యోగాసనాలు - 2

 

 

యోగాసనాలు - 2

Yogasana - 2

 

యోగాసనాలు వాటి లాభాలు

5. పశ్చిమోత్తానాసనం

         గాలి వదిలి ముందుకు వంగి చేతులతో పాదాలను తాకి, తలను మోకాలుకు తగిలించాలి. శ్వాసక్రియ మామూలుగా జరపాలి. కాళ్ళు వంపు లేకుండా వుండాలి. గాలి పీల్చి నెమ్మదిగా తలను పైకెత్తి సాధారణ స్థితికి రావాలి.

ఉపయోగాలు : జ్ఞాపక శక్తిని పెంపొందింప చేసి , ఉదర అంగాల పనితీరును మెరుగుపరుస్తుంది . వెన్నుకు బలాన్ని ఇస్తుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి అంగాలకు బలం చేకూరుస్తుంది .

హెచ్చరిక : వెన్ను సమస్య ( బ్యాక్ పెయిన్ ), కడుపులో పుండు , వరిబీజం కలవారు ఈ భంగిమ వేయవద్దు.

6. భుజంగాసనం

నేలమీద బోర్లా పడుకోవాలి. అరచేతులను ఛాతీకి ఇరువైపులా  ఉండేలా పెట్టండి. గాలిని పీలుస్తూ తల, ఛాతీ, బొడ్డు భాగం వరకు పైకి ఎత్తాలి. చేతులను మోచేయి భాగంలో ఉంచాలి. శ్వాసక్రియ మామూలుగా చేసి, ఆ తర్వాత గాలిని వదులుతూ సాధారణ స్థితికి రావాలి.

ఉపయోగాలు : ఇది వెన్నునొప్పిని, అస్తమా , మలబద్ధకం , షుగర్ వంటి వాటిని బయటపడేస్తుంది. స్త్రీలకు మంచి శరీర సౌష్టవాన్ని కలుగజేస్తుంది .

హెచ్చరిక : వెన్ను సమస్య ( బ్యాక్ పెయిన్ ) , కడుపులో పుండు, వరిబీజం కలవారు ఈ భంగిమ వేయవద్దు.

7. ధనురాసనం

      నేల మీద బోర్లా పడుకుని చేతులని ఆనించండి. ముఖం కుడి వైపుకి తిప్పి మోకాళ్ళ వద్ద వంచి పాదాలు పైకి లేపండి. పాదాలను పిరుదులకు దగ్గరగా తీసుకురండి. చేతులను వెనక్కి చాపి, పాదాలను చీలమండల వద్ద పట్టుకోవడానికి ప్రయత్నించండి . మోకాళ్ళు, పాదాలు రెండు సాధ్యమైనంత వరకు దగ్గరగా వుండేలా చూడండి.

       గాలిని బలంగా లోపలికి పీల్చి మెడను తలను పైకి చాపాలి. ఊపిరి బిగపట్టి, చేతుల్ని వంచకుండా పూర్తి శరీరాన్ని పైకి లేపాలి. తల, ఛాతీభాగం , తొడభాగం నేలమీదినుంది పైకి లేపాలి . ఈ స్థితిలో 5 నుండి 6 సెకన్లు ఉండాలి.

        చేతులతో చీలమండలు పట్టుకునే, గాలి విడుస్తూ నెమ్మదిగా తిరిగి పూర్వపు స్థితికి రావాలి. తల పక్కకు వంచి నేలకు ఆనించాలి, ఊపిరి సాధారణంగా తీసుకోవాలి.

      చేతులను తిరిగి పూర్వపు స్థితిలో ఉంచాలి, కాళ్ళను నెమ్మదిగా నేల మీద నిటారుగా చాపాలి. 6 నుండి 8 సెకన్ల వరకూ విశ్రాంతి తీసుకుని తిరిగి రెండవ సారి ధనురాసనం చేయవచ్చు .

