Read more!

మంచం దిగకుండానే కొవ్వు దులిపేద్దాం!

మంచం దిగకుండానే కొవ్వు దులిపేద్దాం!

ఒంట్లో సులువుగా చేరిపోయే రాక్షసి కొవ్వు. ఏమి తింటున్నాం అనేది కాస్త ఆలోచించుకోవడం మానేసి తినడంలో రెచ్చిపోతే శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయి శరీర షేప్ మార్చేసి మనల్ని ఒకానొక అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. అయితే ఆ కొవ్వు తగ్గించుకోవాలి అంటే వ్యాయాయం లేదా ఆసనాలు చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు వణికిస్తున్న చలికి ఉదయం లేవబుద్ది  కాదు, సాయంత్రం అడుగు బయటపెట్టబుద్ది కాదు. అలా వెచ్చగా దుప్పటి కప్పుకుని పడుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. చలికి మన తీరు ఇలాగుంటే ఇక వ్యాయామాలు, యోగాసనాలు ఏమి వేస్తాం?? మనలో చేరిపోయిన కొవ్వును ఎలా మాయం చేస్తాం?? అందుకే కాస్త విభిన్నంగా ఆలోచించాలి. 

విభిన్నత ఎలా??

శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే వ్యాయామం అవసరమే కదా?? అలాంటి వ్యాయామాన్ని ఉదయం లేవగానే అలాగే మంచం దిగకుండా హాయిగా చేసేస్తే ఎలా ఉంటుంది. ఇదే విభిన్నంగా చెప్పుకుంటున్న విషయం. లేచిన వెంటనే వ్యాయామం కోసం ప్రత్యేకంగా అన్ని సిద్ధం చేసుకుని రంగంలోకి దిగడానికి ఓపికతో పాటు చలి తెచ్చిపెట్టే బద్దకం చాలా ఉంటుంది. అందుకే లేవగానే అలా మంచం మీదనే శరీరంతో విన్యాసాలు చేసేయండి.

టిప్ 1:- 

ఇప్పుడు చెప్పుకోబోయే ప్రయోగం కాస్త ధనురాసనంను పోలి ఉంటుంది. కాకపోతే కాళ్ళను చేతులతో బంధించాల్సిన అవసరం ఉండదు.  లేచిన వెంటనే అలాగే మంచం మీదనే బోర్లా పడుకోవాలి. ఇలా పడుకున్న తరువాత కడుపును ఆధారంగా చేసి కాళ్ళను, చేతులను ఒకేసారి మెల్లగా పైకి లేపాలి. ఇలా పైకి లేపిన తరువాత కొన్ని సెకెన్ల పాటు అలాగే ఉండాలి. తిరిగి మాములు స్థితిలోకి రావాలి. ఇలా సెట్ లో ఇరవై సార్లు చేయాలి. ఇలాంటివి అయిదు సెట్లు చేయాలి. దీన్ని చేయడం వల్ల వెన్నెముక భుజాలు బలపడతాయి. నడుము దృఢంగా మారుతుంది. పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. 

టిప్:-2

ఈ రెండవ విధానంలో మంచం మీద చివరలో కూర్చోవాలి. కాళ్ళు నేలకు ఆనుతూ ఉంటాయి. బలాన్ని కాళ్ళ మీద, చేతుల మీద ప్రయోగించి చేతులను మంచం మీద గట్టిగా పట్టుకుని మెల్లగా మంచం మీద నుండి కిందకు దిగాలి. కాళ్ళను ఒంచకూడదు. మంచానికి చేతులు వెనుకగా అలాగే ఆనించి మెల్లిగా కూర్చోవడం లేవడం చేయాలి. దీనివల్ల కాళ్ళు దృఢంగా మారతాయి, చేతులలో బలం పుంజుకుంటుంది. తొడల కండరాలు గట్టి పడతాయి. 

టిప్:- 3

పుషప్స్ తీసే బంగిమను ప్లాంక్ అని అంటారు. మంచం మీద బోర్లా పడుకుని కాలి మునివేళ్ళ మీద, మోచేతులు ఆధారంగా శరీరాన్ని పైకి లేపాలి. ఆ పొజిషన్ లో కనీసం 40 నుండి 45 సెకెన్ల పాటు ఉండాలి. ఆ తరువాత కొన్ని సెకెన్లు విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ తిరిగి ప్లాంక్ చేయాలి. ఇలా నాలుగు నుండి ఐదు సార్లతో మొదలుపెట్టి వాటి సంఖ్య పెంచుకుంటూ పోవాలి. దీనివల్ల శరీరం మొత్తం దృఢంగా మారుతుంది. ముఖ్యంగా భుజాలు, మెడ దృఢమవుతాయి. పక్కటెముకల సామర్థ్యం పెరుగుతుంది. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు ఐస్ లాగా కరుగుతుంది. కీళ్ల నొప్పులు క్రమంగా తగ్గిపోతాయి. బట్టి మెటబాలిజం మెరుగవుతుంది.

పైన చెప్పుకున్నట్టు ముచ్చటగా మూడు ప్రయోగాలు చేశారంటే బద్దకాన్ని కూడా కాదని శరీరంలో కొవ్వు ఫటాఫట్ అంటూ పారిపోతుంది.

                                     ◆ నిశ్శబ్ద.