ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపం ఉన్నట్టే..!
posted on Jun 20, 2024
ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపం ఉన్నట్టే..!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల పోషకాలు అవసరం. వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు తప్పనిసరిగా ఉంటాయి. భారతదేశంలో చాలామంది మహిళలు అనీమియా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అనీమియా అనేది హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండటానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. ఆడవారి శరీరంలో ఐరన్ లోపం ఉందా లేదా అనే విషయం వారికి నెలసరి సమస్యలు ఎదురైనప్పుడో లేదా జ్వరం లాంటి సమస్యలు వచ్చి రక్తపరీక్ష చేయించుకున్నప్పుడో బయటపడుతూ ఉంటుంది. అలా కాకుండా ప్రతి మహిళ తనకు ఐరన్ లోపం ఉందా లేదా తెలుసుకోవాలంటే తమ శరీరంలో కొన్ని లక్షణాలు గమనించుకోవాలి. ఐరన్ లోపం ఉంటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..
చాలామంది మహిళలు ఎప్పుడూ అలసటగా ఉందని కంప్లైంట్ చేస్తుంటారు. ఆహారం ఎంత తీసుకున్నా నీరసంగా ఉన్నట్టు, బలహీనంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. దీనికి కారణం ఐరన్ లోపించడమే. ఐరన్ లోపిస్తే శరీరంలో కణజాలాలకు, కండరాలకు ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది.
మహిళలు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి వైద్యులను కలిసినప్పుడు చాలామంది వైద్యులు చేసే మొదటి పని మహిళల కళ్లు గమనించడం. కనుగుడ్డు కింది భాగంలో కనిపించే చర్మం రంగును బట్టి మహిళలో ఐరన్ లోపాన్ని, హిమోగ్లోబిన్ శాతాన్ని అంచనా వేస్తారు. అంతేకాదు ఐరన్ లోపం ఉన్న మహిళల చర్మం పాలిపోయి, వడలిపోయినట్టు ఉంటుంది.
ఏ చిన్న పని చేసినా ఎంతో శ్రమ చేసినట్టు ఫీలయ్యే మహిళలు ఉంటారు. దీనికి కారణం ఐరన్ లోపించడమే. ఐరన్ లోపించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది. దీనివల్ల తొందరగా అలసిపతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు.
గుండె సమర్థవంతంగా పని చేయాలంటే ఆక్సిజన్ సరఫరా బాగుండాలి. కానీ ఆక్సిజన్ సరఫరా బాగుండేందుకు కావలసిన ఐరన్ లోపించినప్పుడు ఆక్సిజన్ సరఫరా మందకొడిగా సాగుతుంది. దీని కారణంగా గుండె సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది గుండె దడ, గుండె పనిచేయడంలో ఆటంకాలు, కొన్ని సార్లు రక్తాన్ని పంప్ చేయడంలో అంతరాయం ఏర్పడి గుండె పోటు వంటి సమస్యలు కూడా వస్తాయి.
మెదడు సమర్థవంతంగా పని చేయాలంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగుండాలి. కానీ మెదడుకు ఆక్సిజన్ సరఫరా లోపిస్తే అప్పుడు మెదడు నరాల మీద ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. ఐరన్ లోపించడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని సార్లు మైకం కూడా కలగవచ్చు.
ఐరన్ లోపం ఉన్న మహిళలలో గోర్లు పెళుసుగా ఉంటాయి. గోర్లు తెల్లగా కనిపించడం, సున్నితంగా ఉండటం. ఏమాత్రం తడి తగిలినా లేదా గోర్లను ఏవైనా తెరవడానికి ఉపయోగించినా గోర్లు చాలా సులభంగా విరిగిపోతుంటాయి.
చాలామంది మహిళలకు తమ జుట్టు ఎందుకు రంగు మారుతోందో, ఎందుకు పలుచగా అవుతోందో తెలియని గందరగోళంలో ఉంటారు. ఐరన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అంతేకాదు జుట్టు బాగా రాలిపోవడం, రాగి రంగులో ఉండటం, తొందరగా తెల్లబడటం కూడా జరుగుతుంది.
*రూపశ్రీ.