కాళ్లు లేకపోతేనేం- కలలున్నాయిగా!
posted on May 31, 2016
కాళ్లు లేకపోతేనేం- కలలున్నాయిగా!
జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితీ కలిసిరాకపోతే తెగ బెంగపడిపోతాం. ఇక ఏదన్నా వైకల్యం ఉందా ఇక చెప్పనే అక్కర్లేదు. అలాంటి పుట్టినప్పటి నుంచి కాళ్లూ, చేతులూ లేని మనిషి ఓ గొప్ప చిత్రకారిణిగా రూపొందడం ఎంత ప్రేరణని ఇస్తుందో కదా! అలాంటి ప్రేరణని అందించే కథే అను జైన్‌ది.
ఖరగ్‌పూర్‌కి చెందిన అను జైన్‌ని పుట్టుక నుంచే దురదృష్టం వెన్నాడింది. ఆమెకు మోకాళ్ల నుంచి కాళ్లు లేవు. మోచేతుల నుంచి చేతులూ లేవు. అయినా ఉన్న అవయవాలతోనే తన రోజువారీ పనులను చకచకా చేసేసుకునేది అను. దానికి తోడు అనుకి కావల్సినంత స్థైర్యాన్ని అందించే కుటుంబం ఎలాగూ ఉండేది. అందుకని అను ఏ రోజూ తను బలహీనురాలని అనుకోలేదు. తన జీవితంలో ఏదో లోటు ఉందని అంగీకరించలేదు. ఒక రోజు అను వాళ్లమ్మ అనుకి పెయింట్లూ, బష్షులూ అందించింది. ఇక అంతే! మిగతావారితో కలిసి జీవితంలో దూసుకుపోయేందుకు ఆమెకో మార్గం కనిపించింది. అనుకి గులాబీలు అంటే చాలా ఇష్టం. అలా మొట్టమొదటి మంచిమంచి రంగురంగుల గులాబీలు గీయడం మొదలుపెట్టింది.
రోజులు గడిచేకొద్దీ అను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నంతా తనదైన శైలిలో కాన్వాసు మీద చిత్రించడం మొదలుపెట్టింది. అలాగని ఆమెవి ఏదో సాదాసీతా చిత్రాల్లాగా కనిపించవు. ఆధునిక కళాఖండాలకు ఏమాత్రం తీసిపోనట్లుగా ఆమె చిత్రాలు ఉంటాయి. ఎందకంటే అను ఏదో కాలక్షేపం కోసం గీసిన చిత్రాలు కావవి. తనలోని చిత్రకళను మెరుగుపర్చుకునేందుకు ఆమె చండీఘడ్‌లోని ప్రాచీన కళా కేంద్రం నుంచి ఏడేళ్లుగా చిత్రకళలో మెలకువలు నేర్చుకుంటున్నారు కూడా. కేవలం చిత్రకళే కాదు... ఖరగ్‌పూర్‌లో తనలాంటివారి అవసరాలకు అనుగుణమైన పాఠశాల లేకపోయినప్పటికీ, తండ్రి సాయంతో, కంప్యూటర్ తోడుగా హైస్కూలు స్థాయి విద్యను కూడా నేర్చుకుంది.
అనుకి ఇప్పుడు 32 ఏళ్ల వయసు. తన వయసువారికి ఉండే అచ్చటా ముచ్చటా అనుకి లేకపోలేదు. కానీ ఆమె జీవితం హాయిగా, తృప్తిగా సాగిపోతోంది. తండ్రి రిటైరైన తరువాత ఇప్పుడా కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. బెంగళూరులోనూ అను ప్రభకేం లోటురాలేదు. ఈ మధ్యే అక్కడి భారతీయ విద్యాభవన్‌లో తన చిత్రకళను ప్రదర్శించారు అను. పెన్సిల్ దగ్గర్నుంచీ వాటర్ కలర్స్ దాకా... గ్లాస్ మొదల్కొని ఫ్యాబ్రిక్ దాకా ఏ మాధ్యమంలో అయినా, ఏ పరికరం మీద అయినా అను కళాఖండాన్ని తీర్చిదిద్దేస్తుంది. అను తన ఇంటి చుట్టూ ఉన్న పిల్లలందరినీ చేరదీసి చిత్రకళలో మెలకువలు కూడా నేర్పేస్తోంది.
కేవలం చిత్రకళే కాదు! ఫొటోలు, సంగీతం, కవిత్వం... చెప్పుకుంటూ పోతే అనుకి చాలా రంగాల్లో ప్రవేశం ఉంది. అను పియానోని అద్భుతంగా వాయిస్తుంది. టెర్రకోటాతో బొమ్మలు చేస్తుంది. తీరిక సమయాలలో పిల్లలతో ఆడుతుంది. మనసు బాగున్నప్పుడో, బాగోలేనప్పుడో గొంతు సవరించుకుని పాడుతుంది. ఇంతకీ అను తనకంటూ గుర్తింపుని సాధించడానికి కారణం ఏంటి? అన్న ప్రశ్నలోనే జవాబు ఉంది. తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చాటుకోవడం కోసమే ఇదంతా సాధించగలిగానని అంటోంది అను. పైగా తన సాధనలో ఏమంత కష్టం తోచలేదని చెప్పుకొస్తోంది. మనం ఏ పనిలో అయితే సంతోషాన్ని పొందుతామో, ఆ పని చివరికి ఒక అందమైన ఫలితాన్ని ఇస్తుందంటోంది అను. ఇంక అంతకు మించి చెప్పేదేముంది.
- నిర్జర.