యోగాసనాలు


 

యోగాసనాలు 

Yogasan

                                          వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది . జీవన విధానం శరవేగంతో మారిపోతుంది . ఇడ్లీ సాంబార్ల స్థానం బ్రెడ్ ఆమ్లెట్, పిజ్జా బర్గర్లు ఆక్రమించుకున్నాయి. ఖండాంతర జీవనం అతి మామూలు విషయం అయ్యింది. పెరిగే ఆదాయంతో పాటు పెరుగుతున్న మానసిక ఒత్తిడులు మనల్ని తేలికగా వ్యాధుల బారిన పడేస్తున్నాయి. ఇటువంటి సమయంలో కాస్త సమయం మన సంప్రదాయ ఆరోగ్య పద్ధతులకు కేటాయిస్తే, ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత కూడా మన సొంతమవుతుంది . అలాంటి పద్ధతుల్లో మనం మొట్ట మొదటగా పేర్కొనవలసింది యోగా.

              యోగాసనాలు ప్రాక్టీస్ చేయాలంటే మీరేమీ పెద్దగా ఖర్చు చేయనక్కరలేదు . దీనికి కావలసినవి మంచి వెంటిలేషన్ వున్న గది, ఒక కార్పెట్ , ఆసనాలు వేయడానికి తేలికపాటి చుడీదార్ లేదా స్పోర్ట్ సూట్ మాత్రమే .

యోగాసనాలు

                           యోగాభ్యాసమన్నది మన పూర్వీకులు మనకందించిన అమూల్యమైన ఆరోగ్య విజ్ఞానం అని చెప్పుకోవచ్చు. దీనిని ప్రాక్టీస్ చేయడానికి వయసు పరిమితి లేదు. మూడేళ్ళ పసికందు నుండి, తొంభై ఏళ్ళ పై బడిన వయసు వారి వరకు అందరూ యోగాసనాలు వేయవచ్చు . ఏవైనా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారు, ఆపరేషన్లు జరిగినవారు మాత్రం వారి డాక్టర్ ను సంప్రదించి మొదలుపెట్టడం మంచిది .

               యోగాను ఒక సైన్స్ గా అభివర్ణించవచ్చు . పతంజలి అనే ఋషిని యోగశాస్త్ర పితామహుడిగా చెప్తారు.  క్రీస్తు పూర్వం నాడే  వర్ధిల్లిన ఈ విజ్ఞానం, క్రీస్తు శకం లోని వారికి కూడా ఆరోగ్యం అందించగలుగుతుంది. ఏరోబిక్స్ వంటి ఆధునిక వ్యాయామ పద్ధతులు శరీరానికి కొంత మేలు చేయగలుగుతున్నా, ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను చేకూర్చడంలో యోగాకి సాటి ఏదీ లేదని చెప్పుకోవచ్చు.

యోగాసనాలు - వాటి లాభాలు

పద్మాసనం:                                                                        

 * మొదట కాళ్ళు చాచి కూర్చోవాలి . వీపు నిటారుగా ఉంచాలి .  

* కుడికాలు మడిచి పైకి లేపి కుడి పాదం ఎడమ తొడ మీదకు వచ్చేలా పెట్టాలి.

* ఎడమ కాలు మడచి అలాగే కుడి తొడ మీద పెట్టాలి. చూడటానికి కాళ్ళు మెలిక వేసుకుని కూర్చున్నట్టుగా ఉంటుంది .

* పాదాల అడుగు భాగం బొడ్డు ప్రాంతంలో ఉంచాలి. చేతులు రెండూ మోకాళ్ళ మీద ఆన్చాలి.

* నెమ్మదిగా ఊపిరి పీల్చి వదలండి. ఐదు శ్వాసల తో మొదలుపెట్టి పది శ్వాసల కాలం వరకూ కూర్చోవడానికి ప్రయత్నించాలి .

ఉపయోగాలు : పద్మాసనం వలన మెదడు ప్రశాంతతమవుతుంది. నాడులు, కండరాలు బలపడతాయి. ప్రోస్టేట్ గ్రంధి సమస్యలు, స్త్రీల ఋతుచక్రంలో తేడాల సమస్యలకు చికిత్సగా ఉపయోగపడుతుంది .

