డెలివరీ తరువాత బరువు తగ్గాలంటే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..!
posted on Jun 15, 2024
డెలివరీ తరువాత బరువు తగ్గాలంటే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..!
గర్భధారణ సమయంలో మహిళలు చాలా బరువు పెరుగుతారు. డెలివరీ తర్వాత అంత ఈజీగా బరువు తగ్గరు. ఇలాంటి మహిళలు బరువు తగ్గే విషయంలో చాలా కష్టపడుతుంటారు. కొంతమంది మహిళలు లావుగా ఉన్నామని చాలా ఫీలవుతారు. తల్లి అయిన తర్వాత శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు కూడా బరువు పెరగడానికి, ఆ తరువాత బరువు అంత సులువుగా తగ్గలేకపోవడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా సిజేరియన్ ద్వారా పిల్లలను కన్న వారికి బరువు తగ్గడంలో సమస్యలు ఎక్కువ. దాదాపు 6 నెలల పాటు ఎటువంటి తీవ్రమైన వ్యాయామం చేయకూడదని వైద్యులు చెబుతుంటారు కాబట్టి ఇలాంటి వారు బరువు తగ్గడానికి సాహసం చేయరు. అంతే కాదు సిజేరియన్ కారణంగా పొట్ట భాగంలో కొవ్వు పెరగడం కూడా వేగంగానే ఉంటుంది. అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల, కొన్ని ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల డెలివరీ తరువాత బరువు తగ్గడం సులువుగా ఉంటుంది. అదెలాగో ఓ లుక్కేస్తే..
వాము నీరు..
ప్రసవం తర్వాత తల్లికి వాము నీరు త్రాగడానికి ఇస్తారు. ఈ నీటి రుచిని మహిళలు ఇష్టపడనప్పటికీ క్రమం తప్పకుండా తాగడం వల్ల కడుపులో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం నీటిలో వాము గింజలు వేసి నీటిని మరిగించాలి. చల్లగా అయిన తరువాత రోజంతా ఈ నీటిని త్రాగాలి. 1-2 నెలల తర్వాత ఉదయం 1 గ్లాసు వాము నీరు తాగడం మొదలు పెట్టాలి. ఇందుకోసం రాత్రంతా వాము గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని వడగట్టి తాగాలి. బరువు, పొట్ట భాగంలో కొవ్వు కూడా తగ్గుతాయి.
గ్రీన్ టీ..
డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి గ్రీన్ టీని చేర్చుకోండి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంలో సహాయపడతాయి. తినడానికి ముందు లేదా తర్వాత 1 కప్పు గ్రీన్ టీ త్రాగాలి. మిల్క్ టీ తాగే అలవాటు ఉంటే దాని బదులుగా గ్రీన్ టీ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఊబకాయం తగ్గి చర్మం కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది. అయితే గ్రీన్ టీకి చక్కెర జోడించకూడదు.
దాల్చిన చెక్క, లవంగాలు..
దాల్చిన చెక్క, లవంగాలు పొట్టలోని కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దాల్చినచెక్క, లవంగాల వినియోగం గర్భధారణ తర్వాత బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 1 గ్లాసు నీటిలో 2 నుండి 3 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కను ఉడకబెట్టాలి. ఈ నీటిని వడగట్టి ఉదయాన్నే తాగాలి. కావాలంటే ఈ నీటిని రోజంతా గోరువెచ్చగా తాగవచ్చు.
జాజికాయ పాలు..
స్థూలకాయం తగ్గాలంటే పాలలో జాజికాయ కలుపుకుని తాగాలి. ఇది బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రాత్రి పడుకునే ముందు జాజికాయ పాలు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీని కోసం 1 కప్పు పాలలో 1/4 టీస్పూన్ జాజికాయ పొడిని కలపాలి. ఈ పాలు గోరువెచ్చగా త్రాగాలి.
బాదం, ఎండుద్రాక్ష..
బాదం, ఎండుద్రాక్షలను రోజూ తినడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గుతారు. బాదంపప్పు పూర్తి ఫైబర్ మూలం. ఎండుద్రాక్ష కడుపుని శుభ్రంగా ఉంచుతుంది. డెలివరీ సాధారణమైతే కొన్ని రోజుల తర్వాత బాదం, ఎండుద్రాక్ష తినవచ్చు. ఆపరేషన్ ద్వారా బిడ్డ పుడితే వైద్యుల సలహా మేరకు బాదం, ఎండు ద్రాక్ష తినవచ్చు. రోజుకు 10 ఎండుద్రాక్ష, 4 నుండి 8 వరకు బాదంపప్పులు తినడం వల్ల బరువు తగ్గుతారు.
*రూపశ్రీ.