వర్షాకాలంలో స్టైల్ గా కనిపించాలంటే.. లాంగ్ స్కర్ట్ లను ఇలా ధరించండి..!

వర్షాకాలం అనుభూతి చెందడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ బయటకు వెళితే వర్షం, బురద చాలా ఇబ్బంది పెడతాయి.  వర్షంలో బయటకు వెళ్లినప్పుడు ఎక్కువ పాడయ్యేది జుట్టు,  తర్వాత దుస్తులు.   వర్షాకాలంలో  స్టైలిష్‌గా కనిపించాలని చాలామంది అనుకుంటారు. కానీ వర్షాకాలంలో స్టైలిష్ గా కనిపిస్తూ.. వర్షంలో తడిశాక  త్వరగా ఆరిపోతూ,  తేమ నుండి రక్షణ కల్పించే దుస్తులు అయితే అమ్మాయిలకు చాలా ఇష్టంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అమ్మాయిలేమో సినిమాల్లో హీరోయిన్లలాగా లాంగ్ స్కర్ట్ లు వేసుకోవాలని అనుకుంటారు.  సరిగ్గా వర్షాకాలంలో స్టైలిష్ గా కనిపిస్తూ,  వర్షంలో తడిచినా తొందరగా ఆరిపోతూ,  తేమ నుండి రక్షణ కల్పించేవిగా ఉండేవి లాంగ్ స్కర్ట్ లు.. ఈ లాంగ్ స్కర్ట్ లను వర్షాకాలంలో స్టైలిష్ గా కనిపించేలా ఎలా ధరించాలో తెలుసుకుంటే..

లాంగ్ స్కర్ట్స్ ఇలా..

పొడవాటి స్కర్టులలో  లెక్కలేనన్ని ఛాయిస్ లు ఉంటాయి. మాక్సీ స్కర్ట్ పొడవుగా , సౌకర్యవంతంగా ఉంటుంది, ఇది క్యాజువల్ వేర్‌కు బాగుంటుంది.

ఏ-లైన్ స్కర్టులు పైభాగంలో బిగుతుగా, కిందిభాగంలో వెడల్పుగా ఉంటాయి. ప్లీటెడ్ స్కర్ట్‌కు అందమైన మడతలు ఉండి, స్టైలిష్‌గా కనిపిస్తుంది. వదులుగా ఉండే ఈ స్కర్ట్ తేలికపాటి ఫ్యాబ్రిక్‌తో తయారు చేయబడి, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

మెర్మైడ్ స్కర్టులు కింద బిగుతుగా, పైన శరీరానికి అతుక్కుని ఉంటాయి. ర్యాప్ స్కర్టులు చుట్టూ చుట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంటాయి.ఇక డెనిమ్ స్కర్టులు నేటి కాలపు ఫ్యాషన్ కు చాలామంచి ఎంపిక.

తేలికగా, తొందరగా ఆరిపోయేలా?

వర్షంలో వేసుకోవడానికి పొడవాటి స్కర్ట్‌ను ఎంచుకునేటప్పుడు, దాని ఫ్యాబ్రిక్‌ను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రేయాన్, విస్కోస్, క్రేప్ లేదా పాలిస్టర్ కాంబినేషన్ వంటి తేలికపాటి వస్త్రాలు త్వరగా ఆరిపోతాయి , ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటాయి.

 
బరువైన కాటన్, డెనిమ్ లేదా మందపాటి బట్టలు నీటిని పీల్చుకుని ఎక్కువసేపు తడిగా ఉండి, అసౌకర్యాన్ని పెంచుతాయి. అందువల్ల, తేలికైన , త్వరగా ఆరిపోయే స్కర్టులను ఎంచుకోవాలి.

రంగులు, ప్రింట్లు..

పొడవాటి స్కర్టులలో పూల ప్రింట్లు, ఆకుల డిజైన్లు, చిన్న ప్రింట్లు , లైట్ ఎత్నిక్ ప్యాటర్న్‌లు చాలా అందంగా కనిపిస్తాయి. ఆకుపచ్చ, పసుపు, గులాబీ, స్కైబ్లూ, లావెండర్ , తెలుపు వంటి రంగులు వర్షా కాలానికి బాగా సరిపోతాయి.

 ముదురు నీలం, నలుపు లేదా లేత గోధుమ రంగును కూడా ఎంచుకోవచ్చు. అయితే, ఒకే రంగు స్కర్టులను వివిధ రకాల టాప్‌లతో కొత్త స్టైల్స్‌లో ధరించవచ్చు.

ప్రింటెడ్,  సాదా స్కర్టులు.. ఎలా స్టైల్ చేయాలి?

ప్రింటెడ్ స్కర్ట్‌తో ప్లెయిన్ టాప్ లేదా సాలిడ్ కలర్ స్కర్ట్‌తో ప్రింటెడ్ షర్ట్ లేదా కుర్తీని ధరించవచ్చు. పొడవాటి స్కర్ట్, ఫిట్టెడ్ టీ-షర్ట్, కాటన్ షర్ట్ లేదా సింపుల్ టాప్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఫ్లాట్ శాండల్స్, చిన్న చెవిపోగులు, సన్నని గొలుసు , లైట్ మేకప్‌తో చాలా బాగా కనిపిస్తారు.

వర్షాకాలంలో పొడవాటి స్కర్టులు ధరిస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వర్షాకాలంలో మరీ వెడల్పుగా ఉండే లేదా నేలను తాకే స్కర్టులు ధరించడం మానుకోవాలి. తడి స్కర్టును ఎక్కువసేపు ధరించకూడదు, ఎందుకంటే దీనివల్ల చర్మం దురద, దద్దుర్లు , ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగవచ్చు.

ఇంటికి వెళ్లిన తర్వాత, తడి బట్టలను వెంటనే మార్చుకోవాలి.స్కర్టును పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే మళ్లీ ధరించాలి. సరైన ఫ్యాబ్రిక్ , సౌకర్యవంతమైన ఫిట్‌తో, వర్షాకాలంలో పొడవాటి స్కర్టులు  స్టైలిష్ గా , సౌకర్యవంతమైన ఫ్యాషన్ వేర్ లో భాగంగా చాలా అందంగా కనిపించేలా చేస్తాయి.

 

                                *రూపశ్రీ.