నెలసరి సరిగా రాకుంటే ఏం చేయాలి? వైద్యులు ఇచ్చిన సలహాలు పాటించేయండి..!

 

 


మహిళలకు నెలలో 5 నుంచి 7 రోజులు పీరియడ్స్ రావడం అనేది సహజ ప్రక్రియ. పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, వెన్నునొప్పి, కడుపులో కండరాల  తిమ్మిరి గురించి మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. దీనితో పాటు, కొన్నిసార్లు అధిక రక్తస్రావం సమస్య కూడా మహిళలను వేధిస్తూ ఉంటుంది.  మరికొన్ని రక్తస్రావం సరిగా కాకపోవడం కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇలా రక్తస్రావం అధికంగా అయినా, అసలు రక్తస్రావం సరిగా కాకపోయినా కూడా మహిళలకు సమస్యే..   ఇవన్నీ ఒక ఎత్తైతే కొన్ని సార్లు మహిళలకు పీరియడ్స్ స్కిప్ అవుతూ ఉంటాయి. నెలసరి సక్రమంగా రాదు.  ఇలాంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుండి బయట పడటానికి  వైద్యులు చెప్పిన సలహాలేంటో తెలుసుకుంటే..


పీరియడ్స్ సక్రమంగా లేకుంటే మహిళలు తమ  జీవనశైలి, తీసుకునే  ఆహారం విషయంలో  కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలి. అస్తవ్యస్తం అయిన  పీరియడ్స్‌ను క్రమబద్ధీకరించడానికి మొట్టమొదట చేయాల్సిన పని కెఫిన్‌కు దూరంగా ఉండటం. ఇందుకోసం టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.


టీ, కాఫీలు మానేయడంతో  పాటు మార్కెట్ లో లభ్యమయ్యే  ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం మానేయాలి.  మార్కెట్‌లో లభించే ప్యాక్‌డ్ ఫుడ్‌కి నిర్మొహమాటం లేకుండా నో చెప్పడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు స్నేహితులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా కూడా ప్యాక్డ్ ఫుడ్ తినాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో సున్నితంగా ప్యాక్డ్ ఫుడ్ ను దాటవేయాలి. అలాగే వంటల్లో మైదా, ఇంకా రిఫైండ్ షుగర్  అయిన పంచదార వంటివి అధికంగా వాడుతుంటే వాటిని మానేయడం మంచిది.  ఆహారంలో అధిక కారం, అధిక నూనె, అధిక పులుపు,అధిక ఉప్పు వంటివి  తగ్గించాలి. ఇవన్నీ పాటిస్తూ ఉంటే శరీరంలో హార్మోన్లు నియంత్రణలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది.

పీరియడ్స్ ఎప్పుడూ క్రమబద్ధంగా రావాలి అంటే మంచి ఆహారపు అలవాట్లు ఫాలో అవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆహారంలో తృణ ధాన్యాలు, మిల్లెట్లు భాగం చేసుకోవాలి. మిల్లెట్లు తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.  ఆహారంలో పచ్చి పండ్లు,  పచ్చి కూరగాయలను చేర్చడానికి ప్రయత్నించాలి. కూరగాయల జ్యూస్ తో  పాటు ఆహారంలో మజ్జిగను చేర్చాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. మజ్జిగలో లభించే ప్రోబయోటిక్స్ హార్మోన్ల అసమతుల్యతను తొలగిస్తాయి.  ఇవన్నీ హార్మోన్లను సకాలంలో వచ్చేలా చేస్తాయి.

                                                              *రూపశ్రీ