ఆడపిల్లకు శాపం బాల్యవివాహాల ప్రపంచం!
posted on Dec 9, 2022
ఆడపిల్లకు శాపం బాల్యవివాహాల ప్రపంచం!
పెళ్లి అనేది చాలా ముఖ్యమైన సంఘటన. చక్కని చదువు, నిర్ణీత వయసు, ఆరోగ్యకరమైన జీవితానికి మూలమవుతుంది. అయితే ఎంతో సంతోషమయమైన జీవితాన్ని ఇవ్వడానికి బదులుగా పెళ్లి అనేది కొందరు అమ్మాయిల పట్ల శాపంగా మారుతోంది. ఎదిగీ ఎదగని శరీరం, అవగాహన లేని వయసు, ఏదీ నిర్ణయించుకోలేని మానసిక పరిపక్వత లేకపోవడం. ఇలా చాలా కారణాలు ఆడపిల్లల జీవితాలను అయోమయంలో నెట్టేస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం బాల్య వివాహాలు. దేశం, రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందినా ఎన్నో విషయాల్లో దేశం ముందుకు వెళుతున్న, దేశంలో మహిళలు తమ భవితను గొప్పగా తీర్చిదిద్దుకుంటున్నా అదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే… నాణేనికి రెండవ వైపున ఇంకా మూఢనమ్మకాలు, జీవితాలను చిన్నాభిన్నం చేసే సాంప్రదాయాలు సాగుతున్నాయి. వాటిలో బాల్యవివాహాలు ముఖ్యమైనవి.
బాల్య వివాహాల గురించి భారతీయ చట్టం ఏమి చెబుతుంది??
బాల్య వివాహా నిరోధక చట్టం 1929లో వచ్చింది. కానీ చట్టం అమలులో లోపాలను సవరిస్తూ 2006లో మరింత పటిష్టం చేస్తూ అదనంగా రెండేళ్ల జైలు శిక్షను చేర్చింది. దీంతో బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు వధూవరుల తల్లిదండ్రులు, వివాహాం చేసిన పెద్దలు, మత పెద్దలు, బంధువులు, ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, పెళ్లికి సహకరించిన వారితో పాటు పెళ్లి జరిపించిన పంతులు, హాజరైన అందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. వీఆర్వో, అంగన్వాడీ సూపర్వైజర్, తహసీల్దార్, ఎంపీడీవో, సీడీపీవో, ఆర్డీవో, కలెక్టర్, పోలీసులు, బాల్య వివాహాల నిరోధక అధికారులుగా ఉంటారు.
అవగాహన కావాలి…
ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతోంది అంటే కొందరు అయ్యో.. అనుకుంటారు. ఈ బాల్య వివాహాన్ని ఆపాలి అనిపిస్తుంది కానీ ఎవరికి చెప్పాలి ఏంటి వంటి ప్రశ్నలతో సంతమతం అయిపోయి చివరికి ఏమి చేస్తాం. ఆ పిల్ల రాత ఇలా ఉందేమో అనుకుని తమదారిన తాము పోతారు కొందరు. అయితే బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని ఆపడానికి ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే విషయం తెలుసుకోవాలి ముందు.
ఎవరికి ఫిర్యాదు చేయాలి..?
బాల్య వివాహాలపై వీజర్వో, అంగన్వాడీ సూపర్ వైజర్, తహసీల్దార్, ఎంపీడీవో, సీడీపీవో, ఆర్డీవో, కలెక్టర్, పోలీసులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వవచ్చు. అలాగే 1098, 100 నెంబర్లకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేయవచ్చు. ఎవరైనా సరే... బాల్య వివాహాలపై సమాచారం ఇచ్చినపుడు ఈ విషయాన్ని అధికారలు గోప్యంగా ఉంచుతారు. కాబట్టి తమ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అనే భయాన్ని, ఆందోళలనను వదిలిపెట్టి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు. దీనివల్ల ఓ ఆడపిల్ల జీవితం నిలబడుతుంది.
బాల్య వివాహాలు చేస్తే జరిగేది ఇదే…
బాల్య దశలో వివాహాలు చేస్తే శారీరకంగా ఇబ్బందులు తలెత్తుతాయని స్త్రీ వైద్య నిపుణులు ఎప్పటి నుండో చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో రక్త హీనత వ్యాధి వస్తుందనీ, తద్వార వారికి పుట్టే పిల్లలకు మానసికమైన రుగ్మతలు వస్తాయని స్పష్టం చేశారు. కేవలం ఆ ఆడపిల్లకు మాత్రమే కాకుండా ఆ పిల్లకు పుట్టే బిడ్డకు కూడా లోపాలు తలెత్తే అవకాశాలు చాలా ఉంటాయి. బలహీనత, శారీరక లోపాలు, బుద్ధిమాంద్య సమస్యలు మొదలైనవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వివాహాలు అనేవి ఆడపిల్లల జీవితాలకు శాపాలు కాకూడదు అంటే బాల్య వివాహాలు జరిపించకూడదు. ఆడపిల్లకు 18 ఏళ్ళు నిండిన తరువాతే పెళ్లి చేయాలి. నిర్ణీత విద్యార్హత దిశగా ఆడపిల్లను ప్రోత్సహించాలి.
◆నిశ్శబ్ద.