీద కాలమేఘపెరుమాళ్ రూపంలో వెలసినాడని కథనం.

అమృతమథనం జరిగిన తరువాత దొరికిన అమృత భాండాన్ని రాక్షసులు లాక్కుని వెళ్ళిపోవడంతో దేవతలంతా వెళ్ళి శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. ఈలోపు అమృతభాండాన్ని లాక్కుని వెళ్ళిన రాక్షసులు ఒకరితో ఒకరు పోట్లాడుకోసాగారు. బలంగలవాళ్ళ మధ్య అమృత భాండం చేతులు మారుతోంది.

సరిగ్గా ఆ సమయంలో వారి మధ్య శ్రీహరి మోహనాకారంతో మోహినీరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ మోహినీ రాక్షసులను మదనోద్రేకంలో ముంచెత్తసాగింది. మోహినీని చూసిన రాక్షసులను కశ్యప సంతతివారమైన తమకు అమృతాన్ని పక్షపాతరహితంగా పంచి పెట్టాల్సిందిగా కోరారు. తన చూపులతో రాక్షసులను వశం చేసుకున్న మోహినీ, వాలుచూపులతో ఆ అమృతభాండాన్ని పట్టుకొని గజ్జెల మోతలతో, తాను అమృతాన్ని పంచాలంటే అందరూ వరుసల్లో కూర్చోవాలని ఆనతిచ్చింది. రెండు వరసులుగా కూర్చున్న రాక్షసులకు మాటలనే అమృతంగా కురిపించి, అమృతం ఆశ చూపించి, వాళ్ళను దగ్గరకు రప్పించి, చేత్తో వెనక్కి తోసేది. ఆ స్పర్శకే రాక్షసులు సమ్మోహితులైపోయే వారు. అలా రాక్షసులను మరిపించిన మోహినీ దేవతలకు అమృతాన్ని పంచింది.

రాక్షసులకు ఒక్క చుక్కకూడ అమృతం దక్కకుండా చేసిన మోహినీని ప్రార్థించిన దేవతలు, మోహినీరూపంలో తాము పూజాధికాలు చేసుకోలేము కనుక, పెరుమాళ్ళు రూపంలో దర్శనమీయమణి కోరుకోగా, వారి కోరుకను మన్నించిన స్వామి, తిరుమోగూరులో కాలమేఘ పెరుమాళ్ళు రూపంలో కొలువైనట్లు స్థలపురాణ కథనం.

గర్భగృహంలో తూర్పు ముఖంగా కొలువైయున్న స్వామివారు శ్రీదేవీ, భూదేవీ సమేతంగా దర్శనమిస్తున్నారు. పూర్తిగా నీటిలో నిండిన మేఘశరీర వర్ణంతో శంఖు చక్రధారిమై గోచరిస్తున్న స్వామివారు, పేరుకు తగ్గట్లుగానే భక్తులపై తన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరిస్తున్నాడు. కాలమేఘ పెరుమాళ్ సన్నిధికి దక్షిణ భాగంలో తాయారుసన్నిధి ఉంది. ఈ తల్లిని మోహనవళ్లి తాయారులేక మోహనవళ్లి లేక తిరుమోగూరు వల్లి అని పిలుస్తుంటారు. ఈ ఆలయ ఊరేగింపులలో స్వామివారు మాత్రం  బయటకు వస్తారు తప్ప, తాయారు మాత్రం ఆలయగడపను దాటి బయటకురారు. అందుకే భక్తులు, తాయారును "గడప దాటని పత్ని" అంటూ పిలుచుకుంటారు.

ఆలయ రెండవ ప్రదక్షినా మార్గంలో పాలసముద్రంలో శయించినట్లున్న స్వామివారి ప్రతిమ మనలను విస్మయానికి గురిచేస్తుంది. ఇక్కడ ఇద్దరు తాయారులు స్వామి వారికి మేలుకొలుపు పాడుతుండటం విశేషం! అందుకే ఈ శయనమూర్తిని ప్రార్థనాశయనమూర్తి అని అన్నారు. ఈ స్వామివారికి ద్వాదశినాడు తిరుమంజనం చేయిస్తే అనంత పుణ్యఫలం కలుగుతుందని ప్రతీతి.

