గర్భధారణ సమయంలో మహిళలు ఉసిరికాయ రసం తాగవచ్చా

గర్బినీ మహిళలు ఉసిరికాయ రసం తాగవచ్చా!


గర్భధారణ సమయం మహిళల జీవితంలో చాలా సున్నితమైన దశ. ఈ సమయంలో తీసుకునే ఆహారం, పానీయం గర్బవతులకే కాకుండా  కడుపులో పెరిగే బిడ్డల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చలికాలం గడుస్తోంది. ఈ చలికాలంలో విరివిగా దొరికే ఉసిరికాయలు గొప్ప రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఉసిరికాయలు తిన్నా, దాని జ్యూస్ తాగినా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే గర్బవతులు ఉసిరికాయ రసాన్ని రోజూ తీసుకోవచ్చా? ఇది వారి ఆరోగ్యానికి మంచిదేనా అనే విషయం తెలుసుకుంటే..

గర్భవతులు ఉసిరికాయ రసాన్నితీసుకోవచ్చు. దీనివల్ల గర్భవతులలో ఎదురయ్యే కడుపులో వికారం, వాంతులు వంటి సమస్యలు  అదుపులో ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఉసిరికాయలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఉసిరికాయ రసాన్ని ప్రతిరోజూ తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలే పొందవచ్చు. అయితే తాజా  ఉసిరి రసం దొరకకపోతే మార్కెట్లో దొరికే ఉసిరికాయ రసాన్ని కూడా వాడచ్చు. కానీ ఈ రసాలు ప్రభుత్వ అమోదం, ఫుడ్ కమీషన్ వారి ఆమోదం పొందినవి అయి ఉండాలి. ప్యాకేజింగ్, నిల్వ కూడా పక్కాగా ఉండాలి.

ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే మరొక ప్రయోజనం..

NCBI పరిశోధన ప్రకారం, ఉసిరిని తీసుకోవడం ద్వారా అనేక రకాల వాస్కులర్ డిజార్డర్‌లను నివారించవచ్చు. ఉసిరిలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంతో పాటు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది HDL కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది మరియు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

ఉసిరికాయను ఎలా తీసుకోవాలి?

 గర్భవతులు ఉసిరిని తీసుకోవాలని అనుకుంటే వాటిని తాజాగా,  పచ్చిగా తినడం మేలు. నవంబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్యలలో ఉసిరికాయ తినడం మంచిది. మురబ్బా, జామ్, ఊరగాయ, బర్ఫీ ,  పొడితో పాటు, సంవత్సరం పొడవునా లభించే ఉసిరి నుండి రసం కూడా తయారు చేస్తారు.  వీటిని పరిమిత పరిమాణంలో కూడా తీసుకోవచ్చు.  ఎందుకంటే ప్యాక్ చేసిన ఆహారం తాజా ఆహారం కంటే తక్కువ పోషకాహారాన్ని కలిగి ఉంటుంది.

ఇంట్లోనే ఉసిరికాయ జ్యూస్..

ఉసిరికాయ జ్యూస్ తాగాలని  ఉంటే ఇంట్లోనే తయారుచేసుకుని ఫ్రెష్ గా తాగితే బాగుంటుంది. ప్యాక్ చేయబడిన జ్యూస్‌లలో సాధారణంగా ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు ఉంటాయి.

ప్యాక్ చేసిన ఉసిరి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..


కొనుగోలు చేయడానికి ముందు జ్యూస్ ప్యాకెట్ సీలు చేయబడిందో లేదో తనిఖీ చేయాలి.   దాని గడువు తేదీని కూడా చెక్ చేసుకోవాలి.  గర్భధారణ సమయంలో మధుమేహం అటాక్ అయినట్టయితే తప్పనిసరిగా వైద్యుల సలహాతోనే దీన్ని వాడాలి.  జ్యూస్ తాగే ముందు అందులో కొంచెం నీరు కలపాలి. ఎందుకంటే ఉసిరికాయ జ్యూస్ ఎక్కువ ఆమ్లగుణం కలిగి ఉంటుంది. దీన్ని అలాగే తాగితే గొంతులో చికాకు, అసౌకర్యం కలుగుతుంది. అదే నీళ్లలలో కలుపుకుంటే ఆమ్లగుణం సర్దుకుంటుంది.

 (నోట్: ఇది ఆహారనిపుణలు, వైద్యులు  పలు సందర్బాలలో చెప్పిన విషయాల ఆధారంగా ఇచ్చిన సమాచారం.  గర్భవతులు తమ ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహా మేరకే ఆహారం, మందులు తీసుకోవాల్సి ఉంటుంది.)

                                                *నిశ్శబ్ద.