తెల్లకుసుమ వ్యాధి వేధిస్తోందా..ఇదిగో చిట్కాలు!
posted on Oct 22, 2024
తెల్లకుసుమ వ్యాధి వేధిస్తోందా..ఇదిగో చిట్కాలు!
మహిళలను వేధించే సమస్యలు చాలా ఉన్నాయి. వాటిలో అధిక రతుస్రావం కావడం ఒకటైతే, అసలు రక్తస్రావం సరిగా కాకపోవడం రెండవ సమస్య. వీటికి విభిన్నంగా మహిళల్లో ఎదురయ్యే మరొక సమస్య ఉంది. అదే వైట్ డిశ్చార్జ్. తెల్లబట్ట అని అందరూ పిలుచుకునే ఈ సమస్యను ఆయుర్వేదం ప్రకారం తెల్లకుసుమ వ్యాధి అని అంటారు. ఈ వ్యాధికి సాధారణ ఇంగ్లీషు వైద్యంలో ఎన్నో మందులు ఉన్నా అవి వాడినన్ని రోజులు ఆరోగ్యం బాగుంటుంది కానీ మందులు వాడటం ఆపగానే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. అదే ఆయుర్వేదంలో సహజ మార్గాల ద్వారా, అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలను ఉపయోగించి సమస్యలను తగ్గించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుసుకుంటే…
తెల్ల బట్ట అవుతున్నప్పుడు అందరూ సులువుగా పాటించగలిగే చిట్కా ఒకటుంది. మొదటి 3 రోజులు వరకు ఒక్కొక్క చెంచా ఆముదాన్ని తాగాలి. ఇలా ఆముదాన్ని తీసుకున్న తరువాత తెల్లబట్టకు వైద్యులు సూచించిన మెడిసిన్ వాడాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మహిళల్లో ఈ సమస్య ఉన్నప్పుడు ఈ చిట్కా పాటించేటప్పుడు మగవారికి దూరంగా ఉండాలి.
మహిళలకు అందరికీ అందుబాటులో ఎంతో సులువుగా పాటించగలిగే మరొక చిట్కా వంటింట్లో దాగుంది. ప్రతి రోజు అన్నం చేయడానికి మహిళలు బియ్యం కడుగుతూ ఉంటారు. మొదటిసారి బియ్యం కడిగేసాక అందులో దుమ్ము మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. రెండవసారి బియ్యం కడిగిన నీటిని విడిగా తీసుకోవాలి. ఈ బియ్యం కడిగిన నీళ్లలో అయిదు గ్రాముల జీలకర్ర, అయిదు గ్రాముల పటిక బెల్లముల పొడిని తీసుకుని ఆ పొడిని బియ్యం కడిగిన నీళ్లలో కలిపి త్రాగాలి. ఇలా చేయడం వల్ల తెల్లబట్ట సమస్య నుండి మంచి ఫలితం ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో మోదుగ చెట్లు చాలా విరివిగా పెరుగుతుంటాయి. ఈ చెట్లకు పూలు కాస్తాయి. 10-15 మోదుగ పూలను, తీసుకోవాలి. 100-200 మి.లీ. ల నీటిలో తీసుకున్న మోదుగపూలను నానబెట్టి ఆ తరువాత పూలను తీసేయాలి. ఆ నీటిని త్రాగటం తెల్లబట్ట సమస్య తగ్గిపోతుంది. లేదంటే మరొక పరిష్కారం కూడా ఉంది. 5 తాజా గులాబీ పూలను తీసుకోవాలి. ఈ పూలను ఉదయం, సాయంత్రం రెండు పూటలా పటిక బెల్లముతో తిని ఆవుపాలు త్రాగాలి. ఇలా చేస్తుంటే తెల్లబట్ట సమస్య క్రమంగా తగ్గిపోతుంది.
పైన చెప్పుకున్న ఎంతో సులువైన, అందరికీ అందుబాటులో ఉన్న పదార్థాలతో చిట్కాలు పాటించి తెల్లబట్ట సమస్యను తగ్గించుకోవచ్చు.
◆నిశ్శబ్ద.