Read more!

English | Telugu

ఆస్కార్‌ తెచ్చిన కలాన్ని సౌజన్యకు బహూకరించిన చంద్రబోస్!

ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌2తో సంగీత ప్రపంచంలో సరికొత్త జోరు కనిపిస్తోంది. తాజా ఎపిసోడ్ కి ఆస్కార్‌ విజేత, ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

తెలుగు సినీ సంగీతంలో అజరామరమైన కొన్ని గీతాలను పోటీదారులు ఎంపిక చేసుకుని పాడిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందరిలోనూ సౌజన్య భాగవతుల ప్రత్యేక స్థానాన్న ఆక్రమించారు. 'నాని' సినిమాలోని 'పెదవే పలికిన మాటల్లోనే' గీతాన్ని ఆలపించారు సౌజన్య. ఆ పాటను ఆమె పాడిన తీరుకు ఉప్పొంగిపోయారు చంద్రబోస్‌. అద్వితీయమైన గళం అంటూ ప్రశంసించి తన కలాన్ని ఆమెకు బహూకరించారు. 

ఆస్కార్‌ అవార్డు అందుకున్న నాటు నాటు గీతాన్ని రాసిన కలం అంటూ ఆ కలం గురించి పరిచయం చేశారు. అనూహ్యమైన ఆ క్షణాలను పదిలపరచుకున్నారు సౌజన్య. న్యాయనిర్ణేతలకు, సహ గాయనీగాయకులకు తన ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఆమె మాట్లాడుతూ ''చంద్రబోస్‌గారి నుంచి ఈ కలం అందుకోవడం గర్వంగానూ, గౌరవంగానూ భావిస్తున్నాను. నా చిరకాల స్వప్నం నెరవేరింది. సంగీతంలో మరెన్నో ఎత్తులకు చేరుకోవాలన్న ఆకాంక్ష బలోపేతమైంది. అత్యంత గొప్ప అవకాశం ఇది'' అని అన్నారు. 

చంద్రబోస్‌ మాట్లాడుతూ ''ఆహా తెలుగు ఇండియన్‌ ఐడటల్‌2లో పాల్గొనడం చాలా ఆనందంగా అనిపించింది. అత్యద్భుతమైన ప్రతిభావంతులున్నారు ఇక్కడ. తెలుగు సినీ సంగీతానికి వీరందరూ గొప్ప ఆస్తి. సౌజన్య ప్రతిభ నన్ను అబ్బురపరిచింది. తన స్వరంతో, సంగీతంతో ఆమె మరెన్నో మెరుపులు కురిపిస్తుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.