English | Telugu

"నిప్పు"యాక్షన్ ఎంటర్ టైనర్- వై.వి.యస్.చౌదరి

"నిప్పు"యాక్షన్ ఎంటర్ టైనర్ అని ఆ చిత్ర నిర్మాత వై.వి.యస్.చౌదరి అన్నారు. వివరాల్లోకి వెళితే తమ బొమ్మరిల్లువారి పతాకంపై, శ్రీమతి యలమంచిలి గీత సమర్పణలో, మాస్ మహరాజా రవితేజ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, నటకిరీటి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా, టాప్ టెక్నీషియన్ గుణశేఖర్ దర్శకత్వంలో, వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న చిత్రం"నిప్పు". ఈ "నిప్పు" చిత్రం గురించి తెలుగువన్ డాట్ కామ్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్ వ్యూలో వై.వి.యస్.చౌదరి ఈ విధంగా అన్నారు.

1) తెలుగువన్ - ఏ నిర్మాతైనా లైమ్ లైట్ లో ఉన్న దర్శకుణ్ణి తన సినిమాకి ఎన్నుకుంటారు...మరి వరసగా ఫ్లాపులిచ్చిన గుణశేఖర్ ని మీ చిత్రానికి ఎంచుకోటానికి కారణం ఏమిటి...?

వై.వి.యస్.చౌదరి - భయ్యా... గుణ శేఖర్ ఒక మంచి టెక్నీషియన్ అనే విషయం మనందరికీ తెలుసు. మీరు అతని ఫ్లాపులే చూస్తున్నారు. దర్శకుడిగా అతని సమర్థతని నేను చూశాను. అలాగంటే " సొగసు చూడతరమా, బాలరామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్" వంటి హిట్లు కూడా గుణశేఖర్ తీశాడు...! ఇక హిట్లు, ఫ్లాపులు అన్నవి మహా మహా వారికే తప్పలేవు. మనమెంత...చెప్పండి. హిట్టిచ్చి ఫ్లాపిచ్చిన వారున్నారు...అలాగే ఫ్లాపులిచ్చి హిట్లిచ్చిన దర్శకులు కూడా మనకి ఎంతో మంది ఉన్నారు.

అందుకని హిట్లు, ఫ్లాపులూ పక్కనబెట్టి దర్శకుడిగా అతనేంటో నాకు తెలుసు గనక ఆయన్ని దర్శకుడిగా నా "నిప్పు" సినిమాకి ఎన్నుకున్నాను. అదీ గాక మద్రాసులో అనూరాధ గారు తన కారుషెడ్డుని రెండు రూములుగా చేశారు. పై రూములో నేను, రవితేజ ఉండేవాళ్ళం. కింద గుణశేఖర్ గారుండేవారు. అప్పుడు అందరం స్ట్రగులవుతున్నవాళ్ళమే. ఇప్పుడు నాకు దర్శక, నిర్మాతగా , రవితేజకు హీరోగా, గుణశేఖర్ కి దర్శకుడిగా ఒక గుర్తింపు వచ్చింది. అన్నట్టు "నిప్పు"మా బ్యానర్ లో వస్తున్న ఐదవ చిత్రం.

2) తెలుగువన్ - గుణ శేఖర్ సినిమా కావాలని మిమ్మల్ని అడిగారా...? లేక మీరే మీ సినిమాకి దర్శకత్వం వహించమని గుణశేఖర్ ని అడిగారా...?

వై.వి.యస్.చౌదరి - నేనే నా సినిమాకి దర్శకత్వం వహించమని గుణశేఖర్ ని అడిగాను. ఆయన నాకు రెండు కథలు చెప్పారు. రెండూ బాగున్నా "నిప్పు" కథ నాకు ఇంకా బాగా నచ్చింది. అందుకే దాన్ని "నిప్పు" సినిమాగా మీ ముందుకి తెస్తున్నా.

3) తెలుగువన్ - గుణశేఖర్ సినిమా తీయటానికి బాగా టైమ్ తీసుకుంటారనీ, బాగా లావిష్ గా సినిమాకి ఖర్చు చేస్తారనీ, అవసరమున్నా లేకున్నా భారీ సెట్స్ వేయిస్తారనే అపవాదు ఉంది. మరి మీ "నిప్పు" సినిమా విషయంలో ఏం జరిగింది...?

వై.వి.యస్.చౌదరి - నాకు తెలిసి ఏ దర్శకుడూ అలా చేయరు. ఒక మధ్య తరగతికి చెందిన కథకి భారీ సెట్లు అవసరం లేదు. అలాగే కథ డిమాండ్ చేసినప్పుడు భారీ సెట్ వేయాల్సి వస్తుంది. ఒక్కడు సినిమాకి చార్మినార్ సెట్ అవసరం ఉంది. అందుకని ఆ సెట్ వేశాడు. సోగసు చూడ తరమా సినిమాకి ఎటువంటి సెట్లు వేయించలేదే గుణ శేఖర్...!

