ఇది తింటే ఆరోగ్యం పెరుగుతుంది
posted on Dec 10, 2014
ఇది తింటే ఆరోగ్యం ‘పెరుగు’తుంది!
పెరుగు లేనిదే మన భోజనం పూర్తికాదు, పెరుగు బలమని నమ్ముతారు కూడా. అయితే పెరుగు వేడి చేస్తుంది, మజ్జిగగా చిలకరిస్తే మంచిది అని నమ్ముతారు చాలామంది. అలాగే పెరుగు తింటే లావు అవుతామేమోననే భయమూ చాలా మందికి వుంటుంది. కానీ, పెరుగు కొవ్వుకు కారణం కాకపోగా, పెరుగు తిన్నాక చాలాసేపు కడుపు నిండుగా ఉండి, చిరుతిండ్లకు దూరంగా ఉండే అవకాశం కూడా వుందట. పెరుగును ‘ప్రో బయోటిక్’ ఆహారం అంటారు. అంటే లైవ్ బ్యాక్టీరియా కలిగిన పదార్ధమన్నమాట. కాబట్టి తరచుగా పెరుగు తింటుంటే లక్షలాది ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను సమకూర్చుకుంటున్నట్లే. పెరుగులో లభించే ఈ బ్యాక్టీరియా పూర్తిస్థాయి ఆరోగ్యానికి ఎంతో అవసరం.
పెరుగుని జీవాహారం అంటారు. తాజా పెరుగుని రోజూ ఆహారంలో చేరిస్తే పేగుల్లోని ‘ఫ్లోరా’ అనే బ్యాక్టీరియా సమతౌల్యంగా ఉంటుందిట. అలాగే ఖనిజాలని, ‘బి’ విటమిన్‌లోని సింథసిస్‌ను శరీరం త్వరగా గ్రహించే శక్తిని కూడా పెరుగు అందిస్తుంది. ఇంకా అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడే శక్తి కూడా పెరుగుకు వుంటుదిట. అనేక స్థాయుల్లో ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తూ పరిరక్షణ పదార్ధంగా కూడా పెరుగు పనిచేస్తుంది. ఇక పెరుగులో కాల్షియం ఎక్కువగా వుంటుంది కాబట్టి ఎముకలకు, పళ్ళకు మేలు జరుగుతుంది.
ఎప్పుడైనా చాలా టెన్షన్‌గా, అలసటగా ఉంటే ఓ కప్పు పెరుగు కానీ, చిక్కటి మజ్జిగ గానీ తాగితే చాలు. అలాగే మానసిక అనారోగ్యాల్ని తగించటంలో పెరుగు ఎంతో సహకరిస్తుందిట. ఇక పిల్లలకి చిన్నతనంలో వచ్చేవి ఎక్కువ శాతం ఎలర్జీలకు ఆస్తమా వంటి వాటికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది, కాబట్టి పెరుగుని వీలయినంత ఎక్కువసార్లు తీసుకోవటం మంచిది అంటున్నారు పౌష్టికాహార నిపుణులు. కేవలం అన్నంలో తినటం కాకుండా ఓ కప్పు పెరుగుని ఉదయం టిఫిన్‌తో, అలాగే సాయంత్రం స్నాక్స్‌తో పాటు తీసుకోవటం అలవాటుగా చేసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.
-రమ