ఏం చేసినా హిమోగ్లోబిన్ పెరగట్లేదా.. అయితే ఇలా చేయాల్సిందే!
posted on Nov 9, 2023
ఏం చేసినా హిమోగ్లోబిన్ పెరగట్లేదా? అయితే ఇలా చేయాల్సిందే..
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అవసరం అవుతాయి. శరీరం మొత్తం ఆరోగ్యాన్ని నిర్దేశించగల సామర్థ్యం రక్తానికి ఉంది. శరీరంలో హిమోగ్లోబిన్ సరిపడినంత లేకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. ఈ రక్తహీనత ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువగా ఎదురవుతుంటుంది. ఐరన్ స్థాయిలు మెరుగుపరుచుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ ను భర్తీ చేసుకోవచ్చు. దీని కోసం మహిళలు తప్పక తినాల్సిన ఆహారాలేంటో తెలుసుకుంటే..
ఆహారంలో మొక్కల ఆధారిత పదార్థాలు అయిన గింజలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి పుష్కలంగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే శరీరంలో ఐరన్ బాగా లభిస్తుంది. పైపెచ్చు ఇవి శరీరంలో ఐరన్ సరఫరాను కూడా ప్రోత్సహిస్తాయి.
ఆకుకూరలు, పండ్లు, గింజలే కాకుండా ఆహారంలో లీన్ మాంసం, చికెన్, పాలు, గుడ్లు, బీన్స్, కాయధాన్యాలు, జున్ను, బచ్చలికూర, బ్రోకలీ వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిలో ఏవో కొన్ని అయినా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.
చాలామంది ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకున్నా హిమోగ్లోబిన్ పెరగడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే విటమిన్-సి పుష్కలంగా తీసుకునేవారికే ఐరన్ పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే ఐరన్ ను శరీరం ఫర్పెక్ట్ గా గ్రహించడానికి విటమిన్-సి సహాయపడుతుంది.
శరీరం ఐరన్ గ్రహించడానికి కేవలం విటమిన్-సి మాత్రమే కాదు, విటమిన్ బి12 కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆహారంలో పాలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు మొదలైనవాటిలో విటమిన్-బి12 ఉంటుంది. వీటిని తీసుకుంటే ఐరన్ ను కూడా సులువుగా పొందగలుగుతారు.
*నిశ్శబ్ద.