Read more!

English | Telugu

వసుధారకి పూలు కొనిచ్చిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.‌ ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్‌-706 లో.. మినిస్టర్ ఇంటికి రిషి, వసుధార భోజనానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు కలిసి భోజనం చేస్తుండగా.. మీరిద్దరు ఎప్పుడు? ఎక్కడ? కలిసారని మినిస్టర్ రిషిని అడిగేసరికి అతను తడబడతాడు. దాంతో అతనికి వాటర్ ఇస్తూ ఎవరో తలుచుకుంటున్నట్టు ఉన్నారని వసుధార అంటుంది. అది విని మినిస్టర్ ఇంకెవ్వరు జగతి, మహేంద్రలే తలుచుకుంటారని అంటాడు. కాసేపు మాట్లాడాక మినిస్టర్ ఇంటి దగ్గర నుండి బయల్దేరి వచ్చేస్తారు.

రిషి కార్ ని మధ్యలో ఒక దగ్గర ఆపుతాడు. అక్కడ రిషి, వసుధార పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుంటారు. "ఈ రోజు మన ప్రయాణంలో ఏమైనా మార్పు కనిపించిందా వసుధార" అని రిషి అడుగుతాడు. "ఆ కనిపించింది సర్.. ఇన్ని రోజులు మీకు అసిస్టెంట్ గా వచ్చాను.. ఈ రోజు మీ భార్యగా వచ్చాను" అని వసుధార చెప్పింది. "మనల్ని ప్రపంచమంతా భార్యాభర్తలనే అనుకుంటున్నారు కదా సర్" అని వసుధార అనగా.. "అనుకోవడం వేరు వాస్తవం వేరు కదా" అని రిషి అంటాడు. "మీరు అందరి ముందు ఒప్పుకున్నారు కదా సర్.. ఇప్పుడేంటి ఇలా అంటున్నారు" అని వసుధార అడుగుతుంది. అందరి ముందు నువ్వు తలదించుకోకూడదని అలా చెప్పానని రిషి అనగానే.. "మీరు నన్ను భార్య అని చెప్పుకోవడం సంతోషంగా లేదా సర్?" అని అడుగుతుంది. "సగం సంతోషం ఉంది‌.. మిగతా సగం బాధ ఉంది.. ఎందుకు అలా చేసావ్? నీ మీద ప్రేమ తగ్గదు.. గౌరవం తగ్గదు.. నువ్వు నా భార్యగా రావాలంటే నా  మనసుకు చేసిన గాయం తగ్గాలి" అని రిషి అంటాడు. 

అంతలోనే పూలు అమ్మే ఆమె వస్తుంది. "మీరిద్దరు భార్యాభర్తలా అమ్మా?" అని పూలమ్మే ఆమె అడుగగా.. "అవును మా వారే" అని వసుధార అంటుంది. తర్వాత వసుధారకి పూలు కొనిస్తాడు రిషి. కాసేపటికి ఇద్దరు అక్కడి నుండి బయల్దేరతారు. వసుధార ఇంటి ముందు రిషి కార్ ఆపుతాడు. వసుధార తనని పిలిస్తే ఇంట్లోకి వెళదామని రిషి అనుకుంటాడు. మరి తను రిషిని ఇంట్లోకి పిలుస్తుందా? లేదా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు  ఆగాల్సిందే.