బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మహిళలలో ఉన్న అపోహలు.. వాస్తవాలు!

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మహిళలలో ఉన్న అపోహలు.. వాస్తవాలు!

ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల జీవితంలో అయినా గొప్ప సందర్భం ఏదైనా ఉందంటే అది వారు తల్లికావడమే. నవమాసాలు మోసి బిడ్డను కంటారనే విషయం తెలిసిందే అయినా ఆ తొమ్మిది నెలలు మహిళలు తమ జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొంటార. ఆహారం దగ్గర నుండి శరీరాకృతి వరకు ప్రతి ఒక్కటీ మారిపోతుంది. అయితే ప్రసపం తరువాత పసిపిల్లలకు తల్లిపాలే ఆహారం. సుమారు 6నెలల వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు కూడా చెబుతారు. అయితే తల్లిపాలు ఇవ్వడం గురించి చాలామంది మహిళలలో అపోహలు ఉన్నాయి. పాలు తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని,  ఎన్ని నెలల వరకు పిల్లలకు పాలు ఇవ్వాలని, తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఏమిటని ఇలా చాలా విషయాలలో  అపోహలు, వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే అందరికీ ఈ విషయంలో ఒక అవగాహన ఏర్పడుతుంది.

పాలివ్వడంలో అసౌకర్యం..

ప్రసవించిన తరువాత పిల్లలకు పాలివ్వడంలో ప్రతి తల్లీ అసౌకర్యానికి గురవుతుంది. పిల్లలు పాలు తాగడం లేదని, పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటుంటారు. అయితే మొదటిసారి ప్రసవం అయిన మహిళలకు పిల్లలను హ్యాండిల్ చేయడం, రొమ్ములకు దగ్గరగా పిల్లలను పెట్టుకోవడం, పిల్లలకు సౌకర్యంగా ఉండటం వంటి వాటిలో కాస్త విఫలం అవుతారు. ఇది రోజులు గడిచేకొద్ది అలవాటు అవుతుంది. పిల్లలకు పాలిచ్చేటప్పుడు పెద్దల సహాయం తీసుకుంటే ఇందులో ఇబ్బంది చాలా వరకు అధిగమిస్తారు.

పాలిచ్చే ముందు శుభ్రత..

చాలామంది పిల్లలకు పాలిచ్చే ముందు రొమ్ములను, చనుమొనలను శుభ్రం చేసుకోవడం గురించి మాట్లాడుతుంటారు. అయితే ఇలా శుభ్రం చేయాల్సిన అవసరమే లేదు. పిల్లలు ప్రసవించిన తరువాత తల్లిని వాసన, స్పర్శ ద్వారా గుర్తిస్తారు. చనుమొనలలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీని వాసన కారణంగా పిల్లలు తమ తల్లులను గుర్తిస్తారు. ఇది  పిల్లలకు  ఉపయోగకరమైనది. కాబట్టి పాలిచ్చే ముందు రొమ్ములను శుభ్రం చెయ్యాల్సిన అవసరం లేదు.

పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగించకూడదు..

పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగిస్తే అవి పిల్లలకు చెడు చేస్తాయని చాలామంది అంటారు. అయితే పాలిచ్చే తల్లులు తమ సమస్యలను వైద్యులతో చెప్పేటప్పుడు పిల్లలకు పాలిస్తున్న విషయాన్ని చెప్పాలి. దీన్ని బట్టి వైద్యులు ప్రత్యేక మందులు సిఫారసు చేస్తారు. వీటి వల్ల తల్లీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే వైద్యులు సూచించిన విధంగానే మందులు తీసుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి. సొంతంగా మందులు వాడటం, వైద్యులు చెప్పిన నిర్ణీత కాలం కంటే  ఎక్కువ రోజులు  మందులు పొడిగించి వాడటం చేయకూడదు.

అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిపాలివ్వకూడదు..

తల్లులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలకు పాలివ్వకూడదని చాలా మంది అంటారు. అయితే ఇది తల్లులకు ఉన్న సమస్య పైన ఆధారపడి ఉంటుంది. తల్లి పాలు తాగడం వల్ల పిల్లలో కూడా కొన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే  ఆహారం, పుష్కలంగా ద్రవాలు తీసుకోవడం తల్లులకు ఎంతో ముఖ్యం. అనారోగ్యాన్ని బట్టి వైద్యుల సలహా మీద మాత్రమే పిల్లలకు పాలివ్వడం మంచిది.

తల్లులకు పాల కొరత..

చాలామంది మహిళలు తమకు పాలు తక్కువ పడుతున్నాయని, పిల్లలకు సరిపోవడం లేదని ఫర్యాదు చేస్తుంటారు. అయితే ఇది చాలా వరకు అపోహే అని అంటున్నారు. బిడ్డను రొమ్ముపై సౌకర్యవంతంగా ఉంచుకుని పాలివ్వడంలోనే చాలావరకు పొరపాటు జరుగుతుందట. సౌకర్యవంతంగా పిల్లలకు రొమ్ము అందిస్తే పిల్లలు కూడా కడుపు నిండుగా పాలు తాగుతారు. అలాగే పిల్లలు పాలు ఎంత బాగా తాగితే తల్లులలో పాలు అంత బాగా ఉత్పత్తి అవుతాయి.

ఆహారం..

పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో ఎలాంటి గందరగోళం చెందాల్సిన పనిలేదు. అందరిలానే పాలిచ్చే తల్లులు కూడా సమతుల్య ఆహారం తీసుకోవాలి. తల్లులు ఆరోగ్యంగా ఉన్నంతకాలం వారిలో పాలు ఉత్పత్తి కావడంలో సమస్యలు ఎదురే కావు.

గమనిక:

పై విషయాలు పోషకాహార నిపుణులు, మహిళా వైద్యులు పలుచోట్ల ప్రస్తావించిన అంశాల ఆధారంగా పొందపరచబడినవి.

                                        *నిశ్శబ్ద.