సర్దుకుపోవడం నేర్పితే సమస్యలే వుండవు...

 

సర్దుకుపోవడం నేర్పితే సమస్యలే వుండవు...

 

పిల్లలంటే అమ్మకి ఎంతో ప్రేమ. వారికి ఏ బాధా కలగకుండా చూసుకోవాలనుకుంటుంది. వారి ప్రతి కోరికా తీర్చాలనుకుంటుంది. పిల్లలు అడిగిందే తడవుగా వారు కోరినవన్నీ కొనివ్వాలనుకుంటుంది. అయితే ఇలా కోరినవన్నీ పొందటానికి అలవాటు పడ్డ పిల్లలు, కోరినది దొరకనపుడు సర్దుకుపోవటం ఎలాగో నేర్చుకోలేరు. మన చేతుల్లో వున్నంతవరకు వాళ్ళకి అన్నీ అందుబాటులో వుంచుతాం. కానీ జీవితంలో కోరినవన్నీ దొరకాలని లేదు కదా! మరప్పుడు దొరికిన దానితో సర్దుకుపోవటం ఎలాగో పిల్లలకు తెలీక ఇబ్బంది పడతారు. అందుకే గెలుపు, ఓటములు, సర్దుకుపోవటం వంటివన్ని మనమే పిల్లలకి రుచి చూపించాలి. ఇందుకు సంబంధించిన ఓ కథ చెప్పుకుందాం.

ఒక ఊరిలో ఓ చిన్న కుటుంబం నివసిస్తోంది. తండ్రి ఓ చిన్న ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలని పోషిస్తూ వుండేవాడు.  సంపాదన తక్కువైనా పిల్లలు ఏది అడిగినా దానిని తీర్చాలని తాపత్రయం పడేవాళ్ళు ఆ దంపతులు.  ఒకసారి సెవెంత్ క్లాసు చదువుతున్నపుడు వాళ్ళ పెద్దకొడుకు రాకెట్ కావాలని అడుగుతాడు. తన ఫ్రెండ్స్‌కి వాళ్ళ మావయ్య అమెరికా నుంచి బొమ్మ రాకెట్ తెచ్చాడని, అలాంటిది తనకీ కావాలని పేచీ పెడతాడు. పిల్లల  కోరికలన్నీ తీర్చాలని వున్నా, ఈ కోరిక తీర్చటం వాళ్ళ స్థోమతకు మించినది. ఎలా మరి? అని మథన పడతారు అ దంపతులు. రాకెట్ కోసం పిల్లాడి పేచీ రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. చివరికి పిల్లాడి తల్లి ఓ నిర్ణయానికొస్తుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి బోలెడన్ని రంగు కాగితాలు, జిగురు వంటివి తెచ్చిపెడుతుంది.
 
పిల్లలురాగానే వాళ్ళముందు రంగు కాగితాలు, కత్తెర, జిగురు పెడుతుంది. ఈ రోజు మనమే మంచి ఆట ఆడబోతున్నాం. ఈ రంగురంగు కాగితాలతో మీకు నచ్చినట్టు స్టార్స్‌ని, మూన్‌ని, సన్‌ని ఇలా అంతరిక్షాన్నంతటినీ మన గోడమీదకి తీసుకురావాలి. మీ గదిలోని గోడ పైన మీ ఇద్దరి క్రియేటివిటీతో అంతరిక్షాన్ని రెడీ చేస్తే ఆ అంతరిక్షం పైకి వాళ్ళే రాకెట్‌ని నేను మీకు ఇస్తాను అంటుంది. ఇక పిల్లలిద్దరూ హుషారుగా పని మొదలుపెడతారు గంటలు గడుస్తాయి. అమ్మా అయిపోయింది అని పిలుస్తారు. గోడ నిండా చుక్కలు, గ్రహాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. రాకెట్ ఏది అని అడుగుతారు పిల్లలు.

ఆ తల్లి చిన్నగా నవ్వి మీ గదిలోని ఈ అంతరిక్షoలోకి వెళ్ళటానికి ఇదిగో ఈ కాగితం రాకెట్ సరిపోతుంది చూడండి అంటూ వివిధ సైజుల్లో చేసిన పేపరు రాకెట్లని చూపిస్తుంది. ఇదిగో ఎవరి రాకెట్ ఎక్కడికి వెళుతుందో విసరండి అంటుంది. పిల్లలిద్దరూ    పేపర్ రాకెట్లు విసురుతారు. ఆ ఆట వాళ్ళకి ఎంతో నచ్చుతుంది. మా ఫ్రెండ్ దగ్గరైతే బ్యాటరీలతో కొంతదూరం ఎగిరే రాకెట్ వుంది కానీ మన దగ్గర అంతరిక్షమే వుంది అంటారు. వాళ్ళ ఆనందాన్ని చూసిన తల్లికి అనిపిస్తుంది. పిల్లలు అడిగినవి మన చేతుల్లో లేనపుడు ‘‘లేదు’’ అని చెప్పటం కాదు వాళ్ళని ఎలా మళ్లించాలో తెలిసివుండాలి.

ఆ తర్వాత ఆ పిల్లలు ఎప్పుడూ ఏ బొమ్మా కావాలని పేచీ పెట్టలేదు. నచ్చిన బొమ్మ కనిపిస్తే దానిని స్వయంగా ఎలా చేసుకోవచ్చో ఆలోచించేవారు.  అమ్మ సాయంతో రకరకాల బొమ్మలు తయారు చేసుకున్నారు. వారి ఆలోచనలకి పదును పెట్టారు, కొన్న బొమ్మలతో కూడా దొరకనంత తృప్తిని పొందారు. అన్నీ తెలుసుకోలేని వయను పిల్లలది. వారికి నిజమైన ఆనందాన్ని రుచి చూపిస్తే తప్పకుండా వారు ఆ దారిలో నడుస్తారు.  ఈసారి పిల్లలు అడిగినవన్నీ సమకూర్చాలని అనిపిస్తే ఒక్కసారి ఈ కథ గుర్తుచేసుకుంటారు కదూ!

-రమ