హెచ్చరిక : మోకాలి నొప్పులున్నవారు పద్మాసనం ప్రాక్టీస్ చేయరాదు .

వజ్రాసనం : 

* మొదట కాళ్ళు చాచి కూర్చోవాలి. వీపు నిటారుగా ఉంచాలి. 

*కుడి కాలుని మోకాలు వద్ద వంచి పాదాన్ని కుడి పిరుదు కిందకు

చేర్చాలి.

* అలాగే ఎడమ కాలుని మడిచి పాదాన్ని ఎడమ పిరుదు కిందకు

చేర్చాలి .

* రెండు చేతులతో కాళ్ళ ముడుకులు పట్టుకుని నడుము వంగకుండా నిటారుగా వుండాలి.

* కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకుంటూ శ్వాసను సాధ్యమైనంతవరకు బంధించి నిదానంగా వదలాలి .

ఉపయోగాలు : ఈ ఆసనం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. తొడలు , కాలి పిక్కల కండరాలు ధృడంగా తయారవుతాయి.

హెచ్చరిక : ఫైల్స్ తో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయరాదు .

అర్థ పవన ముక్తాసనం

* వెల్లకిలా పడుకోవాలి. గాలి లోపలికి పీల్చాలి.     

* ఎడమ కాలిని మోకాలి వద్ద మడవాలి.     

* రెండు చేతులతో మోకాలిని పొత్తి కడుపు మీదికి తేవాలి, కుడి కాలిని చాపే ఉంచాలి.

* ఊపిరి బిగపట్టి తల ఎత్తి ముక్కుతో మోకాలిని తాకాలి.

* శ్వాస విడుస్తూ ఎడమ కాలిని తిరిగి నిలువుగా చాపాలి.

* ఇప్పుడూ శ్వాస పీలుస్తూ కుదికాలిని కూడా పైన చెప్పిన విధంగా చేయాలి.

ఉపయోగాలు : కాలేయం, క్లోమం పని తీరును మెరుగుపరుస్తుంది . కడుపులోని గ్యాస్ తీసివేస్తుంది . దీని వల్ల గ్యాస్ ట్రబుల్ ఉండదు. కడుపు భాగంలో పేరుకునే కొవ్వు పరిమాణం తగ్గుతుంది. పోస్ట్ మెనోపాజ్ స్టేజ్ లోని మహిళలకు ఇది చాలా ఉపయోగకరం . కడుపు భాగంలోనే కాక, తొడలు మోకాళ్ళ కండరాలు బలోపేతమవుతాయి .

హెచ్చరిక : మోకాళ్ళ నొప్పులు, కడుపులో అల్సర్లు వున్నవారు ఇది చేయరాదు.

పవన ముక్తాసనం

* వెల్లకిలా పడుకోవాలి గాలి లోపలికి పీల్చాలి.                           

* రెండు కాళ్ళను ఎత్తి మోకాలి వద్ద మడవాలి .

* రెండు చేతులతో మోకాళ్ళను పొట్టి కడుపు మీదకు తేవాలి

* ఊపిరి బిగపట్టి, తలను ఎత్తి, ముక్కుతో మోకాళ్ళను తాకాలి.

* శ్వాస విడుస్తూ తిరిగి కాళ్ళను చాపుతూ మామూలు స్థితికి రావాలి.

ఉపయోగాలు : కడుపులోని గ్యాస్ తీసివేస్తుంది. ఉదార కండరాల పని తీరు మెరుగవుతుంది. ఛాతీ భాగం, భుజాలు, చేతుల నొప్పులు పోగొడుతుంది. కడుపు భాగంలో పేరుకునే కొవ్వు పరిమాణం తగ్గుతుంది. పోస్ట్ మెనోపాజ్ స్టేజి లోని మహిళలకు ఇది చాలా ఉపయోగం. కడుపు భాగంలోనే కాక, తొడలు, మోకాళ్ళ కండరాలు బలోపేతమవుతాయి .

హెచ్చరిక : మోకాళ్ళ నొప్పులు, కడుపులో అల్సర్లు వున్నవారు ఇది చేయరాదు .