Read more!

మహిళలకు ఫిట్నెస్ కావాలంటే ఈ పని చేయొద్దు..

మహిళలకు ఫిట్నెస్ కావాలంటే ఈ పని చేయొద్దు..

ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కాలంలో. ఏమి తినాలి?? ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటాం అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ పాటించడమే చేతకాదు. నిజాన్ని నిజంగా చెప్పుకుంటే ఇదే నిజం. చాలా మంది ఆరోగ్యంగా ఫిట్నెస్ గా ఉండాలంటే పోషకాలు తగిన మోతాదులో లభించాలని అనుకుంటారు. శారీరక దృఢత్వానికి సరిపడిన పోషకాలు అవసరమే అయినా వాటిని ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.


కోవిడ్ వచ్చిన సమయాలు గుర్తు చేసుకుంటే ఎంతోమంది తమకు సరిపడా పోషకాలు అందట్లేదని, ఇమ్యూనిటీ తక్కువగా ఉందనే కారణంతో కృత్రిమంగా పోషకాలను తీసుకున్నారు. అంతకు ముందు విటమిన్స్ లోపం అనే సమస్య వస్తే డాక్టర్లు విటమిన్ లోపానికి తగిన పండ్లు, కూరగాయలు వాడమని సలహా ఇచ్చేవారు. కోవిడ్ తరువాత ఈ తీరు మారింది. పండ్లు, కూరగాయలు స్థానంలో విటమిన్ సప్లిమెంట్స్ వచ్చి చేరాయి. ముఖ్యంగా మహిళలకు అంతకు ముందు వరకు కేవలం కాల్షియం టాబ్లెట్స్ మాత్రమే వాడమని సలహా ఇచ్చేవారు. కోవిడ్ తరువాత ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.


ఫిట్టా.. ఫట్టా..


 ఫిట్నెస్ కోసం మార్కెట్లో ఉన్న సప్లిమెంట్స్ అన్ని నిజంగానే ఫిట్నెస్ ను ఇస్తున్నాయా?? అనే ప్రశ్న వేసుకుంటే.. ఫిట్నెస్ ఏ మూల ఉందో వెతుక్కోవాల్సి వస్తోంది. 


సామాజిక మాధ్యమాల్లో కనిపించే యాడ్ లు, ఫేక్ ప్రమోషన్లు చూసి పొరపడేవాళ్ళు ఎక్కువ. మహిళల చర్మం యవ్వనంగా ఉండటానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, చర్మం రంగు మారడానికి విటమిన్ సప్లిమెంట్లు విరివిగా తీసుకుంటుంటున్నారు గత రెండేళ్ల నుండి.


ఆహారం ద్వారా భర్తీ కావాల్సిన పోషకాలను ఇలా భర్తీ చేసుకుంటున్న వీళ్లను ప్రశ్నిస్తే చాలామంది చెప్పే సమాధానం రోజుకు అవసరమయ్యే పోషకాలు, విటమిన్స్ ఆహారంలో దొరకడం కష్టం కదా అని.  ఈ మాటలో నిజమెంత?? 


మనకు రోజులో అవసరమయ్యే పోషకాలు మనకు లభ్యం కావు అనే మాట కాస్త ఆత్మ విమర్శ చేసుకుని నిర్ణయిస్తే బాగుంటుంది.  ప్రతిరోజూ సరిపడిన మోతాదులో ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే 90% పోషకాలు సులభంగానే మనకు లభిస్తాయి. పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, పాల ఆధారిత పదార్థాలు మొదలైన వాటి నుండి, మాంసం, చేపలు మొదలైన వాటి నుండి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే వీటన్నిటిని తీసుకునే అవసరం లేకుండా కేవలం విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుని పోషకాలను భర్తీ చేస్తే శరీర వ్యవస్థ దెబ్బతింటుంది.


విటమిన్ బి12, బయోటిన్, విటమిన్ ఇ, విటమిన్ సి మొదలైనవన్నీ ఇలా సప్లిమెంట్స్ లా తీసుకుంటే శరీర కంధర వ్యవస్థ నుండి కణజాల వ్యవస్థ వరకు అన్నీ దెబ్బ తింటాయి. ఇవి మహిళల్లో ఋతు చక్రానికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే ఇలాంటి సప్లిమెంట్లకు దూరంగా ఉండండి. ఆహారం నుండే పోషకాలను పొందండి.


                                  ◆నిశ్శబ్ద