వాకింగ్ చేస్తే వెచ్చగా... అమ్మ కడుపు చల్లగా...

 

వాకింగ్ చేస్తే వెచ్చగా... అమ్మ కడుపు చల్లగా...


గర్భిణులు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే బిడ్డ ఆరోగ్యానికి మంచిదని తెల్సిందే. అయితే ఇప్పుడు ఆ వాకింగ్ వల్ల మరో ఉపయోగం కూడా ఉందని తేలింది అధ్యయనాలలో. కడుపులో బిడ్డ ఆరోగ్యానికి విటమిన్-డి కూడా అవసరమని, గర్భిణులు విటమిన్-డి తగినంతగా తీసుకుంటే వాళ్ళకు పుట్టే బిడ్డలకు తర్వాతి కాలంలో ఎముకలు బోలుగా తయారయ్యే ముప్పు తక్కువగా ఉంటోందని న్యూయార్క్‌లోని "హాస్పిటల్ ఫర్ జాయింట్ డిసిజస్ " నిపుణల అధ్యయనంలో తేలింది.

విటమిన్-డి లభించాలంటే అది సూర్యరశ్మి వల్లే సాధ్యం. కాబట్టి నీరెండ శరీరానికి తగిలేలా గర్భిణులు వాకింగ్ చేస్తే విటమిన్-డి లోపాల వంటి ఇబ్బందులు రావు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. గర్భంతో ఉన్నప్పుడు తగినంత డి విటమిన్ తీసుకోని తల్లులకు పుట్టిన బిడ్డల్లో తొమ్మిదేళ్ళకే ఎముకలు ఎంతోకొంత బలహీనంగా మారటాన్ని వీరు గుర్తించారు. అదే తగినంత డి - విటమిన్ తీసుకుంటే పిల్లల్లో ఇలాంటి లోపాలు తలెత్తకుండా నివారించుకోవటం సాధ్యమేనని వీరు చెబుతున్నారు. ఎముకలు గట్టిగా వుండాలంటే కాల్షియం అవసరం. ఆ కాల్షియంను శరీరం చక్కగా గ్రహించాలంటే విటమిన్-డి తగినంతగా వుండాలి. కాబట్టి పిల్లలు ఎముక పుష్టితో బలంగా, దృఢంగా వుండాలంటే కాబోయే తల్లులు సూర్యరశ్మిలో ప్రతిరోజూ కాసేపు గడపాలి. సూర్యరశ్మిని శరీరం గ్రహించాలంటే సన్ స్క్రీన్ లోషన్ల వంటివి వాడకూడదు ఆ సమయం లో.

ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహా తీసుకుంటూ శరీరానికి అన్ని పోషకాలు అందేలా చూసుకుంటే చక్కటి బిడ్డ చిరునవ్వులు చిందిస్తూ ఆరోగ్యంగా ఎదుగుతాడు  అంటున్నారు జాయింట్ డిసీజస్ నిపుణులు కాబట్టి కాబోయే అమ్మా! నీరెండలో నడవటం మర్చిపోవద్దు.

-రమ ఇరగవరపు