ఈ ఆలయ ప్రాంగణంలో చక్రత్తాళ్వారే మెదలుతుంటాడు. ఈ చక్రత్తాళ్వారుగా, వెనుక వైపు నృసింహావతారంగా కనబడుతుంటుంది. ఆ విగ్రహాన్ని చూడగానే అత్యంత శక్తిమంతమైన శక్తిచక్రం ముందు మనమెంత మాత్రమని ఆశ్చర్యం కలుగుతుంది. ఓ చక్రజ్వాలలో గోచరిస్తున్న స్వామి ఈ సమస్త సృష్టి భ్రమణాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది. ఈయన చుట్టూ నలభై ఎనిమిది మంది దేవతలు పరివేష్టించి ఉండగా, ఆరు వలయాలలో నూటయాభైనాలుగు అక్షరాలు పొందుపరిచి ఉండగా, పదహారు చేతులతో, పదహారు ఆయుధాలను ధరించి, త్రినేత్రాలతో దర్శనమిస్తున్నాడు. వెనుకవైపు చతుర్భుజుడైన నరసింహస్వామి యోగముద్రలో దర్శనమిస్తున్నాడు. ఇక్కడ సుదర్శనమహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ స్వామిని ఆరు సార్లు ప్రదక్షిణలు చేస్తే, మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని ప్రతీతి. స్వామిని సేవించినవారికి మరణభయం తొలగడమే కాక, మనోవ్యాధులు నాయమవుతాయట. కాలమేఘ పెరుమాళ్ సన్నిధి ప్రక్కన ఆండాళ్ సన్నిధి ఉంది. బ్రహోత్సవం ఆరవరోజున, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఆండాళ్ లో కలసి దర్శనమిస్తుంటాడు. ఆలయ ప్రాకారంలో ఆంజనేయస్వామి వారి సన్నిధి ఉంది. రాక్షసులు తనను వేధిస్తుండటంతో తట్టుకోలేక పోయిన బ్రహ్మదేవుడు ఇక్కడకొచ్చి తపస్సు చేశాడట. అప్పటికీ బ్రహ్మను వదలని రాక్షసులు ఇక్కడకు రావడంతో, వారిని చూసిన కాలమేఘ పెరుమాళ్ ఆ రక్కసులనంతా దూరంగా విసిరేశాడట. అందుకు గుర్తుగా ఇక్కడ బ్రహ్మతీర్థం ఉంది.

గరుడమండపంలో నున్న స్తంభాలపై పూల బాణాలతో కూడిన మన్మథుడు, దానికెదురుగా నున్న మరొక స్తంభంపై హంసవాహనంపై రతీదేవిశిల్పం కనులవిందు చేస్తుంటాయి. ఇంకా సీతారామలక్ష్మణుల విగ్రహాలున్నాయి. కాలమేఘ పెరుమాళ్ ఆలయానికి వెలుపల పద్దెనిమిది మెట్ల కరుపన్న స్వామి ఆలయం ఉంది.

ఈ ఆలయంలో నిత్యసేవలు, మహాత్సవాలు, సంవత్సర ఉత్సవాలు వైభవంగా జరుగుతూంటాయి. ఈ ఉత్సవాలకు భక్తులు గుంపులు గుంపులుగా వస్తుంటారు.

తమిళనాడులోని ఈ ఆలయాన్ని చేరుకునేందుకు చెన్నై చేరుకొని, అక్కడ్నుంచి మదురై పట్టణానికి చేరుకుని, అక్కడ్నుంచి తిరుమోగూరు చేరుకోవచ్చు. తమిళనాడు యాత్రలకు పోయే యాత్రీకులు, ముఖ్యంగా మదురైను దర్శించుకునేవారు ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.