Read more!

మండిపోయే ఎండలలో ముఖ సౌందర్యాన్ని ఇలా కాపాడుకోండి!

మండిపోయే ఎండలలో ముఖ సౌందర్యాన్ని ఇలా కాపాడుకోండి!

ఏడుకేడు ఎండల తీవ్రత పెరిగిపోతోంది. మండుతున్న ఎండ, బలమైన ఈదురుగాలులు, వేడి సెగ అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ సౌందర్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మాయిలు పులి మీదకు వస్తున్న జింక పిల్లల్లా అల్లాడిపోతారు. సన్ ట్యాన్, దుమ్ము, ధూళి కారణంగా మొటిమలు, శరీరంలో వేడి పెరగడం కారణంగా వేడి కురుపులు ఏర్పడతాయి. ఆయిల్ స్కిన్ ఉన్న వారికి ఈ సమస్య మరింత పెరుగుతుంది. దద్దుర్లు, దురదలు, మొటిమలు వచ్చినప్పుడు ఈ  సమస్య మరింత పెరుగుతుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారు ముఖంపై మేకప్ సరిగా ఉండకపోవడం, చెమట పట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. వీటి నుండి ఉపశమనం కావాలి అనుకుంటే.. ముల్తానీ మట్టి మంచి ఆప్షన్. వేసవికాలంలో ముఖారవిందాన్ని పెంటే ఫేస్ ప్యాక్ లు ఇవి. ముల్తానీ మట్టితో వీటిని జోడించి ఫేస్ ప్యాక్ వేస్తే ముఖం మెరుపులే.. అవేంటో తెలుసుకుంటే..

టమోటా.. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్..

టమోటా ముఖారవిందాన్ని పెంచడంలో బాగా పనిచేస్తుంది. పైగా ప్రస్తుతం మార్కెట్ లో వీటి ధర ఎక్కువగా ఏమీ లేదు. టమాటా గుణాలు  చర్మానికి చాలా మేలు చేస్తాయి. ముల్తానీ మిట్టిలో టమాటా రసాన్ని కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది. ఈ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో ఒకటిన్నర టీస్పూన్ల ముల్తానీ మిట్టి మరియు రెండు టమోటాల రసాన్ని కలపాలి. బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖం, మెడ అంతా పట్టించి   ఇరవై నిమిషాలు ఉంటి ఆపై ముఖం కడిగేయాలి. 

ముల్తానీ మట్టి.. కలబంద ఫేస్ ప్యాక్..

కలబంద ప్రతీ ఇంట్లో అలంకారం కోసమని పెంచుతూ ఉంటారు. కానీ ఇది మంచి సౌందర్య సాధనం అనే విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. వేసవి కాలంలో ముఖాన్ని చల్లబరచడానికి కలబంద బాగా పనిచేస్తుంది. దాన్ని  ముల్తానీ మట్టితో కలిపి రాసుకుంటే చర్మానికి ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిని ఒక గిన్నెలోకి తీసుకుని, దానికి 1 టేబుల్ స్పూన్ తాజా అలోవెరా జెల్ జోడించండి.పేస్ట్ లాగా చేసుకుని దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ఈ పేస్ ప్యాక్ ను తొలగించుకోవాలి. కడిగిన వెంటనే దీని ప్రభావం అంతగా కనిపించదు కానీ మెల్లిగా కనిపిస్తుంది. 

ముల్తానీ మట్టి.. తేనె ఫేస్ ప్యాక్..

తేనెలో ఆరోగ్యం కోసమే కాదు.  సౌందర్య సాధనంగానూ శక్తివంతమైనది. ఇది చర్మానికి గొప్పగా ఉపయోగపడుతుంది.చర్మాన్ని మృదువుగానూ, కాంతివంతంగానూ మారుస్తుంది.  ఒక గిన్నెలో ఒకటి నుండి ఒకటిన్నర టీస్పూన్ ముల్తానీ మట్టి మరియు అర టీస్పూన్ తేనె  వేసి కలపండి. ఇది కాస్త పేస్టులా అవ్వడానికి ఇందులోకి కాసింత   రోజ్ వాటర్ కూడా కలపుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. 
 
నిమ్మరసం.. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్..

నిమ్మరసంలో ముల్తానీ మట్టిని కలిపి ప్యాక్‌ని సిద్ధం చేసుకోవాలి. దీన్ని వాడటం వల్ల చర్మం మెరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి  రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టిలో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. పేస్ట్ గట్టిగా మారినట్లయితే, దానికి కాసింత రోజ్ వాటర్ జోడించవచ్చు. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. 

పైన చెప్పుకున్న నాలుగు ఫేస్ ప్యాక్ లలో ఏదో ఒకటి మీకు అనుగుణంగా ఉన్నది ఫాలో అయినా సరిపోతుంది. వేసవిలో ముఖచర్మానికి కలిగే అసౌకర్యానికి ఇవి చెక్ పెడతాయి.

                                            ◆నిశ్శబ్ద.