ముఖచర్మం మీద రంధ్రాలు పోవాలంటే ఇవి ఫాలో అవ్వండి!
posted on Apr 11, 2023
ముఖచర్మం మీద రంధ్రాలు పోవాలంటే ఇవి ఫాలో అవ్వండి!
ముఖం మీద ఎలాంటి మచ్చలు, రంధ్రాలు లేకుండా చర్మం యవ్వనంగా కనిపిస్తూ ఉండాలని అమ్మాయిలందరి ఆశ. కానీ మొటిమలు, మచ్చలు ఏర్పడటం, ముఖం మీద గుంటలు, రంధ్రాలు ఏర్పడటం చాలామంది విషయంలో జరుగుతుంది. ఓ హీరోయిన్ లానో, మోడల్ లానో ముఖం మెరిసిపోవాలని అనుకునేవారు అసలు ముఖం మీద మచ్చలు, రంధ్రాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా ముఖం మీద, ముఖ్యంగా ముక్కు, నుదురు, బుగ్గలపై పెద్ద పెద్ద రంధ్రాలు కనిపిస్తాయి. వీటిని ఓపెన్ పోర్స్ అని అంటుంటారు. ఇలాంటివి ఉన్న వారి చర్మం కఠినంగా కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వీటిని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోతుంటారు.
కొందరిలో ఇవి జన్యు పరమైన కారణాల వల్ల వస్తే.. మరికొందరిలో వయస్సు పెరిగే కొద్దీ, చర్మం స్థితిస్థాపకత, కొల్లాజెన్‌ను ఉత్పత్తి కోల్పోతుంది, దీని వలన రంధ్రాలు పెద్దవిగా కనిపిస్తాయి. సూర్యరశ్మికి ఎక్కువ గురికావడం కూడా చర్మానికి హాని కలిగిస్తుంది. చర్మాన్ని సరిగ్గా శుభ్రపరచకపోవడం లేదా కఠినమైన ఉత్పత్తులను ఉపయోగించడం వంటి చర్యల వల్ల కూడా రంధ్రాలు ఏర్పడుతాయి. మహిళల శరీరంలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు ముఖం మీద నూనె ఉత్పత్తి పెరగడానికి కారణం అవుతుంది. ఈ నూనెలే.. ముఖం మీద పెద్ద రంధ్రాలకు దారితీస్తుంది. వీటిని పరిష్కరించుకోవాలంటే ఇలా చెయ్యాలి.
ఉదయం సమయంలో..
సాలిసిలిక్ యాసిడ్ ఆధారిత ఫేస్ వాష్ ఉపయోగించాలి. ఇది రంధ్రాలను తిరిగి చిన్నగా చేయడంలో సహాయపడుతుంది.
ఫేస్ వాష్ తరువాత AHA(ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్) టోనర్ ఉపయోగించాలి. ఇందుకుగానూ నియాసినామైడ్ ఆధారిత సీరమ్ లేదా విటమిన్ సి ఆధారిత సీరమ్‌ని ఉపయోగించాలి. ఇవి రెండూ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. కొల్లాజెన్‌ను సమర్థవంతంగా ఉత్పత్తి చేసి చర్మరంధ్రాలను సాధారణంగా మార్చడంలో సహాయపడతాయి. సీరమ్ అప్లై చేసిన తరువాత చివరగా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ ఉపయోగించాలి.
పడుకునే సమయంలో..
పడుకునే ముందు పైన చెప్పుకున్ననట్టు సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పైన చెప్పుకున్నట్టు నియాసినామైడ్ ఆధారిత సీరమ్ లేదా విటమిన్ సి ఆధారిత సీరమ్‌ని ఉపయోగించాలి. రాత్రి పూట ఉపయోగించకూడదు. దాని స్థానంలో రెటినోల్ ఆధారిత సీరం ఉపయోగించాలి. సీరమ్ అప్లై చేసుకున్న తరువాత మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి.
కొన్ని జాగ్రత్తలు..
సున్నితమైన క్లెన్సర్‌తో ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగడం వల్ల మీ చర్మం నుండి అదనపు నూనె మరియు మురికిని తొలగించవచ్చు, చర్మాన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మ రంధ్రాలను అన్‌లాగ్ చేయడం, చనిపోయిన చర్మ కణాలను తొలగించడం చేయచ్చు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. టోనర్ చర్మం pHని సమతుల్యం చేయడానికి, రంధ్రాలను కుదించడానికి, చర్మం మీద నూనె లేదా ధూళిని తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి టోనర్ వాడటం అలవాటు చేసుకోవాలి. మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు, ఇది రంధ్రాల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
క్లే మాస్క్‌లు చర్మం నుండి అదనపు నూనె, దుమ్ము, ధూళితో సహా మలినాలను బయటకు తీయడంలో సహాయపడతాయి. దీన్ని వారంలో రెండు సార్లు అయినా వాడుతుంటే చర్మరంధ్రాలు పరిమాణం తగ్గి చిన్నగా అవుతాయి. చేతులతో పదే పదే ముఖాన్ని తాకడం వల్ల ఆయిల్ బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తుంది. ఇది రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఏర్పడటానికి, పెద్ద రంధ్రాలు ఏర్పడటానికి దారితీస్తుంది. ప్రతిరోజూ సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల మీ చర్మాన్ని UV కిరణాల డ్యామేజ్ నుండి రక్షించుకోవచ్చు. ఆయిల్ ఫ్రీ స్కిన్‌కేర్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల మీ చర్మంపై అదనపు నూనె పేరుకుపోకుండా నిరోధించుకోవచ్చు. ఇది ముఖరంధ్రాలు పెద్దగా మారకుండా ఉండేలా చేస్తుంది.
◆ నిశ్శబ్ద