ఓపెన్ పోర్స్ ను లైట్ గా తీసుకుంటున్నారా.. వీటి వల్ల కలిగే నష్టాలు తెలుసా.!

ఓపెన్ పోర్స్ చర్మ సంరక్షణలో చాలా మంది వింటూ ఉంటారు. చర్మం పై  రంధ్రాలు తెరుచుకుని ఉండటాన్ని ఓపెన్ పోర్స్ అంటారు. ఇది  చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. అయితే, దీన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఏదో చిన్న సమస్యలే అని లైట్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో చర్మంపై దారుణమైన ప్రభావం పడుతుంది. ఓపెన్ పోర్స్ వల్ల కలిగే సమస్యలు, నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుంటే..

మొటిమలు , బ్లాక్‌హెడ్స్ పెరగడం..

చర్మ రంధ్రాలు పెద్దవిగా ఉన్నప్పుడు వాటిలోకి దుమ్ము, ధూళి, చెమట , బ్యాక్టీరియా సులభంగా చేరుతాయి. దీనివల్ల నూనె గ్రంథులు మూసుకుపోయి మొటిమలు, చీముతో కూడిన  మొటిమలు (అక్నే), బ్లాక్‌హెడ్స్ , వైట్‌హెడ్స్ విపరీతంగా పెరుగుతాయి.

వయసు పైబడినట్లు కనిపించడం..

 ఓపెన్ పోర్స్ ముఖాన్ని కాంతిహీనంగా మారుస్తాయి. చర్మానికి ఉండే ఎలాస్టిసిటీ తగ్గిపోయి, ముఖంపై ముడతలు , గీతలు త్వరగా వస్తాయి. దీనివల్ల చిన్న వయస్సులోనే పెద్దవారిలా కనిపించే అవకాశం ఉంది.

జిడ్డు చర్మం..

 ఓపెన్ పోర్స్ ఉన్నవారిలో సెబమ్  ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సెబమ్ అంటే చర్మంలో ఉత్పత్తి అయ్యే నూనె.. దీని వల్ల ముఖం ఎప్పుడూ జిడ్డుగా  అనిపిస్తుంది. మేకప్ వేసుకున్నా కూడా సరిగ్గా నిలవదు, రంధ్రాల మధ్యలోకి మేకప్ చేరి ముఖం చారలుగా మారుతుంది.

చర్మం మెరుపు తగ్గడం..

రంధ్రాల కారణంగా చర్మం స్మూత్ గా  ఉండకపోయేసరికి చర్మం కాంతివంతంగా కనిపించదు. దీనివల్ల ముఖం ఎల్లప్పుడూ అలసిపోయినట్లు, కాంతిలేకుండా కనిపిస్తుంది.

చర్మ ఇన్ఫెక్షన్లు..

ఓపెన్ పోర్స్ ద్వారా  బ్యాక్టీరియా చర్మం లోపలి పొరల్లోకి జొరబడి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, ఎర్రబడటం , మంటకు దారితీస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

 రోజుకు రెండుసార్లు మంచి క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సన్‌స్క్రీన్ వాడటం, ముఖానికి ఐస్ క్యూబ్స్ రాయడం,  మంచి టోనర్ ఉపయోగించడం ద్వారా ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించుకోవచ్చు.

కాబట్టి, ఓపెన్ పోర్స్ ను అస్సలు లైట్ తీసుకోకూడదు. మొదట్లోనే సరైన స్కిన్ కేర్ పాటించి చర్మాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోవాలి.

 

                            *రూపశ్రీ.