మహిళలూ ఇది సబబేనా?

మహిళలూ ఇది సబబేనా?

సాధారణంగా ఆడపిల్లల జీవితంలో ఓ దశ దాటిన తరువాత  ఎంతో నెమ్మదితనం చోటుచేసుకుంటుంది. రజస్వల కావడం అనే విషయం జరరగానే ప్రతి ఆడపిల్లా ఇంటి వాళ్లతో నెమ్మదిగా ఉండు అనే మాటలను తప్పనిసరిగా ఫేస్ చేస్తుంది. అయితే వాళ్లు మంచికే చెబుతారు. కానీ ఇప్పటికాలం మహిళల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నెలసరి. నెలసరి సరిగా రాకపోవడం అనే సమస్య మహిళల జనాభాలో సగానికి పైగా ఎదుర్కొంటోంది. సమస్య రాగానే డాక్టర్ల కన్సల్టేషన్ లు వారు చెప్పే మందులు ఇదే 90శాతం మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ ఇలా మందులూ మాకులూ వాడటానికి అలవాటుపడిపోవడమే కానీ అసలు సమస్య ఏంటి ఎందుకిలా అవుతోంది నేను చేస్తున్న పొరపాటు ఏంటి వంటి ప్రశ్నలు ఎప్పుడైనా వేసుకున్నారా?? 

 మీరే గనుక ఎందుకిలా అనే ప్రశ్నలు వేసుకుంటే మీరు చేస్తున్న పొరపాట్ల మీద  మీకే ఓ ఖచ్చితమైన అవగాహన వస్తుంది. ఇంతకూ ఆ ప్రశ్నల వైపు వెళ్లడం ఎలాగో తెలుసా?? 

ఇదిగో ఇలా…

ఇలా చేస్తున్నారా?? 

చాలా మందిలో అమ్మాయి అంటే ఇదిగో ఇలా ఉండాలి అని ఒక ఫిక్సషన్ ఉంది. సన్నగా, నాజూగ్గా ఉండాలి. చాలా తక్కువగా తినాలి. ఎంత సుకుమారంగా కనిపిస్తే అమ్మయిలు అంత బాగుంటారు అనే ఫీల్ ఉంటుంది. ఫలితంగా అమ్మాయిలలో సహజంగానే పోషకార లోపం, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. కొందరు అలా ఉంటే మరికొందరు దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అంటే ప్రాణం పెట్టేస్తారు. కేవలం రుచి మీద ఇష్టం పెట్టుకుని ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాటిని బాగా తినేసేవాళ్ళు విపరీతంగా లావు పెరిగిపోవడం జరుగుతుంది.

ఇక్కడ వచ్చే చిక్కు ఏమిటంటే… అతిగా తినడం, అసలు తినకపోవడం రెండూ హార్మోన్ల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల మహిళల్లో నెలసరిలో అసమతుల్యత చోటు చేసుకుంటుంది. కాబట్టి ఆహారం అనారోగ్యానికి కారణం అవ్వకుండా చూసుకోవాలి. ఏమి తింటున్నాం?? అనే ప్రశ్నను సంధించుకోవాలి.

ఒక్కోసారి ఒక్కోలా… ఎందుకూ??

ఆడపిల్లలు రజస్వల అవ్వగానే అటు ఇటు తిరగొద్దు అనడంతో శారీరక వ్యాయామం అనేది తగ్గుతోంది. దానికి తగ్గట్టు చదువు గోలలో పడి ర్యాంకుల వేటలో మునిగిపోయి సరిగా తినీ తినక శారీరకంగా బలహీనంగా ఉండేవాళ్ళు కొందరు అయితే ఒత్తిడి వల్ల అతిగా తిని చిన్న వయసులోనే ఊబకాయం సమస్యను తెచ్చిపెట్టుకునేవాళ్ళు కొందరు. ఏ చదువుల దశ మొత్తం ఇలా సాగితే ఆ తరువాత ఉద్యోగాల టార్గెట్స్ లో తినడానికి సమయం ఉండక కొందరు బలహీనులు అయితే రెడి టూ ఈట్ ఫుడ్స్, ఆన్లైన్ ఆర్డర్స్, పిజ్జాలు ఇలాంటివి తిని అనారోగ్యానికి గురయ్యే వాళ్ళు కొందరు. దీని తరువాత మళ్ళీ పెళ్లి అయితే మరొక అదనపు బాధ్యత. మల్టి టాస్కింగ్ పెరిగి తీరిక దొరకని జీవితం అయిపోతుంది. మీకోసం మీరు ఏమి చేస్తున్నారు?? ఎలా ఉంటున్నారు అనేది చాలా ముఖ్యం. కాబట్టి నాకోసం నేను ఏమి చేసాను ఈరోజు అని ప్రతిరోజూ ప్రశ్నించుకోవాలి. 

ముప్పేట దాడి… అంతా ఒత్తిడి!!

సమస్యలు ఒకటికి మించి ఎక్కువగా ఉంటే… ఆహారం, ఉద్యోగం, ఇంటి బాధ్యతలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని కలిపి మహిళలకు ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత కలుగుతుందనేది అందరికీ తెలిసిందే… అందుకే ఒత్తిడి భూతం దరిచేరక ముందే దానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించాలి. 

ఎలాంటి సమస్య అయినా మహిళల్లో నెలమీదకే టర్న్ అవుతుంది. నెలసరి సరిగా రాకపోవడం, అతిగా రతుస్రావం అవడం, పిసిఓయస్, థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలు చుట్టూ ముడతాయి. ఈ సమస్యలు మహిళలను పూర్తిగా ఇబ్బంది పెట్టకముందే డాక్టర్లను కలవాలి. చాలామంది సమస్య పెద్దది అయితే తప్ప డాక్టర్లను కలవరు. అందుకే సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవాలి. ప్రశ్నించుకుంటే… సమాధానం వైపు ప్రయాణం మొదలవుతుంది…

                                       ◆నిశ్శబ్ద.