మహిళలలో చిన్నతనంలోనే వచ్చే  బోలు ఎముకల వ్యాధి  నివారణకు ఇలా చేయండి..!


మహిళలలో చిన్నతనంలోనే వచ్చే  బోలు ఎముకల వ్యాధి  నివారణకు ఇలా చేయండి..!
 

 


మహిళలు తమ భర్త, పిల్లలు, అత్తమామలు ఇలా కుటుంబం మొత్తాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ తమ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  ఈ అజాగ్రత్తల వల్ల చాలామంది మహిళలు చిన్న వయసులోనే ఎముకలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటిలో ఆస్టియోపోరోసిస్ కూడా ఒకటి. దీన్నే బోలు ఎముకల వ్యాధి అంటుంటారు. మహిళలలో మెనోపాజ్ తరువాత ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్  హార్మోన్లు తగ్గుతాయి.  దీని కారణంగా ఎముకలు బలహీనపడతాయి.


బోలు ఎముకల వ్యాధిని నివారించాలంటే మహిళలు 30 ఏళ్ళ తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


పురుషుల కంటే చిన్న వయస్సులోనే స్త్రీలలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. దీనికి కారణం మెనోపాజ్ ఒకటి అయితే స్త్రీల  జీవనశైలి సరిగా లేకపోవడం మరొకటి. సాధారణంగా 60 ఏళ్ల తర్వాత, ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. కానీ 30 ఏళ్ల తర్వాత ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోని మహిళల్లో ఎముకలు త్వరగా బలహీనపడతాయి.  ఇలాంటి మహిళలు వయసుకు ముందే ఎముకల వ్యాధుల బారిన పడవచ్చు. ఎముకలు బలహీనంగా ఉన్న మహిళలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.


సాధారణంగా స్త్రీలకు 40 ఏళ్ల తర్వాత ఎముకల సాంద్రత సమస్యలు మొదలవుతాయి. మహిళలు ఫ్రీ-మెనోపాజ్ దశలో ఉంటారు.  అంటే వారి పీరియడ్స్ క్రమంగా ఆగిపోవడం ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ హార్మోన్ల లోపం ఉంటుంది. ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ హార్మోన్లు శరీరంలో కాల్షియంను గ్రహించడంలో సహాయపడతాయి. శరీరంలో వీటి లోపం ఏర్పడినప్పుడు ఎముకలు బలహీనపడతాయి. దీని వల్ల రక్తపోటు కూడా ప్రభావితమవుతుంది. మెనోపాజ్ సమయంలో స్త్రీల ఎముకలు బలహీనపడటంతో పాటు రక్తపోటు స్థాయి కూడా అస్తవ్యస్తం కావడానికి కారణం ఇదే.


పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయి తగ్గిపోవడం  ప్రారంభించినప్పుడు ఎముకలు మృదువుగా,  బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా బోలు ఎముకల వ్యాధి,  ఆస్టియోమలాసియా సమస్యలు మొదలవుతాయి. ఆస్టియోమలాసియాలో ఎముకలు మృదువుగా మారుతాయి.  బోలు ఎముకల వ్యాధిలో అవి బలహీనమవుతాయి. చిన్నపాటి గాయమైనా, కిందపడినా ఎముక విరిగిపోతుందేమోనని భయం. కీళ్ల ఎముకలు అరిగిపోవడం ప్రారంభించినప్పుడు కీళ్ళు సరిగ్గా పనిచేయవు. వాటి కదలిక ఆగిపోతుంది. దీని వల్ల కీళ్లలో నొప్పి మొదలవుతుంది. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు.


విటమిన్ డి శరీరంలోని అనేక కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. విటమిన్ డి ఆహారం నుండి కాల్షియంను గ్రహిస్తుంది. విటమిన్ డి లోపం చర్మం ఆకృతిని పాడు చేస్తుంది. చర్మం క్షీణిస్తున్నట్లయితే విటమిన్ డి సప్లిమెంట్లను వైద్యుల సలహాతో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మెనోపాజ్ తర్వాత శరీరంలో విటమిన్ డి లోపం వల్ల స్త్రీల చర్మం మెరుపు తగ్గి ముఖంపై ముడతలు వస్తాయి. సూర్యకాంతి పడని స్త్రీల శరీరంలో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది.


ఎముకలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండాలంటే  జీవనశైలిలో 5 మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజూ సూర్యరశ్మిలో  యోగా,  వ్యాయామం చేయాలి. ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారి ఎముకలు కూడా త్వరగా బలహీనపడతాయి, దానిని నివారించాలి.

ఆహారంలో కాల్షియం, ఫాస్పరస్,  ప్రోటీన్ల లోపం ఉండకూడదు. శరీరంలో విటమిన్ డి తగినంత మొత్తంలో ఉండటానికి ఆహారంలో విటమిన్ డి ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. నిమ్మ, నారింజ, యాపిల్, స్ట్రాబెర్రీ, పైనాపిల్, గుడ్డు, చేపలు, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, బాదం వంటి వాటిని తినడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం ఉండదు.

                                               *రూపశ్రీ.