గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఉన్నాయా? ఈ నిజాలు తెలుసా?
posted on Sep 26, 2024
గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఉన్నాయా? ఈ నిజాలు తెలుసా?
వివాహం తరువాత ప్రతి జంట తల్లిదండ్రులు కావడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూచ్తారు. అందుకోసం తమ ప్రయత్నాలు తాము చేస్తారు. ఆరోగ్యవంతంగా ఉన్న జంట ఎలాంటి సేఫ్టీ పాటించకపోతే ఏడాదిలోపే తల్లిదండ్రులు కాబోతున్నాం అనే వార్త చెప్పగలరు. కానీ వివాహం తరువాత ఏళ్ల సమయం గడిచినా కొందరికి పిల్లలు పుట్టరు. చాలామంది ఈ సమస్య మొత్తం మహిళలలోనే ఉందని అనుకుంటూ ఉంటారు. అయితే గర్బం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే అది కేవలం మహిళలలో ఉన్న సమస్య మాత్రమే కాదు.. కొన్ని రకాల వ్యాధుల కారణంగా ఆ జంటలకు పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి.
గర్భం దాల్చడం అనేది కేవలం మహిళలలోనే కాదు.. మగవారి ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తి, కౌంట్ అనేది మగ వంద్యత్వం కారణంగా తగ్గుతుంది. మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉన్నా మగవారి స్పెర్మ్ నాణ్యతగా లేకపోతే.. వారిలో పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఉంటే మహిళలు గర్భం దాల్చలేరు.
ఎండోమెట్రియోసిస్ అనే వైద్య సమస్య ఉంటుంది. ఈ సమస్యలో కణజాల పొర గర్భాశయం వెలుపల పెరుగుతుంది. ఇది నొప్పికి, పిల్లలు పుట్టకుండా ఉండటానికి కారణమవుతుంది.
భారతదేశంలో 20శాతం మహిళలు పిసిఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 70శాతం మంది మహిళలకు అసలు పిసిఓఎస్ అనే సమస్య గురించి తెలియదు. పిసిఓఎస్ లో ఆండ్రోజెన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. అండాశయాల చుట్టూ చిన్న గడ్డలు ఏర్పడతాయి. ఈ సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చడం జరగదు. జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
మహిళల శరీరంలో థైరాయిడ్ డిజార్ఢర్ లేదా హైపర్ప్రోలాక్టిినిమియా వంటి వంటి హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీరియడ్ సైకిల్ అస్తవ్యస్తం అవుతుంది. అంతేకాదు అండోత్సర్గములో సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ కారణంగా మహిళలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఉంటాయి.
మహిళల గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు, పాలిప్స్, సెప్టెట్ ప్రెగ్నెన్సీ వంటి సమస్యలు ఉన్నప్పుడు గర్బం దాల్చే అవకాశాలు ఉండవు. ఒకవేళ గర్భం దాల్చినా గర్భస్రావం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మహిళలలో ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఇవి అండాశయం నుండి గర్భాశయం వరకు అండాలను తీసుకువెళతాయి. ఈ గొట్టాలు మూసుకుపోయినట్లైతే అండాలు గర్భాశయాన్ని చేరుకోలేవు. దీని కారణంగా మహిళలు ఎంత ప్రయత్నం చేసినా గర్భం దాల్చలేరు.
పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అనే సమస్య మహిళల పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఫెలోషియన్ ట్యూబ్ లను దెబ్బతీస్తుంది. గర్భధారణకు ఆటంకం కలిగిస్తుంది.
ఇప్పట్లో చిన్న వయసులోనే మహిళలు మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు. మధుమేహం, ఇతర వ్యాధులు, స్వయం ప్రతిరక్షక జబ్బులు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సంతానోత్పత్తి మీద ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి సమస్యలున్న మహిళలలో గర్బం దాల్చడం కష్టతరంగా ఉంటుంది.
ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం ఇప్పట్లో జరుగుతోంది. జీవితంలో గోల్స్, సెటిల్ కావడం పట్ల దృష్టి పెట్టి వివాహం ఆలస్యంగా చేసుకుంటున్నవారు పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ముఖ్యంగా 35 దాటిన తరువాత మహిళల అండాల నాణ్యత, పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల గర్భం దాల్చడంలోనూ, పిల్లలు పుట్టడంలోనూ ఇబ్బందులు ఏర్పడతాయి.
గర్భం దాల్చకపోవడానికి ఊబకాయం కూడా కారణం అవుతుంది. అధిక బరువు ఉన్న మహిళలలో హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్ వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక బరువు చాలా తక్కువ ఉన్న మహిళలలో పోషకాహార లోపం, బలహీనత వంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ గర్భం దాల్చడానికి మైనస్ పాయింట్లు అవుతాయి.
*రూపశ్రీ.