ఉపయోగాలు :

          మొదటిసారిగా చేస్తున్నప్పుడు చీలమండలం పట్టుకోవడం కష్టమనిపిస్తే, పాదాల వేళ్ళను పట్టుకోవచ్చు. ఈ ఆసనం వల్ల శరీరంలోని అన్ని రకాల కీళ్ళ జాయింట్లు బలోపేతమవుతాయి . పొట్ట, నడుము భాగంలోని కొవ్వుని కరిగిస్తుంది . జీర్ణ శక్తిని పెంచుతుంది . వెన్నెముకకు సాగే గుణాన్ని ఇస్తుంది. దీని వలన  పొడుగు పెరిగే అవకాశముంది. ఆ ఆసనం వల్ల దీర్ఘకాలపు జీర్ణకోశవ్యాధులు, ప్రేగుల నొప్పులు తగ్గుతాయి. అస్తమా , మధుమేహం, మలబద్ధకం , నాడీబలహీనత , తీరు మారిన బహిష్టులు వంటి సమస్యలను తొలగిస్తుంది .

హెచ్చరిక :

గుండె జబ్బులు, కడుపులో కురుపు, వరిబీజం , వెన్నుపూసల నొప్పి వంటివి గలవారు ఈ ఆసనం వేయకూడదు .

8. అర్థ హలాసనం

గాలిని లోపలికి పీలుస్తూ ఎడమ కాలును పైకి ఎత్తాలి. మోకాలు దగ్గర కాలు వంగకూడదు, గాలిని పీల్చి వదలాలి. ఆ తర్వాత ఎడమ కాలు దించి కుడికాలు పైకి ఎత్తి అదే పద్ధతిలో గాలి పీల్చి వదలండి .

ఉపయోగాలు : ఇది నడుము కింది భాగానికి, మోకాలు కీళ్లకు, ఉదర కండరాలకు తగిన వ్యాయామం . కీళ్ళ నొప్పులకు నడుము కింది భాగం, వెన్నునొప్పికి ఇది బాగా పనిచేస్తుంది .

హెచ్చరిక : వెన్ను సమస్య ( బాక్ పెయిన్ ), కడుపులో పుండు, వరిబీజం కలవారు ఈ ఆసనం వేయవద్దు .

9. హలాసనం

గాలి పీలుస్తూ కాళ్ళను పైకి ఎత్తండి. గాలి వదులుతూ కాళ్ళను తల మీదుగా వెనక్కి తీసుకువెళ్ళి కాలి వేళ్ళను నేలకు తాకించాలి. చేతులను వెనక్కి చాచి పాదాల దగ్గరికి తీసుకువెళ్ళాలి . శ్వాసక్రియ మామూలుగా కొనసాగించాలి . గాలి లోపలికి పీలుస్తూ కాళ్ళను పైకి ఎత్తాలి. గాలిని వదులుతూ కాళ్ళను సాధారణ స్థితికి కిందికి దించాలి. ఇదే భంగిమ మరో రెండు సార్లు చేయాలి .

ఉపయోగాలు : దీని వలన జీర్ణక్రియ మెరుగవుతుంది . వెన్నుకు వీపు కండరాలకు బలమిస్తుంది . అస్తమా , మలబద్ధకం, షుగర్ ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది .

హెచ్చరిక : అధిక రక్త పోటు గలవారు , గుండె జబ్బులు వున్నవారు , వరిబీజం, అల్సర్ , స్సాండిలోసిస్ వున్నవారు ఈ ఆసనం వేయవద్దు .

10. మత్స్యాసనం

ద్మాసనంలో కాళ్ళు మెలిక వేసినట్టుగా వేసి వెనక్కి పడుకోవాలి

గాలి లోపలికి పీల్చి ఛాతీని పైకి లేపండి. మెడను  వెనక్కి వంచండి. శ్వాసక్రియ సాధారణ స్థాయిలోనే చేయండి. గాలిని వదులుతూ మోకాళ్ళ మీద బరువు పెడుతూ సాధారణ స్థితికి రావాలి .

ఉపయోగాలు :

ఈ ఆసనం శ్వాసక్రియను మెరుగు పరుస్తుంది . థైరాయిడ్ , పారా థైరాయిడ్ గ్రంథుల సమస్యలను తగ్గిస్తుంది. వెన్ను సులభంగా కదిలేలా చేయగలదు .

హెచ్చరిక : వెన్ను సమస్య (బాక్ పెయిన్), కడుపులో పుండు, వరిబీజం కలవారు ఈ భంగిమను వేయవద్దు .