నెలసరి మూడురోజుల్లో ఈ అయిదు పనులు అస్సలు చేయకండి!
posted on Jul 20, 2023
నెలసరి మూడురోజుల్లో ఈ అయిదు పనులు అస్సలు చేయకండి!
ప్రకృతి మహిళలకు మాత్రమే ఏర్పాటు చేసిన వ్యవస్థ ఋతుచక్రం, గర్భధారణ, ప్రసవం మొదలైనవి. అయితే పీరియడ్స్ సమయంలో మహిళల ప్రవర్తనను, అలవాట్లను చూసి కొంతమంది విమర్శిస్తుంటారు. మరికొందరు పెదవి విరుస్తుంటారు. అయితే నెలసరి సమయంలో మహిళలు తమ గురించి తాము కేర్ తీసుకోవడం చాలా అవసరం. కేవలం మహిళలే కాదు, ఆ సమయంలో మగవారు కూడా మహిళలకు తమదైన సహాయం, సహకారం అందించాలి. ఎందుకంటే కొన్ని పనులు చేయడం వల్ల పీరియడ్స్ బాధాకరంగా మారుతుంది.
అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు అయిదు పనులు అస్సలు చేయకూడదు. ఇంతకీ అవేంటి?? ఎందుకు చేయకూడదు?? పూర్తిగా తెలుసుకుంటే..
పీరియడ్స్ సమయంలో ఈ 5 తప్పులు చేయకండి..
యోగా..
పీరియడ్స్ సమయంలో యోగా చేసే అలవాటు ఉన్న మహిళలు యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరాన్ని తలకిందులు చేసే యోగాసనాలు వేయడం మానుకోవాలి. సర్వంగాసనం, శీర్షాసనం, హలాసనం మొదలైన వాటిలో కాళ్ళను పైకి లేపాల్సి ఉంటుంది. దీని కారణంగా రక్తస్రావం యొక్క సహజ గురుత్వాకర్షణ ప్రవాహం చెదిరిపోతుంది.
వర్కౌట్..
యోగా.. వర్కౌట్ వేరు వేరు అయినా అవి శరీరం మీద ఒత్తిడి కలిగించేవే.. ఈ సమయంలో వర్కవుట్ అయినా ఇంటెన్స్ యాక్టివిటీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ పెరగడం మొదలవుతుంది. శరీరం రిలాక్స్‌గా ఉండదు. హెవీ వర్కవుట్స్ వల్ల పొట్టపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.
విశ్రాంతి..
పీరియడ్స్ సమయంలో విశ్రాంతి ఉండాలి అనే నెపంతో చాలామంది రోజంతా పడుకునే ఉంటారు. అయితే ఇలా రోజంతా మంచం మీద పడుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నెలసరి కాలంలో నొప్పి, తిమ్మిరి చాలా తీవ్రంగా ఉంటుంది. పడుకునే ఉండటం వల్ల కూడా ఇవి అధికమయ్యే అవకాశం ఉంది. నెలసరి సమయంలో లైట్ స్ట్రెచింగ్, వాకింగ్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. దీని వల్ల మానసిక స్థితిని మెరుగుపరిచే హార్మోన్లు పెరుగుతాయి, నొప్పి కూడా తగ్గుతుంది.
ఆహారం..
పీరియడ్స్ సమయంలో చిప్స్, చాక్లెట్, బర్గర్ లాంటివి తినాలని అనిపిస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ వీటిని ఆపేయడం మంచిది. వీటిలో పోషకాహారంకు బదులుగా కేలరీలు ఉంటాయి, దీని కారణంగా శరీరానికి నిజమైన పోషకాహారం లభించదు. పైపెచ్చు బరువు పెరగడానికి దారి ఇస్తుంది.
తలస్నానం..
నెలసరిలో ఉన్నప్పుడు తలస్నానం చేయడం గురించి చాలా వాదనలు ఉన్నాయి. తలస్నానం చేయచ్చని, చేయకూడదని వైద్యులు, సైన్స్ అంగీకరించడం లేదు, అయితే యోగా ప్రకారం, పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయకూడదు. తలపై నీటిని పోయడం వల్ల, అపాన వాయువు క్రిందికి ప్రవహిస్తుంది, ఇది హానికరం.
ఈ అయిదు పనులు ఆ మూడు రోజులు చేయకుండా ఉంటే లాభాలే తప్ప నష్టాలేమి లేవు. కాబట్టి వీటిని ఫాలో అయితే మంచిది.
*నిశ్శబ్ద.