Read more!

English | Telugu

వసుధార చెప్పని ఆ రహస్యాన్ని రిషి తెలుసుకున్నాడా?


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎందుకంటే వసుధార, రిషిల ప్రేమకథని ఇష్టపడని వారంటూ ఎవరుండరు. అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్ -688 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం నాటి ఎపిసోడ్ లో.. రిషి లైబ్రరీలో బుక్స్ చూస్తుండగా.. అటు వైపుగా ఉన్న వసుధార కూడా బుక్స్ చూస్తుంటుంది. అలా వసుధార బుక్స్ అన్నీ చూస్తుండగా ఒక బుక్ కిందపడిపోవడంతో తీస్తుండగా.. వసుధార మెడలో ఉన్న VR లాకెట్ బయటికి వస్తుంది. ఆ లాకెట్  బయటికి వచ్చిన విషయం గమనించుకోకుండా వసుధార బుక్ చదువుకుంటూ వెళ్తుంది. అనుకోకుండా రిషి  బుక్ తీసేసరికి.. అటువైపు ఉన్న వసుధార మెడలోని లాకెట్ కనిపిస్తుంది. రిషి ఒక్కసారిగా షాక్ అయి.. అలానే తనని చూస్తూ ఉండిపోతాడు. రిషి వెంటనే పరుగెత్తుకుంటూ వసుధార ముందుకి వస్తాడు. వసుధార రిషిని చూసి "సర్ మీరేంటిక్కడ" అని అని అడుగుతుంది. వెంటనే రిషి వసుధార మెడలోని లాకెట్ ని చూపిస్తాడు. వసుధార కూడా షాక్ అవుతుంది. ఏంటి వసుధార నా లాకెట్ నీ మెడలో ఏంటని రిషి అడుగుతాడు. అది నాకు నచ్చింది కాబట్టి నేను వేసుకున్నా అని వసుధార చెప్తుంది. ఇంతలోనే ఆఫీస్ బాయ్ వచ్చి సర్ బుక్స్ అని ఇస్తాడు. వెంటనే వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

వసుధార ఆటోలో వెళ్తూ.. రిషి సర్ కోపంలో ఆలోచన లేకుండా తెలుసుకోలేకపోతున్నారంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంతలోనే చక్రపాణి ఫోన్ చేసి.. "ఎక్కడున్నావ్ అమ్మా.. ఎప్పుడొస్తావ్" అని అడుగగా.. "లేట్ అవుద్ది నాన్న" అని అంటుంది. మరోవైపు ఒంటరిగా కూర్చొని రిషి ఆలోచిస్తుంటాడు. నేను ఇచ్చిన లాకెట్ తన మెడలో ఎందుకు వేసుకుంది.. అసలు తన ఉద్దేశ్యం ఏంటి.. ఇప్పుడు నా లాకెట్ తన మెడలో ఎందుకు ఉంది.. నా లైఫ్ ని చిందర వందర చేస్తుంది.. ఈ బాధని భరించలేను అని అనుకొని.. చివరికి ఈ రోజు అటో ఇటో తేల్చుకుంటానని ఆవేశంగా వసుధార ఇంటికి వెళ్తాడు. 

రిషి అక్కడికి వెళ్ళిన తర్వాత.. వసుధార ఎక్కడా? అని చక్రపాణిని అడుగుతాడు. ఇంకా రాలేదు సర్.. లేట్ అవుతుందని చెప్పిందని చక్రపాణి అంటాడు. ఆ తర్వాత చక్రపాణి కాఫీ తీసుకొస్తానని వెళ్ళగానే.. రిషి అద్దంలో చూసుకుంటాడు. అక్కడే ఉన్న ఒక పేపర్ మీద 'రిషిధారలు వేరు వేరు కాదు.. ఐ లవ్ యూ అండి.. ఇట్లు మీ పొగరు' అని రాసి ఉంది చూస్తాడు. అది చూసి రిషి కళ్ళలో ఆనందం చిగురిస్తుంది. వసుధార అన్న ప్రతి మాటను గుర్తు చేసుకొని పట్టరాని సంతోషంతో వెళ్లిపోతుంటాడు. అలా తను వెళ్తుంటే .. "సర్ వసమ్మ ఎక్కడికి వెళ్ళిందో" అని చక్రపాణి అనగానే.. "నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళిందో" అని రిషి చెప్పేసి .. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.