Depressive disorder
posted on Jul 12, 2011
డిప్రెస్సివ్ డిజార్డర్
Depressive Disorder
మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి సంతోషాన్ని పంచితే, ఒక్కోసారి వైఫల్యం కన్నీళ్ళే మిగులుస్తుంది. విజయం ఉత్సాహాన్ని ఇస్తే, వైఫల్యం మాత్రం చాలా కృంగదీస్తుంది.. మనిషి నానాటికీ డిప్రెషన్ కి లోనవుతుంటాడు , ఫలితంగా తనపై తాను పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతాడు. ప్రతి ఒకరు ఎప్పుడో అప్పుడు ఏదో విషయంలో బాధపడుతూనే ఉంటారు, కానీ ఈ బాధ, నిస్సహాయాత మనల్ని డామినేట్ చేయడం మొదలుపెడితే దానిని డిప్రెస్సివ్ డిజార్డర్ అని కూడా అంటారు.
ఈ డిప్రెసివ్ డిజార్డర్ లోను రెండు రకాలు ఉన్నాయి. మొదటిది మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అయితే రెండవది డైస్తిమిక్ డిజార్డర్. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ సాధారణంగా రెండు మూడు వారాలు మనిషిని డిప్రెషన్ లో ఉండేలా చేస్తుంది. ఫలితంగా నిద్రలేమి, తిండిపై అయిష్టత పెరగడం, బరువులో మార్పు, ఏకాగ్రత లోపించడం, తనపై తానూ నమ్మకాన్ని కోల్పోవడం, ఒక్కోసారి ఈ డిప్రెషన్ లో ఉన్నవారు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు . ఈ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ మనిషిలో కొద్ది కాలమే ఉన్నా, దాని ఫలితాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గాని మనస్థైర్యాన్ని ఇస్తే వీరు త్వరలోనే ఈ డిజార్డర్ నుండి బయటపడగలరు.
ఇక రెండవది డైస్తిమిక్ డిజార్డర్. ఇది సాధారణంగా 16 ఏళ్ళ వరకు ఉంటుంది. డైస్తిమిక్ డిజార్డర్, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ లా ఒక్కసారిగా ప్రభావం చూపకపోయినా అప్పుడప్పుడు మనిషిని పూర్తిగా నిరుత్సాహ పడేలా చేస్తుంది . ఈ డిజార్డర్ ఉన్నవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారో, ఎప్పుడు డిప్రెస్ అయిపోతారో చెప్పడం కష్టం.వీరిలోనూ ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, తనపై తాను నమ్మకం కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి . డిప్రెషన్ ఎలాంటిదైనా ఈ లక్షణాలు ముఖ్యంగా సెన్సిటివ్ గా ఉండేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది . కుటుంబంలోని వారి మధ్య ఉండే సాన్నిహిత్యం , తను పెరిగిన పరిస్థితుల ప్రభావం కూడా డిప్రెషన్ కి కారణమవుతుంది. ఒక్కోసారి మనకు ఎంతో సంతోషాన్ని , బలాన్ని ఇచ్చిన సంఘటనలు, పరిస్థితులు తారు మారయినప్పుడు అవే బలహీనతలైపోతాయి .
ట్రీట్ మెంట్ : రెండు వారాలలోపు మీరు డిప్రెషన్ లోంచి బయటపడటం లేదు అనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించండి . డాక్టర్ సలహాతో పాటు ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి.
- వీలైనంత విశ్రాంతి తీసుకోండి .
- పోషకాహారం తినండి.
- ప్రతిరోజూ వ్యాయామం క్రమం తప్పకుండా చేయండి .
- డ్రగ్స్, ఆల్కహాల్ కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి .
- మీకిష్టమైన ఆక్టివిటీస్ లో పాల్గొంటూ ఉండండి . వీలైనంత వరకు మీ కుటుంబ సబ్యులతో , స్నేహితులతో గడపడానికి ప్రయత్నించండి.
- కౌన్సిలింగ్ తీసుకోండి, వారిచ్చే సలహాలు మీకు ధైర్యాన్ని, ఊరటను కలిగించవచ్చు.
- ప్రార్ధనలు, దైవ కార్యాలలో విరివిగా పాల్గొనండి, ఆధ్యాత్మిక భావన మనసుకు ప్రశాంతతనిస్తుంది.
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోండి , ఇది చేపల్లో అధికంగా ఉంటుంది. విటమిన్ B9 ఉన్న ఆహారాన్ని తీసుకోండి .
వీటన్నింటి కంటే ముందు డిప్రెషన్ లోంచి బయటపడాలి అంటే ముందుగా మీరు దానికి సిద్ధపడాలి. మీ ప్రయత్నం లేకుండా ఎన్ని మందులు వేసుకున్నా, ఎంత కౌన్సిలింగ్ తీసుకున్నా ప్రయోజనం ఉండదు.
కాబట్టి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒడిదుడుకులను ఎదుర్కోవాలి అన్న మనస్థైర్యాన్ని అలవరుచుకోండి. సంతోషంగా ఉండండి.