English | Telugu

Sai Kiran Engagement: స్రవంతితో సాయి కిరణ్ ఎంగేజ్ మెంట్.. సోషల్ మీడియాలో వైరల్!


సీరియల్ నటుడు సాయి కిరణ్ తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తన సహనటి స్రవంతితో తాజాగా సాయి కిరణ్‌కి నిశ్చితార్థం అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి శుభవార్త చెప్పాడు. అయితే గతంలోనే సాయి కిరణ్‌కి పెళ్లి జరిగి విడాకులయ్యాయి. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉన్న సాయి కిరణ్ తాజాగా మరోసారి ఏడడుగులు వేయబోతున్నాడు.

సాయి కిరణ్ వెండితెరతో పాటు బుల్లితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో పలు సినిమాల్లో హీరోగా చేసిన సాయి కిరణ్.. ప్రస్తుతం బుల్లితెరపై కీలక పాత్రలు పోషిస్తూ ఎన్నో హిట్ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో మహేంద్ర పాత్రలో సాయి కిరణ్ నటన ఆడియన్స్‌ను ఫిదా చేసింది. తాజాగా ఆయన తన అభిమానులకి ఓ శుభవార్త చెప్పాడు. చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్న సాయి కిరణ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అదే విషయం చెప్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో‌ పోస్ట్ చేశాడు. 

కోయిలమ్మ సీరియల్‌లో తనతో పాటు నటించిన స్రవంతితో సాయి కిరణ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ విషయాన్ని సాయి-స్రవంతి ఇద్దరు కలిసి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. "నువ్వు + నేను = ఎప్పటికీ.. ఎంగేజ్‌మెంట్" అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫొటోలు షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసి బుల్లితెర సెలబ్రెటీలు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. గుప్పెడంత మనసు రక్ష గౌడ, కీర్తి భట్, కరుణ భూషణ్, కార్తీక దీపం నిరుపమ్, ప్రియాంక జైన్ ఇలా పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెప్పారు.