వాంపైర్ ఫేషియల్.. సెలబ్రిటీలు చేయించుకునే ఈ ఫేషియల్ గురించి మీకు తెలుసా!

వాంపైర్ ఫేషియల్.. సెలబ్రిటీలు చేయించుకునే ఈ ఫేషియల్ గురించి మీకు తెలుసా!

నేటికాలంలో ప్రతి ఒక్కరూ అందమైన, కాంతివంతమైన , యవ్వనంగా కనిపించే చర్మాన్ని కోరుకుంటున్నారు. అందుకే స్కిన్ కేర్ కు చాలా ప్రాధాన్యత పెరిగింది. ఇక బ్యూటీ ట్రీట్మెంట్స్ కు కూడా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా ఖర్చు చేస్తుంటారు.  అయితే ఈ మధ్య కాలంలో  "వాంపైర్ ఫేషియల్" అని పిలువబడే  ఒక బ్యూటీ ట్రీట్మెంట్ చాలా వైరల్ గా మారింది. ఈ పేరు వింతగా అనిపించినప్పటికీ ఇది చర్మాన్ని తిరిగి యవ్వనంగా మార్చే కొత్త స్కిన్ ట్రీట్మెంట్ పద్దతిలో ఒకటిగా పరిగణించబడుతోంది.

వాంపైర్ ఫేషియల్ అంటే..

వాంపైర్ ఫేషియల్స్ ను ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP) ఫేషియల్స్ అని కూడా పిలుస్తారు, ఇందులో ఒక వ్యక్తి యొక్క సొంత రక్తాన్ని ఉపయోగిస్తారు. రక్తం నుండి ప్లేట్‌లెట్స్ , గ్రోత్ ఫ్యాక్టర్స్‌ను సంగ్రహించి చర్మానికి పూస్తారు, ఇది చర్మాన్ని రిపేర్ చేయడంలో చర్మాన్ని తిరిగి యవ్వనంగా మార్చడానికి కొత్త చర్మ కణాలను  పునరుత్పత్తి చేసే ప్రక్రియను ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తుంది. అందుకే దీనిని యాంటీ-ఏజింగ్ , చర్మాన్ని తిరిగి యవ్వనంగా మార్చే చికిత్సగా ప్రచారం చేస్తున్నారు.

చాలా మంది సన్నని గీతలు, ముడతలు, మొటిమల మచ్చలు, పెద్ద రంధ్రాలు , కాంతిహీనమైన చర్మం.. మొదలైన వాటిని  తగ్గించుకోవడానికి ఈ ట్రీట్మెంట్ ను ఎంచుకుంటారు. అయితే ఇది ఏదో  మ్యాజిక్ ట్రీట్మెంట్ కాదు,  దీని ఫలితాలు మనిషి చర్మ రకాన్ని బట్టి,  వారి ఆరోగ్య పరిస్థితిని మీద ఆధారపడి ఉంటుందట.

వాంపైర్ ఫేషియల్ గురించి స్పష్టంగా..

వాంపైర్ ఫేషియల్ అనేది శస్త్రచికిత్స అవసరం లేని ఒక బ్యూటీ  ప్రక్రియ. దీనిలో వ్యక్తి  సొంత రక్తం నుండి సేకరించిన PRPని ఉపయోగిస్తారు. ప్లేట్‌లెట్స్‌లోని వృద్ధి కారకాలు శరీర సహజ మరమ్మత్తు ప్రక్రియలో పాత్ర పోషిస్తాయి.

ఈ సూత్రం ఆధారంగా, PRPని మైక్రోనీడ్లింగ్ లేదా ఇతర పద్ధతులతో కలిపి చర్మంపై ఉపయోగిస్తారు. చర్మం మరింత తాజాగా, ఆరోగ్యంగా , యవ్వనంగా కనిపించడంలో సహాయపడటమే దీని లక్ష్యం.

ప్రాసెస్ ఎలా ఉంటుందంటే..

వ్యక్తి చేయి నుండి కొద్ది మొత్తంలో రక్తం తీసుకోవడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత PRPని వేరు చేయడానికి రక్తాన్ని ఒక ప్రత్యేక యంత్రంలో తిప్పుతారు.మొదట ముఖంపై మైక్రోనీడ్లింగ్ చేస్తారు, దీనివల్ల చర్మంలో అత్యంత సన్నని మార్గాలు ఏర్పడతాయి. ఆ తర్వాత PRPని ముఖానికి పూస్తారు, తద్వారా చర్మం దానిని మరింత బాగా గ్రహిస్తుంది.  ఈ మొత్తం ప్రక్రియకు సాధారణంగా 45 నుండి 90 నిమిషాల సమయం పడుతుంది.

ప్రయోజనాలు..

వాంపైర్ ఫేషియల్స్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయని చెబుతారు.  ఇది సన్నని గీతలు , ముడతలు తక్కువగా కనిపించేలా చేస్తుంది. కొంతమంది మొటిమల మచ్చలు, చర్మం బాలెన్స్ లేకుండా ఉండటం మరియు చర్మం కాంతిహీనతలో కూడా మెరుగుదల ఉంటుంది.  అదనంగా, చర్మం మరింత బిగువుగా, నునుపుగా , కాంతివంతంగా మారే అవకాశం ఉంటుంది.

ప్రమాదాలు,  దుష్ప్రభావాలు..

ప్రతి కాస్మెటిక్ ప్రక్రియ లాగే, వాంపైర్ ఫేషియల్స్‌లో కూడా కొన్ని ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. చికిత్స తర్వాత లైట్ గా ఎరుపు, వాపు, సెన్సిటివిటీ లేదా మంట వంటివి ఏర్పడవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి.

ఈ ప్రక్రియను శుభ్రమైన , గుర్తింపు పొందిన  క్లినిక్‌లో నిర్వహించకపోతే, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా పెరగవచ్చు. అందువల్ల, ఈ చికిత్సను అర్హత పొందిన క్లినిక్ లో,  శిక్షణ పొందిన నిపుణుడి దగ్గర మాత్రమే చేయించుకోవడం మంచిది.

ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందు వైద్యుడి సలహా తీసుకోవడం ఎంతో మంచిది.

                                        *రూపశ్రీ.