ఇక అతనెప్పుడూ 120 రోజుల్లోనే తన సినిమాలను పూర్తి చేశాడు. కాకపోతే షూటింగ్ కి వెళ్ళే ముందు కథ కోసం, స్క్రిప్ట్ గురించి అతను ఎక్కువగా సమయం కేటాయిస్తాడు. అది చాలా మంది దర్శకులు చేసే పనే. ఆ మాత్రం సమయం ఒక దర్శకుడు తీసుకోవటం సహజం.

4) తెలుగువన్ - మీరు దర్శకత్వం తెలిసిన నిర్మాతగా గుణశేఖర్ తో సినిమా తీసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏమిటి...?

వై.వి.యస్.చౌదరి - మా "నిప్పు" సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక ఆరేడు సార్లు మాత్రమే నేను లొకేషన్లకు వెళ్ళాను. ఇంకా చెప్పాలంటే "నిప్పు" షూటింగ్ టర్కీలో ఇస్తాంబుల్లో జరుగుతూంటే, నేను "రేయ్" షూటింగ్ బ్యాంకాక్ లో చేస్తున్నా. దీన్ని బట్టి మీరు ఈ సినిమా మీద నేనెంత కాన్ఫిడెంట్ గా ఉన్నానో అర్థం చేసుకోవచ్చు.

5) తెలుగు వన్- మీరు, రవితేజ, గుణశేఖర్ ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు...దాని ద్వారా ప్రేక్షకులకు "నిప్పు" సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు....?

వై.వి.యస్.చౌదరి - మా ముగ్గురి కలయికలో "నిప్పు" సినిమా వస్తుందనేది ఒకటి. నేను దర్శకుడినై ఉండి గుణశేఖర్ దర్శకత్వంలో సినిమా ఎందుకు తీస్తున్నాను అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించటానికి రెండు. మా ముగ్గురి కలయికలో వస్తున్న "నిప్పు" చిత్రం ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి కలిగించటం అనేది మూడోది.

6) తెలుగువన్ - మీ "నిప్పు" సినిమా" హైలైట్స్ ఏమిటి...?

వై.వి.యస్.చౌదరి - హీరో మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు గుణశేఖర్, సంగీత దర్శకుడు తమన్ అందించే సంగీతం, నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, హీరోయిన్ దీక్షా సేథ్ గ్లామర్ ప్లస్ నటన, అలాగే మంచి కథ ఇవన్నీ మా "నిప్పు" సినిమాకి ప్లస్ పాయింట్స్.

7) తెలుగు వన్ - ఇంతకీ "నిప్పు" ఆడియో ఎప్పుడు రిలీజ్‍ చేస్తున్నారు....?

వై.వి.యస్.చౌదరి - సంక్రాంతి పండుగకు మా "నిప్పు" చిత్రం ఆడియో విడుదల చేస్తాము...జనవరి 26 న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తాము.

8) తెలుగువన్ - అదేంటి ఆడియో రిలీజ్ కాకుండానే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తామని ఎలా చెప్పగలరు...?

వై.వి.యస్.చౌదరి - తమన్ మా "నిప్పు" సినిమాకి అందించిన సంగీతం అంత గొప్పగా ఉంది. అందుకే "నిప్పు" ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తామని చెపుతున్నాను. ఎందుకంటే మా "నిప్పు" చిత్రం ఆడియో మీద నాకంత నమ్మకం ఉంది.

9) తెలుగువన్ - చివరిగా వేరే దర్శకులు మీ దర్శకత్వంలో సినిమా తీస్తామంటే మీరు అంగీకరిస్తారా...?

వై.వి.యస్.చౌదరి - ఎందుకు చేయను...? తప్పకుండా చేస్తాను బ్రదర్...హ్యాపీగా చేస్తాను....!

10) తెలుగువన్ - మా తెలుగు వన్ తరపున మీ "నిప్పు" చిత్రం ఘనవిజయం సాధించాలని ఆశిస్తూ, మీకు అభినందనలు తెలుతున్నాను. ఇంత సేపూ మీ విలువైన సమయాన్ని మా తెలుగు వన్ ప్రేక్షకుల కోసం కేటాయించి, మీ అనుభూతులను, అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు.

వై.వి.యస్.చౌదరి - థ్యాంక్యూ భయ్యా...అలాగే మన తెలుగు వన్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ యియర్, హ్యాపీ సంక్రాంతి...మా "నిప్పు" చిత్రాన్ని థియేటర్లోనే చూడండి...పైరసీ నుండి సినీ పరిశ్రమను కాపాడండి.