అందంగా ఉంటేనే గుర్తిస్తారా!

అందంగా ఉంటేనే గుర్తిస్తారా!

 

పురుషాధిక్య సమాజం, మహిళా సాధికారత... లాంటి మాటలు పెద్దవే కావచ్చు. ఫెమినిజం అనేది ఓ పట్టాన కొరుకుడపడకపోవచ్చు. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. సమాజం ఆ సంస్కారాన్ని మరచినప్పుడు ఎవరో ఒకరికి ఒళ్లు మండి గొంతెత్తి తీరుతారు. అలాంటి ఓ సంఘటనే ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల దైనిక్‌ భాస్కర్‌ అనే హిందీ పత్రికకు చెందిన భాస్కర్‌.కాం ఒక నివేదికను తయారుచేసింది. పది చూడదగ్గ ప్రదేశాలు, పది తినదగ్గ వంటలు... అని జాబితాలు రూపొందించినట్లు ‘అందమైన పదిమంది మహిళా IAS, IPS  అధికారులు’ అంటూ ఓ జాబితాను తయారుచేసి వదిలింది.

 

ఈ జాబితాలో కేరళకు చెందిన మెరిన్‌ జోసెఫ్‌ ఒకరు. కేరళ ఐపీఎస్‌ క్యాడర్‌కు చెందిన మెరిన్‌... అత్యంత చిన్న వయసులో ఆ హోదాను దక్కించుకున్న వ్యక్తిగా, ప్రతిభావంతురాలైనా అధికారిణిగా ఈపాటికే వార్తల్లో నిలిచారు. కానీ ఆమెను తరచూ తన ప్రతిభతో కాకుండా అందంతో గుర్తించడం మెరిన్‌కు మొదటినుంచీ బాధగా ఉండేది. ‘ఇలాంటి అందమైన అధికారి ఎదుట ఎవరైనా లొంగిపోతారు’ తరహా వ్యాఖ్యలు ఆమెను ఇబ్బంది పెట్టేవి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ‘అందమైన అధికారుల’ పేరుతో ఒక జాబితాను విడుదల చేసేసరికి మెరిన్‌ కోపం కట్టలు తెంచుకుంది. పోలీసు, రక్షణ శాఖలో ఉండే అధికారులు సాధారణంగా వివాదాలకు అతీతంగా ఉంటారు. కానీ మెరిన్‌ భాస్కర్‌.కాం వంటి జాబితాలకు ఒక ముగింపు పలకాలని అనుకున్నారు. తన ఫేస్‌బుక్‌ ద్వారా గతవారం ఆ వార్త మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.

 

మన దేశంలోని పత్రికలు, ముఖ్యంగా ప్రాంతీయ పత్రికల వైఖరి ఎంత దారుణంగా ఉందో ఈ వార్తను చూస్తే తెలిసిపోతుందన్నారు మెరిన్‌. మహిళల ప్రతిభను, భౌతికమైన అందం స్థాయికి ఈ వార్త దిగజార్చిందన్నారు. కష్టతరమైన పరిస్థితుల మధ్య బాధ్యతలను నిర్వహిస్తూ, నానారకాల రాజకీయాలను ఎదుర్కొంటున్న సదరు ఆఫీసర్లను..... గుడ్లప్పగించుకుని చూసేలా మార్చేశారన్నారు. తెలివితోనూ, స్వయంకృషితోనూ పైకెదిగిన తమలాంటి వారికి నిజంగా ఇదొక అవమానమంటూ ఉతికిపారేశారు. చివరగా... అందమైన మగ IAS, IPS అధికారులు అంటూ ఏనాడన్నా మనం ఓ జాబితాను చూశామా? అంటూ జవాబు లేని ప్రశ్న వేశారు.


మెరిన్‌ సమాధానం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ సంచలనం. మీడియాకు ఒక చెంపపెట్టు. ఎందుకంటే మన ప్రకటనల దగ్గర్నుంచీ పెళ్లి చూపుల దాకా.... ‘ఆడవాళ్లకి ప్రతిభ ఉంటే సరిపోదు, అందం కూడా ఉండాల్సిందే’ అన్న మాటల తాకిడి ఎక్కువవుతోంది. ఆఖరికి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారిని కూడా అల్లరి మూకలు వదలడం లేదు. మొన్నటికి మొన్న అసోం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ‘అంగూర్‌లతా దేకా’ గురించి ఇలాంటి మాటలు చాలానే వినిపించాయి. మన తెలుగుజాతి ముద్దుబిడ్డ రామ్‌గోపాల్‌ వర్మ సైతం అంగూర్‌లత గురించి తనదైన శైలిలో నానా రాతలూ రాశారు. ఇలాంటి ఆలోచనా ధోరణని ఎంత త్వరగా అడ్డుకుంటే అంత మంచిది. అందం అనేది కేవలం బాహ్యపరమైనదే అనీ, పైపై మెరుగులకు మించిన విలువలు ఈ జీవితంలో చాలా ఉంటాయనీ... ఇప్పటి యువత తెల్సుకోవాల్సిన అవసరం ఉంది.

- నిర్జర.