కీళ్ళ నొప్పుల్లో రకాలు - చికిత్స
posted on May 18, 2011
కీళ్ళ నొప్పుల్లో రకాలు - చికిత్స
అరవై ఏళ్లొచ్చినా అడుగులు తడబడేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడేమో 40 ఏళ్లకే కొందరు మోకాళ్లకో బెల్టు వేసుకుని నడిచే పరిస్థితి వచ్చేసింది. ఏమిటీ కారణం అంటే రకరకాల కీళ్ల వ్యాధుల జాబితా ఒకటి మన ముందు వచ్చి వాలిపోతుంది. కీళ్ల వ్యాధులు (ఆర్థరైటిస్) రెండు వందల రకాలు అంటే మనకు ఆశ్చర్యం వేయవచ్చు. కానీ, అది నిజం. వీటిలో పసి పిల్లల్లో వచ్చే వాటిని జెఆర్ ఆర్థరైటిస్ అంటారు. మిగతా సమస్యలను ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. ఇవి వయసుతో నిమిత్తం లేకుండా వస్తాయి. పెద్దవాళ్లలో వచ్చే కీళ్ల వ్యాధుల్లో ఆస్టియో ఆర్థరైటిస్, ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ రెండు భాగాలుగా విభజిస్తారు.
ఆస్టియో ఆర్థరైటిస్:
ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య శరీరంలోని ఏ కీళ్లలోనైనా రావచ్చు. మోకాళ్ల నొప్పులు వాటిలో ఒకరకం మాత్రమే. కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి( కార్టిలేజ్) అరగడం వల్ల వచ్చే సమస్య ఇది. వయసు పైబడటంతో పాటు విపరీత శ్రమ, స్థూలకాయంతో పాటు ప్రమాదాల కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు. వాస్తవానికి కార్టిలేజ్ ఉత్పత్తి చేసే ప్రక్రియ ఎముకల్లో నిరంతరం సాగుతూనే ఉంటుంది.
అయితే వయసు పైబడే కొద్దీ ఈ ఉత్పత్తి తగ్గిపోయి అరుగుదల ఎక్కువవుతుంది. అందుకే వృద్ధులే ఈ సమస్యకు ఎక్కువగా గురవుతూ ఉంటారు.
ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్: ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి నిరోధక శక్తిలో ఏర్పడే లోపాలే (ఇమ్యూన్ ఇంబాలెన్స్) ఇందుకు కారణం. సాధారణంగా కాలి బొటన వేళ్లల్లో మొదలయ్యే ఈ వ్యాధి కాళ్లూ చేతుల అన్ని వేళ్లకూ పాకుతుంది. భరించలేని నొప్పితో పాటు ఒక్కోసారి పూర్తిగా కదల్లేని స్థితి కూడా ఏర్పడవచ్చు. అల్లోపతి వైద్య విధానంలో పెయిన్ కిల్లర్లు, డిసీజ్ మోడి ఫయింగ్ డ్రగ్స్, స్టీరాయిడ్స్, బయలాజిక్ థెరపీల ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేస్తారు.
రుమాటిక్ ఫీవర్
చిన్న పిల్లల్లో కొందరికి ఈ సమస్య వస్తుంది. దీనికి స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా కారణం. నొప్పి ఒక కీలునుంచి మరో కీలుకు అలా మారుతూ ఉంటుంది. సకాలంలో చికిత్సలు అందకపోతే వ్యాధి ముదిరి చివరికి గుండె కవాటాలు దెబ్బ తినే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే వ్యాధి సోకగానే వైద్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం. సమస్య తీవ్రమైనదే అయినా మూడు వారాలకు ఒకసారి చొప్పున పెన్సిలిన్ ఇవ్వడం ద్వారా అల్లోపతి వైద్యులు ఈ వ్యాధిని నయం చేస్తారు.
చికిత్స:
ఆయుర్వేదంలో ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యకు ఆయుర్వేదం కొన్ని గృహ చికిత్సలు, కొన్ని వైద్య చికిత్సలూ చెబుతుంది. ఆ శాస్త్రం చెప్పే గృహ చికి త్సల ప్రకారం:
- వెల్లుల్లి ముద్దను రెండు చెంచాల పరిమాణంలో తీసుకుని నువ్వుల నూనెతో కలిపి రోజుకు రెండు సార్లు వేడినీళ్లతో తీసుకోవాలి.
- అరకప్పు శొంఠి కషాయానికి, రెండు చెంచాల ఆముదం కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
అరచెంచా శొంఠి, ఒక చెంచా నువ్వులు, అరచెంచా బెల్లం ఈ మూడింటినీ ముద్దగా నూరి రోజూ రెండు పూటలా తీసుకోవాలి.
- వీటిలో ఏదో ఒకటి చేస్తూ మహా నారాయణ తైలాన్ని కీళ్ల మీద పైపూతగా రాస్తే ఉపశమనం లభిస్తుంది.
హోమియోలో... ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యకు హోమియో నిపుణుల సూచన ప్రకారం: బ్రయోనియా-6, లేదా రస్టాక్స్-6 మందులను సూచిస్తారు. రెండు రోజులకు ఒకసారి చొప్పున చాలా కాలమే వాడాలి. మోకాళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉన్న వారు హైమోసాక్ ద్రవాన్ని ఉదయం 20 చుక్కలు, రాత్రి 20 చుక్కల చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి. కీ ళ్ల నొప్పులతో పాటు మధుమేహం ఉన్నవారికి ఏదో ఒకటిగా ల్యాక్టిక్ యాసిడ్-30, యురేనియం నైట్-30 మందులు బాగా పనిచేస్తాయి. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు మెర్క్‌సాల్-6, రస్టాక్స్-6 మందుల్లో ఏవో ఒకటి తీసుకోవచ్చు. వీటిని రోజుకు మూడు సార్ల చొప్పున రెండు రోజులకు ఒకసారి తీసుకోవచ్చు.
వ్యాయామాలు: కీళ్ల నొప్పులకు మందులతో పాటు వ్యాయామాలు కూడా తప్పనిసరి. అయితే కాళ్ల మీద ఎక్కువ భారం పడని వ్యాయామాలు మరింత శ్రేయస్కరం. వాటిలో సైకిల్ తొక్కడం, ఈత ఉత్తమం. లేదా నేల మీద వెల్లకిలా పడుకుని రెండు కాళ్లూ పైకి ఎత్తి ఒకదాని తరువాత ఒకటిగా రెండు కాళ్లనూ సైకిల్ తొక్కినట్లు గుండ్రంగా తిప్పడం ఎంతో మేలు.