మహిళల ఫిట్నెస్ మొత్తం పాడుచేసే ఒకే ఒక్క సమస్య ఇదే!

మహిళల ఫిట్నెస్ మొత్తం పాడుచేసే ఒకే ఒక్క సమస్య ఇదే!

ఆహారం అమృతం అనే మాట అందరికీ తెలిసిందే. మనం తినే ఆహారమే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే అతి అన్నది అన్ని విషయాలలో అనర్థాన్నే మిగులుస్తుంది. చాలామంది మహిళలు అతిగా తినే సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాగని తాము అతిగా తింటున్నాం అనే విషయం వారికి మింగుడు పడదు. ఎంత తిన్నా కడుపు నిండినట్టు అనిపించకపోవడం, తిన్న కొంతసేపటికే మళ్లీ ఆకలికావడం. వంటి పరిస్థితులు పదే పదే ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల అతిగా తినడం జరుగుతుంది. అతిగా తిని లావైపోయిన వారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. తిండి తగ్గించాలని అనుకుంటారు కానీ అది సాధ్యం కాదు. బరువు తగ్గడానికి వాకింగ్ చేయడం, వ్యాయామాలు చేయడం మొదలుపెడతారు. కానీ అది కూడా సత్పలితాలను ఇవ్వదు. ఇలా  భీభత్సంగా ఆకలి కావడానికి, అతిగా తినడానికి  కారణం డిప్రెషన్ ఈటింగ్ అనే సమస్య. డిప్రెషన్ ఈటింగ్ మూలాన మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయం మహిళలను కలవరపెడుతుంది. కానీ ఈ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకుని అధిగమించడం వల్ల దీని కారణంగా ఎదురయ్యే ఇతర సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

మహిళల్లో తినడం అనేది భావోద్వేగ విషయాలతో సంబంధం కలిగి ఉంటుందని చాలామంది చెబుతారు. అందుకే చాలామంది మహిళలు  కోపం, ఆవేశం, బాధ మొదలయిన పరిస్థితులలో ఉన్నప్పుడు సాధారణంగా తినేదానికన్నా ఎక్కువగా తింటుంటారు. ఇది నాణేనికి ఒక కోణం అయితే మరొక కోణంలో మహిళలు డిప్రెషన్ ఈటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎంత తిన్నా సాటిసిఫాక్షన్ లేకపోవడం ఒకటైతే, భావోద్వేగాల కారణంగా తినడంలో తృప్తి లభించకపోవడం మరొకటి. ఇవి రెండూ ఒకదానికొకటి సంబంధమై ఉంటాయి. వీటిని సాటిసిపై చేసే ఉద్దేశంలో తినడమనే ప్రాసెస్ సాగుతూ ఉంటుంది. నిజానికి ఇలా జరగడానికి కారణం కార్టిసాల్ హార్మోన్.  

శరీరంలో ధీర్ఘకాలిక ఒత్తిడి కొనసాగినప్పుడు ఈ కార్టిసాల్ విడుదల వేగం అవుతుంది. ఇది ముఖ్యంగా ఆకలిని పెంచుతుంది. ఎంత తిన్నా సాటిసిపై కాకపోవడానిక ఇదే కారణం. అధికశాతం మంది మహిళలు ఉబకాయం, అధికబరువు సమస్యకు  గురికావడానికి ఇదే ప్రధాన కారణం. చాలామంది ఆకలైన ప్రతిసారి తినడమనే పని చేసి తృప్తి పడుతూ ఉంటారు. మరికొందరు తమ ఆకలిని గమనించుకుని దాన్ని కంట్రోల్ చేయలేక ఆహారానికి లొంగిపోతుంటారు. కానీ ఎవరూ దీనికి మూలాన్ని గురించి ఆలోచించరు. మూలాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించరు.  అందుకే ఈ సమస్య కష్టమైనదిగానూ, అధిగమించలేనిది గానూ అనిపిస్తుంది.

డిప్రెషన్ ఈటింగ్ అధిగమించాలంటే..

డిప్రెషన్ ఈటింగ్ కు ప్రధాన కారణం ఒత్తిడి. మానసిక ఒత్తిడి ద్వారా మొదలయ్యే ఈ సమస్య శారీరక సమస్యగా మారుతుంది. దీన్ని అధిగమించాలంటే మానసికంగానూ, శారీరంకగానూ నియంత్రణ సాధించడం చాలా  ముఖ్యం. తిండి మీద నియంత్రణ సాధించాలంటే ఆకలిపేరుతో ఎడా పెడా తినేయకుండా తినేముందు నిజంగానే ఆకలిగా ఉందా? లేక కేవలం మనసుకు అలా అనిపిస్తోందా? అనే విషయాన్ని ఆలోచించడం చాలా ముఖ్యం. దీని వల్ల మానసికంగా కాస్త నియంత్రణకు ఓ మార్గం దొరికినట్టవుతుంది.  ప్రతి రోజూ ఏ సమయంలో ఏ ఆహారం ఎంత మొత్తంలో తింటున్నారో ఒక చిన్న నోట్ లో రాసుకోవడం మంచిది. దీనివల్ల ఆహారం మీద అవగాహన కలుగుతుంది.  తినే ఆహారంలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్ మొదలయినవి లేకుండా జాగ్రత్త పడాలి. వాటిని అందుబాటులో ఉంచుకోకూడదు. ఆకలి వేసినప్పుడల్లా పచ్చిగా తినగలిగే కూరగాయలు, పండ్లు, ఫైబర్ అధికంగా ఉన్న  ఆహారాలు, కేలరీలు ఎక్కువలేకుండా ఉండే ఫుడ్స్ తినడం మంచిది. ఇవి చేస్తూ కార్టిసాల్ హార్మోన్ ను నియంత్రించడానికి ప్రయత్నించాలి.

హార్మోన్లను నియంత్రించడం అనేది ఎప్పుడూ  మనిషి చేతుల్లో చాలావరకూ ఉంటుంది. ప్రతిరోజు ధ్యానం, వ్యాయామం, యోగా, ఉదయం , సాయంత్రం  చిన్నపాటి నడక  మొదలయినవి ఫాలో అయితే  క్రమంగా శరీరంలోని హార్మోన్లను నియంత్రణలోకి తీసుకురావచ్చు.  సాధారణ వైద్యుల నుండి ఆయుర్వేదం వరకు.. పోషకాహార నిపుణుల నుండి ఫిట్నెల్ ట్రైనర్ల వరకు  చాలామంది ఆహారనికి, మహిళలలో ఒత్తిడికి చాలా దగ్గర సంబంధముందని చెబుతున్నారు. మహిళలలో వివిధ దశలలో మారే హార్మోన్లు, ఆ సమయాల్లో మహిళల శరీరంలో కలిగే మార్పులు ఇందుకు ఉదాహరణ.

                                                         *నిశ్శబ్ద.