పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. అయితే ఇవి ఫాలో అవ్వండి చాలు!
posted on Jun 16, 2023
పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. అయితే ఇవి ఫాలో అవ్వండి చాలు!
బరువు పెరగలన్నా, తగ్గాలన్నా, ఆహారాన్ని నియంత్రించుకోవలన్నా, రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవాలన్నా ప్రతిదానికి ఓ డైట్ ప్లాన్, ఓ సమయ పాలన ఉంటుంది. కానీ ఎత్తు పెరగడమనే విషయంలోకి వస్తే.. అది ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఎత్తు పెరగడం అనేది చిన్నతనం నుండి ఓ దశలోకి వచ్చి ఆగిపోతుంది. ఓ దశాబ్ద కాలాన్ని సరిగ్గా గమనిస్తే పిల్లలు తగినంత ఎత్తు పెరగడం లేదనే వాస్తవం అర్థం అవుతుంది. పిల్లలు పెరగాల్సిన వయసులో వారు ఎత్తు పెరగడానికి తగిన వాతావరణం, తగిన ఆహారం లభించకపోవడమే పిల్లల్లో ఎదుగుదల లేకపోవడానికి కారణం అవుతుంది. పిల్లల ఎత్తును పెంచడానికి ఉత్తమ మార్గం తెలుసుకుంటే ప్రతి తల్లి తమ పిల్లల విషయంలో దాన్ని చక్కగా ఫాలో అవ్వచ్చు...
సాధారణంగా పిల్లలఎత్తు ప్రధానంగా జన్యువులతో నిర్ణయించబడుతుంది. అయితే, జీవనశైలి సరైన జన్యు సామర్థ్యాన్ని చేరుకోవడంలో చాలా వరకు సహాయం చేస్తుంది.
ఆటలు ముఖ్యం..
పిల్లల్ని స్కూళ్ళు, ట్యూషన్లతో ఎప్పుడూ కట్టేసినట్టు ఉంచకండి. రోజులో కొంతసేపు కింది ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఆటలు, ఈత, బాస్కెట్‌బాల్ వంటివి పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి.
ఆహారంలో తగినంత ప్రోటీన్ చేర్చడం మరీ ముఖ్యం. సరైన స్థాయిలో కాల్షియం, విటమిన్ డి పిల్లలకు అందించడం మరెంతో ముఖ్యం.
పొడవాటి ఎముకలలోని ఎపిఫైసెస్ (గ్రోత్ ప్లేట్లు) ఫ్యూజన్ కౌమారదశలో వస్తాయి. ఈ గ్రోత్ ప్లేట్లు ఫ్యూజ్ అయిన తర్వాత, నిలువు ఎముక పెరుగుదల ఆగిపోతుంది. అంటే తరువాత ఎత్తు పెరగదు. అబ్బాయిలకు సగటున 16-18 ఏళ్లు, బాలికలకు 14-15 ఏళ్లు సమయం ఎత్తు పెరుగుదలకు చివరి దశ. ఈ సమయంలో గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి మందగించి ఎపిఫైసెస్ ఫ్యూజ్ అవుతుంది.
గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహజమైన మార్గాలు ఉన్నాయి, ఇవి సరైన ఎత్తుకు చేరుకోవడంలో సహాయపడతాయి. వీటిలో పైన చెప్పుకున్నట్టు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి బాగా అందేలా చూసుకోవాలి. ఆటలు ఆడటం తప్పనిసరి. ముఖ్యంగా బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్ వంటి ఎముకల పొడవును ప్రేరేపించే ఆటలు ఆడించాలి. పొడవు పెరగాల్సిన దశ దాటిపోయాక ఎన్ని ప్రయోగాలు చేసినా పొడవు ఒరేగడం కుదరదు. ఈ విషయన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.
ముఖ్యంగా పిల్లలజీవనశైలిలో ఆహారంలో తెలియని మార్పులు చేసే ముందు ప్రతి తల్లి వైద్యులను సంప్రదించిన తరువాతే వాటిని పాటించాలి.
◆నిశ్శబ్ద.