English | Telugu
బన్నీ `పరుగు`కి 13 ఏళ్ళు
Updated : May 1, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ భలేగా అచ్చొచ్చాయి. వాటిలో `పరుగు` చిత్రం ఒకటి. `ఆర్య` (2004) వంటి బ్లాక్ బస్టర్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తరువాత బన్నీ - నిర్మాత `దిల్` రాజు కాంబినేషన్ లోనూ.. `బొమ్మరిల్లు` (2006) వంటి సెన్సేషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనంతరం దర్శకుడు భాస్కర్ - `దిల్` రాజు కాంబినేషన్ లోనూ వచ్చిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలిచింది. ఈ సినిమాతోనే కథానాయిక షీలాకి తెలుగునాట తొలి విజయం దక్కింది.
మెలోడీబ్రహ్మ మణిశర్మ స్వరసారథ్యంలో రూపొందిన గీతాలన్నీ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ``నమ్మవేమోగానీ.. అందాల యువరాణి` పాట చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``పరుగులు తీయకే``, `మనకన్న పొడిచే``, ``హృదయం``, ``ఎలగెలగా``, ``ఛల్ ఛల్ ఛలో`` కూడా మంచి ఆదరణ పొందాయి. బన్నీ - మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రమిదే కావడం విశేషం.
ప్రకాశ్ రాజ్, సునీల్, సుబ్బరాజు, సప్తగిరి, చిత్రలేఖ, ధన్ రాజ్, శ్రీనివాస రెడ్డి, రజిత, జయప్రకాశ్ రెడ్డి, `చిత్రం` శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో జయసుధ, పూనమ్ బజ్వా, అలీ అతిథి పాత్రల్లో అలరించారు.
హిందీలో `హీరోపంతి`, ఒడియాలో `సంజు ఆవ్ సంజన`, బెంగాలీలో `షేదిన్ దేఖా హోయేఛిలో`, నేపాలీలో `దబాబ్` పేర్లతో రీమేక్ అయిన `పరుగు`కి `తృతీయ ఉత్తమ చిత్రం`, `స్పెషల్ జ్యూరీ` (అల్లు అర్జున్) విభాగాల్లో `నంది` పురస్కారాలు దక్కగా.. `ఉత్తమ నటుడు`గా `ఫిల్మ్ ఫేర్` సొంతమైంది.
2008 మే 1న విడుదలై విజయం సాధించిన `పరుగు`.. నేటితో 13 వసంతాలను పూర్తిచేసుకుంది.