Anti aging solutions with food
posted on Jul 1, 2011
వయసును తగ్గించే ఆహారం
Anti aging solutions with food
మనం తినే ఆహార పదార్థాలను బట్టి మన వ్యక్తిత్వం నిర్దేశించబడుతుంది అనడంలో సందేహం లేదు, జ్ఞాపక శక్తి మెరుగు పడాలన్నా, మానసిక ఒత్తిడులు తట్టుకోవాలన్నా, జేవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్న కావలసింది ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం.
ఆరోగ్యం వ్యక్తిత్వాన్నే కాదు వృద్ధాప్యాన్ని కూడా నిర్దేశిస్తుంది.. రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, మానసిక ఒత్తిడులు మన చర్మంపై కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా చర్మం ముడతలు పడి కాంతి లేకుండా తయారవుతుంది.. చర్మ సంరక్షణకు ఎంత విలువైన కాస్మొటిక్స్ వాడినా, మన శరీరంలో చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి సమపాళ్ళలో లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే చర్మ సంరక్షణకు మనం తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి మెరుగుపడి చర్మం యవ్వనంగా ఉండటమే కాక కాంతిలీనుతూ ఉంటుంది.
చర్మం కాంతివంతంగా, ముడతలు లేకుండా యవ్వనంగా నిగనిగలాడుతూ ఉండాలంటే ఈ సారి మీరు ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకునేటప్పుడు ఇవి తప్పకుండా ఉండేలా జాగ్రత్తపడండి.
ఆకుకూరలు
ఆకుకూరల్లో విటమిన్ సి, పుష్కలంగా ఉంటుంది, అది చర్మం కాంతివంతంగా ప్రకాశించడంలో దోహదపడుతుంది. అంతేకాదు ఆకుకూరల్లో ఉండే క్యారోటినాయిడ్స్ చర్మం ముడతలను తొలగించి, ఆరోగ్యంగా ఉంచుతుంది.
టమాట
టమాటాల్లో అధిక మోతాదులో ఉండే లైకోపిన్, చర్మాన్ని కాంతిహీనం చేసే సెల్స్ ని అదుపులో ఉంచుతాయి. పచ్చి టమాటాల్లో కంటే వండిన టమాటాల్లో 5 రెట్లు ఎక్కువ లైకోపిన్ ఉంటుంది. చర్మానికే కాదు రకరకాల గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి ఈ లైకోపిన్ దూరంగా ఉంచుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిని మించిన యాంటి ఆక్సిడెంట్ లేదు, వెల్లుల్లిని ఏదో రూపంలో ఆహారంలో ఉండేటట్లు చూసుకుంటే చాలు, ఎన్నో రోగాలు మన దగ్గరికి కూడా రావు, వెల్లుల్లిలో ఉండే ఆంటిసెప్టిక్ , ఆంటి బ్యాక్టీరియల్, ఆంటీ వైరల్స్, స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉంచుతాయి. రక్తాన్ని శుద్ధపరచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్లడ్ ప్రెషర్ ను క్రమబద్ధం చేసి రక్తంలో చెడు కొవ్వును తగ్గించి ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది .
సోయాబీన్
సోయాబీన్ లో ఉండే ఫ్లేవోన్స్ , శరీరంలోని హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కలిగే రుగ్మతలను దూరంగా ఉంచుతుంది. ఇందులో చర్మానికి కావలసిన పోషకాలన్నీ పుష్కలంగా ఉన్నాయి.
వేరుశనగ
వేరు శనగల్లో అధిక మోతాదులో ఉండే విటమిన్ ఇ, సిలీనియం, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తిలో సహకరిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపరచి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి.
ఆపిల్
ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు, రోజుకు ఒక యాపిల్ తిన్నా గంపెడు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో ఏదో ఒకపూట కనీసం ఒక యాపిల్ అయినా తినాలి. ఆపిల్ లో ఉండే సి విటమిన్ చర్మంలోని ముడతలను తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది.
తెలుఫుకున్నారు కదా.. మరి ఇప్పటి నుండి ఇవి మీ ఆహారంలో తప్పకుండా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటారు కదూ.. ఇంకో ముఖ్య విషయం, మంచి ఆహారం తింటే ఎంత ఆరోగ్యమో, ఆరోగ్యానికి కీడు చేసే ఆహారం తింటే అంతే అనారోగ్యం ...
జంక్ ఫుడ్, సిగరెట్లు, ఆల్కహాల్, ఇవి కూడా మన ఆరోగ్యంతో పాటు, మన అందం పై కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి తిండి విషయంలో జాగ్రత్తగా ఉందాం. అందం, ఆరోగ్యం సొంతం చేసుకుందాం.