English | Telugu
విఖ్యాత నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ సౌమిత్ర చటర్జీ కన్నుమూత
Updated : Nov 16, 2020
లెజండరీ బెంగాలీ నటుడు, బెంగాలీ సినిమాను తమ నటనతో సుసంపన్న చేసిన నటుల్లో ఒకరైన సౌమిత్ర చటర్జీ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. అక్టోబర్‌లో ఆయనకు కొవిడ్ 19గా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత ఆయన కొవిడ్ నెగటివ్ వచ్చినప్పటికీ అస్వస్థత నుంచి కోలుకోలేదు. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు కోల్‌కతాలోని బెల్లే వ్యూ క్లినిక్‌లో తుదిశ్వాస విడిచారు.
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సత్యజిత్ రే దర్శకత్వంలో సౌమిత్ర 14 సినిమాల్లో నటించారు. వారి కలయిక దేశం గర్వించదగ్గ సినిమాలను సృష్టించింది. అసలు సౌమిత్ర నటునిగా పరిచయమయ్యిందే సత్యజిత్ డైరెక్ట్ చేసిన 1959 నాటి చిత్రం 'అపుర్ సంసార్'తో. ఆ తర్వాత రే డైరెక్షన్‌లో చారులత, దేవి, తీన్ కన్య, ఘరే బైరే, గణశత్రు లాంటి సినిమాలు చేశారు సౌమిత్ర. అంతేకాదు రే క్రియేట్ చేసిన డిటెక్టివ్ క్యారెక్టర్ 'ఫెలూదా'ను మొదటగా పోషించింది ఆయనే. 'సోనార్ కెల్లా', 'జోయ్ బాబా ఫెలునాథ్' సినిమాల్లో ఆయన ఆ పాత్రను చేశారు. మరో గ్రేట్ బెంగాలీ డైరెక్టర్ మృణాల్ సేన్‌తోనూ కలిసి పనిచేశారు సౌమిత్ర. వారి కలయికలో 'ఆకాశ్ కుసుమ్' లాంటి క్లాసిక్స్ వచ్చాయి.
సౌమిత్ అందుకున్న పురస్కారాలకు లెక్కలేదు. పద్మభూషణ్ గ్రహీత అయిన ఆయనకు సంగీత నాటక అకాడమీ ఠాగూర్ రత్న పురస్కారంతో సత్కరించింది. సినిమాకు సంబంధించిన దేశపు అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను ఆయన 2012లో అందుకున్నారు. అంతర్ధాన్, దేఖా, పడోక్ఖేప్ సినిమాల్లో ప్రదర్శించిన నటనకు గాను మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాలు పొందారు. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం 'లీజియన్ ఆఫ్ ఆనర్'ను రెండు సార్లు అందుకున్న ఘనత ఆయన సొంతం. 1989లో ఓసారి, 2018లో మరోసారి ఆ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.
సౌమిత్ర చటర్జీ నటించిన చివరి చిత్రం 2019లో వచ్చిన 'సంఝ్‌బతి'.
